Vijayakanth : పేరులోనే ఉంది విక్టరీ.. అదే ఆయనకు అన్నింటా సొంతమయింది
సినీనటుడు విజయ్‌కాంత్ మరణంతో తమిళ సినీ పరిశ్రమ ఒక దిగ్గజాన్ని కోల్పోయినట్లయింది
విజయ్‌కాంత్ తమిళనాడు సినీ అభిమానులకు ఈ పేరు గూస్ బమ్స్ తెప్పిస్తుంది. ఆయన పేరులోనే కాదు సినిమాల పరంగా కూడా విజయవంతంగా ఎదిగారు. అలాగే రాజకీయాల్లోనూ ఆయన ఇతర నటుల కంటే విజయాలనే చవిచూశారు. విజయ్‌కాంత్ అసలు పేరు విజయ్‌రాజ్ అలగర్ స్వామి. ఆయన 1952 ఆగస్టు 25న జన్మించారు. విజయ్‌కాంత్ నటించిన అనేక సినిమాలు తెలుగు రాష్ట్రాల్లోనూ డబ్బింగ్ అయి విడుదల కావడంతో ఆయన ఇక్కాడ సుపరిచితుడే. కెప్టెన్ సినిమా నుంచి ఆయన కెరీరీ మరో మెట్టు అధిగమించింది.
పోలీసు అధికారిగా...
విజయకాంత్ ఎక్కువగా తన సినిమాల్లో డబుల్ యాక్షన్ చేయడంలో దిట్ట. ఎక్కువగా ఆయన సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను అలరించారు. పోలీసు అధికారిగా విజయ్‌కాంత్ ను చూసిన వారు ఎవరైనా ఆయనలా ఉండాలనుకుంటారు. అలా పోలీసు అధికారి పాత్రలో ఒదిగిపోయి నటించిన విజయకాంత్ ను కెప్టెన్ గా ముద్దుగా ఆయన అభిమానులు పిలుచుకుంటారు. దాదాపు 20కి పైగా సినిమాల్లో ఆయన పోలీసు అధికారిగా నటించాడంటే ఆ పాత్ర అంటే ఆయనకు ఎందుకంత మక్కువో చెప్పకనే తెలుస్తుంది.
వందో సినిమాగా...
విజయ్‌కాంత్ తొలిసారిగా 1979లో ఇనిక్కుం ఇలామై చిత్రంలో నటించారు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. విజయ్‌కాంత్ వందో చిత్రంగా కెప్టెన్ ప్రభాకరన్ చిత్రం విడుదలయింది. 1991లో విడుదలయిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను బద్దలు చేసింది. రికార్డులను క్రియేట్ చేసింది. అప్పటినుంచే కెప్టెన్ గా పేరు వచ్చింది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఆయన సినిమాల్లో నటించారు. ఆయనకు తమిళనాడు అంతటా పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. ఆయనను చూడాలని రోజూ ఇంటివద్దకు వందల సంఖ్యలో ఇప్పటికీ ఫ్యాన్స్ బారులు తీరుతున్నారంటే ఆయనకున్న క్రేజ్ కు మరో ఉదాహరణ చెప్పాల్సిన పనిలేదు.
రాజకీయాల్లోనూ రాణించి...
విజయ్‌కాంత్ 2005లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. దేశీయ ముర్పొక్కు ద్రవడి కళగం అనే పార్టీని స్థాపించారు. ద్రవిడ పార్టీగా ఇది ముద్రపడింది. అయితే 2006లో మాత్రం ఒక్క సీటులోనే గెలుచుకున్న డీఎండీకే, 2011లో జరిిన ఎన్నికల్లో 41 నియోజకవర్గాల్లో పోటీ చేసి 29 స్థానాల్లో గెలుపొందారు. 2011 నుంచి 2016 వరకూ ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశాడు. గతకొద్ది రోజుల నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత ఎన్నికల సందర్భంగా కూడా ఆయన బయటకు రాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. విజయ్‌కాంత్ కు ప్రేమలతను వివాహం చేసుకున్నాడు. విజయ్‌కాంత్ కు ఇద్దరు కుమారులున్నారు. విజయ్ ప్రభాకర్, షణ్యుగ్ పాండ్యన్ లు. షణ‌్ముగ పాండ్యన్ మాత్రం సినీ రంగంలోకి ప్రవేశించారు. ఆయన మృతితో తమిళ సినీ పరిశ్రమ ఒక దిగ్గజాన్ని కోల్పోయింది.