ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. బహుముఖ పోటీ ఉండటంతో ఆలేరు ప్రజలు ఎటువైపు మొగ్గుతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని టీఆర్ఎస్ శథవిధాలా ప్రయత్నిస్తుంటే ఆలేరును ‘హస్త’గతం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కాగా, ఐదుసార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు దళిత బహుజన ఫ్రంట్ నుంచి బరిలో ఉన్నారు. ఇక బీజేపీ తరపున దొంతిరి శ్రీధర్ రెడ్డి, బీఎస్పీ తరపున కల్లూరి రామచంద్రారెడ్డి కూడా బలమైన అభ్యర్థులుగానే ఉన్నారు. దీంతో ఇక్కడ ఆసక్తికరమైన పోరు నెలకొంది.
టీఆర్ఎస్ అభ్యర్థిపై వ్యతిరేకత...
ఆలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ కి మంచి పట్టుంది. 2004లో కూడా ఇక్కడి నుంచి టీఆర్ఎస్ విజయం సాధించింది. గత ఎన్నికల్లో గొంగిడి సునీత పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి బిక్షమయ్యగౌడ్ పై 31 వేల భారీ మెజారిటీతో విజయం సాధించారు. తర్వాత ఆమెకు విప్ గా అవకాశం కల్పించారు. ఈ ఎన్నికల్లోనూ మొదటి లిస్టులోనే ఆమె పేరు ప్రకటించడంలో రెండు నెలలుగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే, గొంగిడి సునీతపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ఆమె నాలుగున్నరేళ్ల పాటు అందుబాటులో లేరని, అభివృద్ధి చేయలేదని, ఆమె భర్త మహేందర్ రెడ్డి పెత్తనం ఎక్కువ సాగిందని, ఆయనపై పలు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక సునీతకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ లోనే పెద్దఎత్తున అసంతృప్తులు ఉన్నారు. వారంతా నామినేషన్ల గడువు వరకు కూడా ఇక్కడి నుంచి కేసీఆర్ పోటీ చేయాలని, సునీతకు టిక్కెట్ ఇస్తే ఓడిపోతుందని పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ, సునీతకే టిక్కెట్ దక్కడంతో వారంతా తరుగుబావుటా ఎగరేశారు. తుర్కపల్లి జెడ్ పీటీసీతో పాటు పలు మండలాల నుంచి పెద్దఎత్తున నాయకులు కాంగ్రెస్ గూటికి చేరడం టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. అయితే, యాదాద్రి అభివృద్ధి విషయంలో మాత్రం ఆమెకు కొంత సానుకూలత ఉంది. ఇక తపాసుపల్లి జలాలను నియోజకవర్గానికి తీసుకురాలేకపోయారనే అసంతృప్తి, గుండాల మండలాన్ని జనగాం జిల్లాలో చేర్చడం పట్ల అసంతృప్తి ప్రజల్లో ఉంది. అయితే, గుండాల మండలాన్ని మళ్లీ యాదాద్రి జిల్లాలో కలుపుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
ప్రధాన పోటీలో ఐదుగురు అభ్యర్థులు
ఇక కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్ మళ్లీ బరిలో దిగుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా ఆయన నియోజకవర్గంలో పట్టు కోల్పోకుండా చూసుకున్నారు. పోటీలో బీసీ అభ్యర్థి ఆయన ఒక్కరే ఉండటంతో నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న బీసీల ఓట్లు కలిసివస్తాయని భావిస్తున్నారు. టీఆర్ఎస్ పై, సునీతపై ఉన్న వ్యతిరేకత కూడా తన గెలుపునకు అవకాశంగా భావిస్తున్నారు. ఇక నియోజకవర్గంలో ఒకప్పుడు తిరుగులేని నాయకుడిగా ఉన్న మోత్కుపల్లి నరసింహులు బీఎల్ఎఫ్ తరపున బరిలో ఉన్నారు. ఆయన తన పాత పరిచయాలతో విజయం కోసం కష్టపడుతున్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలని, తనను గెలిపిస్తే నియోజకవర్గానికి గోదావరి జలాలు తీసుకువస్తానని హామీ ఇస్తున్నారు. ఆయనకు ఉన్న పేరు, కొన్ని వర్గాల మద్దతుతో భారీగానే ఓట్లు సాధించే అవకాశం ఉంది. ఇక బీజేపీ నుంచి యువనేత దొంతిరి శ్రీధర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన చాలా రోజులుగా నియోజకవర్గంలో పనిచేస్తూ గ్రామగ్రామాన కొంత క్యాడర్ తయారుచేసుకున్నారు. మార్పు కోసం ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే...
బీఎస్పీ నుంచి కల్లూరి రామచంద్రారెడ్డి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ తరపున పోటీచేసిన ఆయన ఈసారి ఏనుగు గుర్తుతో పోటీ చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఆయన నియోజకవర్గంలో పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. స్వంత డబ్బులతో అభివృద్ధి పనులు చేశారు. దీంతో ఆయన కూడా ఓట్లు భారీగానే చీల్చే అవకాశం ఉంది. మొత్తానికి నియోజకవర్గంలో బహుముఖ పోటీ నెలకొంది. అయితే, టీఆర్ఎస్ అభ్యర్థి పట్ల పెద్దగా సానుకూలత లేకపోయినా పార్టీ పట్ల కొంత మొగ్గు ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు నలుగురు అభ్యర్థులకు చీలుతుండటంతో టీఆర్ఎస్ కి విజయావకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి బిక్షమయ్య గౌడ్ కూడా బాగా పుంజుకుని టీఆర్ఎస్ కి గట్టి పోటీ ఇస్తున్నారు.