తెలుగుదేశం పార్టీలో మరో విక్కెట్ పడేలా కనపడుతోంది. చాలా రోజులుగా పార్టీ వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్న గుంటూరు పశ్చమ ఎమ్మెల్యే మోదుగుల వెణుగోపాల్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్నిరోజులుగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు తెరలేపాయి. ఇక తాజాగా గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో జరిగిన రెడ్డి సామాజికవర్గం వనభోజనాల కార్యక్రమంలో వేణుగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఆయన టీడీపీని వీడటం ఖాయమైంది. ఈ కార్యక్రమానికి వచ్చిన వేణుగోపాల్ రెడ్డి టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో రెడ్డి నాయకుల పరిస్థితి ఘోరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు ఆయన వై.ఎస్. రాజశేఖర్ రెడ్డిని, ఆయన పాలనపై పొగడ్తల జల్లు కురిపించారు. దీంతో పాటు ఒకడుగు ముందుకేసి గురజాలలో ఈసారి వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డిని గెలిపించుకోవాలని పరోక్షంగా పిలుపునిచ్చారు. దీంతో ఇక, వేణుగోపాల్ రెడ్డి టీడీపీని వీడేందుకు రంగం సిద్ధమైనట్లే ఉంది.
ఎమ్మెల్యేకి పరిమితం కావడంతో...
2009లో నరసరావుపేట పార్లమెంటు నుంచి విజయం సాధించిన మోదుగుల సమైక్యాంధ్ర ఉద్యమంలో పార్లమెంటులో చురుగ్గా పోరాడారు. అయితే, గత ఎన్నికల్లో ఆయనను చంద్రబాబు నాయుడు గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేయించారు. నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అయోధ్యరామిరెడ్డి.. వేణుగోపాల్ రెడ్డికి స్వయానా బావ కావడంతో ఆయనను తప్పించి రాయపాటి సాంబశివరావుకు టిక్కెట్ ఇవ్వగా ఆయన విజయం సాధించారు. గుంటూరు పశ్చిమకు అయిష్టంగానే వెళ్లిన వేణుగోపాల్ రెడ్డి పార్టీలో గత కొన్నిరోజులు ఇబ్బంది పడుతున్నారు. మంత్రి పదవి దక్కుతుందని ఆయన భావించినా చంద్రబాబు ఆయనను పక్కన పెట్టారు. ఇక ఆయన ఎమ్మెల్యేగా ఉన్న గుంటూరు పశ్చిమలో మోదుగులకు వ్యతిరేకంగా టీడీపీలో మరికొందరు నేతలు తయారయ్యారు. దీంతో రానున్న ఎన్నికల్లో ఆయనను ఇక్కడి నుంచి తప్పించి మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయించే ఆలోచనలో టీడీపీ అధిష్ఠానం ఉంది.
వై.ఎస్. రాజశేఖర్ రెడ్డిపై ప్రశంసలు
ఇటీవల పలు సందర్భాల్లో ఆయన పార్టీ నేతల తీరుని నిరసిస్తూ నేరుగా వ్యాఖ్యలు చేశారు. ఇక గురజాలలో ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. రెడ్డిలు పేదలు, బలహీన వర్గాల కోసం పనిచేస్తారని... వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి... రెడ్ల కోసం ముఖ్యమంత్రి కాలేదని, ఆయన పేదల కోసం, పేదల సంక్షేమం కోసం పనిచేశారని గుర్తుచేశారు. అందుకే ఆరోగ్యశ్రీ వంటి పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఆయన చనిపోయినప్పుడు పేదలు తమ సొంత మనిషిని కోల్పోయినట్లు బాధపడ్డారని గుర్తుచేశారు. తిరిగి అలాంటి రాజ్యమే రాష్ట్రంలో రావాలని ఆయన ఆకాంక్షించారు. ఇక తాను రానున్న ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది మాత్రం ఆయన చెప్పకుండా దాటేశారు. వై.ఎస్ ను కీర్తించడం, వై.ఎస్ లాంటి పాలన రావాలనడం, గురజాలలో వైసీపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పడం వంటి పరిణామాలు చూస్తుంటే ఆయన త్వరలోనే టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరతారా..?
ఆయనకు పలువురు వైసీపీ ముఖ్య నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నరసరావుపేట పార్లమెంటు స్థానాన్ని మోదుగుల ఆశిస్తున్నారు. వైసీపీ తరపున గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి స్వల్ప తేడాతో ఓడిపోయిన ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ఈసారి పోటీకి దూరంగా ఉంటారని తెలుస్తోంది. దీంతో మోదుగులకు వైసీపీలో లైన్ క్లీయర్ గానే ఉంది. క్లీన్ ఇమేజ్ ఉన్న మోదుగులను చేర్చుకునేందుకు వైసీపీ కూడా సిద్ధంగా ఉంది. దీంతో త్వరలోనే ఆయన టీడీపీ నుంచి వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.