వడగండ్లు ఎలా ఏర్పడుతాయి ? వాటిని తింటే ఏమవుతుంది ?
దట్టంగా ఏర్పడిన క్యుములోనింబస్ మేఘాలు..65000 అడుగుల వరకు చేరుకుని ఉరుములతో నిండి ఉంటాయి. క్యుములో నింబస్ మేఘాల్లో
వడగండ్ల వాన. ప్రస్తుతం సమయం కాని సమయంలో కురుస్తూ.. తెలుగు రాష్ట్రాల రైతుల కళ్లలో కడగండ్లయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో మూడ్రోజులుగా ఏపీ, తెలంగాణల్లోని కొన్నిప్రాంతాలు భారీ వర్షాల్లో తడిసి ముద్దవుతున్నాయి. ఉరుములు, మెరుపులతో పాటు అక్కడక్కడా పిడుగులు పడుతుండటంతో.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. నేడు కూడా భారీ వర్షాలు కొనసాగుతాయని తెలిపింది.
కాగా.. వడగండ్ల వాన ఎలా పడుతుంది ? అసలు ఆకాశంలో నుంచి మంచుగడ్డలు వానలా ఎలా కురుస్తాయి ? వాటిని తింటే ఏమవుతుంది ? ఇలాంటి చాలామందికి ఇలాంటి సందేహాలున్నాయి. వడగండ్ల వాన.. దీనిని వాతావరణ పరిభాషలో ఘన వర్షపాతం అంటారు. క్యుములో నింబస్ మేఘాలలో సూపర్ కూలెడ్ నీటి బిందువులు కలయిక వలన మేఘాల మధ్య పొరలలో ఏర్పడుతాయి. వడగండ్ల వాన పడటం అనేది.. అప్పటి వాతావరణ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.
దట్టంగా ఏర్పడిన క్యుములోనింబస్ మేఘాలు..65000 అడుగుల వరకు చేరుకుని ఉరుములతో నిండి ఉంటాయి. క్యుములో నింబస్ మేఘాల్లో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. భూమి పై చెట్ల వల్ల చల్లగాలి వీచి వాతావరణం చల్లబడినప్పుడు ఈ మేఘాలు కూడా చల్లబడతాయి. దీని వల్ల మేఘాలలోని నీటి తుంపరలు కూడా చల్లబడి గడ్డ కట్టుతాయి. ఈ చిన్న మంచు రేణువులు కింద పడేటప్పుడు గాలి ఒత్తిడికి గురై అవి కలిసిపోయి వడగళ్లుగా మారుతాయి.
ఘనీభవించిన నీటి తుంపరలు గాలి ఊర్థ్య పీడనం వల్ల దగ్గర దగ్గరగా చేరి చిన్న మంచురాయిగా ఏర్పడుతుంది. కానీ గాలిపీడనం వల్ల ఈ చిన్నరాయి మేఘం గుండా పైకి ప్రయాణిస్తుంది. అలా వెళ్లేటప్పుడు ఇతర చిన్న చిన్న మంచురాళ్లను తాకి ఆకర్షించి, కాస్త పెద్దరాయిగా మారుతూ పోతుంది. అలా మారేటప్పుడు గుప్తోష్ణము (Latent heat) విడుదల అయి మంచురాయి వెలుపలికి చేరుతుంది. దీని వల్ల మంచురాయి ఉపరితలం కాస్త ద్రవరూపంలో వుండి బంక బంకగా తయారవుతుంది. దీని వల్ల ఇంకా కొన్ని చిన్న చిన్న మంచురాళ్లు వచ్చి ఈ పెద్ద మంచురాయికి అంటుకుపోతుంది. అందుకే వడగళ్లు రకరకాల ఆకారాలలో సైజులలో ఉంటాయి. వాటినే మనం వాడుకభాషలో వడగండ్లు లేదా వడగళ్ల వాన అని పిలుస్తాం.
వడగండ్ల వాన పడినపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటివల్ల పంట నష్టమే కాదు.. ఒక్కోసారి మనుషుల ప్రాణాలు సైతం పోవచ్చు. ఏప్రిల్ 30, 1888 రోజున ఉత్తరప్రదేశే లో కురిసిన విపరీతమైన వడగండ్ల వాన వల్ల 230 మంది మనుషులు చనిపోయారు. అప్పట్లో ఒక్కో వడగండు బత్తాయి సైజులో పడిందని సమాచారం. ఆ తర్వాత అంతపెద్ద వడగండ్లవాన పడిన దాఖలాలు లేవు.
మన పూర్వీకులు వడగండ్ల వాన పడినపుడు, ఆ మంచు గడ్డలను తింటే ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉంటుందని వారి నమ్మకం. అప్పట్లో అలానే తినేవారు. కానీ.. ఇప్పుడున్న వాతావరణమంతా పూర్తి కాలుష్యంతో కూడుకుని ఉంది. ఇలాంటి వాతావరణంలో.. స్వతహాగా ఏర్పడిన మంచుముద్దలను తిన్నా అనారోగ్యమేనని నిపుణులు చెబుతున్నారు. వడగండ్లు కూడా పూర్తి రసాయనాలతో ఏర్పడుతాయని, వాటిని తినకపోవడమే మేలని హెచ్చరిస్తున్నారు.