నేడు ఢిల్లీలో మమత సమావేశం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తలపెట్టిన విపక్షాల సమావేశం నేడు జరగనుంది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తలపెట్టిన విపక్షాల సమావేశం నేడు జరగనుంది. ఇప్పటికే కొన్ని పార్టీలు ఈ సమావేశానికి దూరమని ప్రకటించాయి. సీపీఎం తాము రాలేమని ఇప్పటికే ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి కూడా ఎవరూ హాజరుకావడం లేదు. కాంగ్రెస్ పార్టీని ఈ సమావేశానికి పిలిచినందున తాము హాజరుకాకూడదని నిర్ణయించింది. తాము కాంగ్రెస్, బీజేపీలకు సమానదూరమని ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
టీఆర్ఎస్ దూరం...
మమత బెనర్జీ రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి ఎంపిక కోసం ఈరోజు ఢిల్లీలోని కాస్మోపాలిటన్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ తో సహా బీజేపీయేతర పార్టీలను మమత ఆహ్వానించారు. మొత్తం 22 మంది ప్రతిపక్ష నేతలకు లేఖలు రాశారు. ఈరోజు రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తాను ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. మరి సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.