తెలంగాణ ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జోక్యం చేసుకున్నాక సీన్ మొత్తం మారిపోయింది. ప్రజాకూటమిని టార్గెట్ చేసేందుకు టీఆర్ఎస్ కు చంద్రబాబు రూపంలో అవకాశం అందివచ్చింది. దీంతో ఇప్పుడు కేసీఆర్ వర్సెస్ చంద్రబాబుగా ఎన్నికలు మారిపోతున్నాయి. ఇలా జరిగితే టీఆర్ఎస్ కి కలిసివస్తుంది. అందుకే టీఆర్ఎస్ చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఎన్నికల వేళ హైలెట్ చేశారు. టీఆర్ఎస్ కి కౌంటర్ గా చంద్రబాబు కూడా షెడ్యూల్ మార్చుకుని మరీ తెలంగాణలో ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తమ అభ్యర్థులు నిలబడ్డ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో రోడ్ షోల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక టీడీపీకి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన కూకట్ పల్లి నియోజకవర్గంపై ఆయన ఎక్కువ దృష్టిపెట్టారు. ఇక్కడి నుంచి ఆయన హరికృష్ణ కూతురు నందమూరి సుహాసినిని నిలబెట్టడంతో ఆమెను గెలిపించుకోవడానికి చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు.
కూకట్ పల్లిలో టీడీపీని ఓడించేందుకు...
అయితే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూకట్ పల్లి నియోజకవర్గంపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. కూకట్ పల్లితో పాటు టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న శేరిలింగంపల్లి, సనత్ నగర్, రాజేంద్రనగర్, ఉప్పల్ స్థానాల్లోనూ ఏపీ రాజకీయాల ప్రభావం ఉండేలా కనిపిస్తోంది. కూకట్ పల్లి స్థానంలో టీడీపీ బలమైన పార్టీనే. గత ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి మాధవరం కృష్ణారావు ఏకంగా 43 వేల ఓట్లతో విజయం సాధించారు. ఆయన తర్వాత టీఆర్ఎస్ లో చేరి ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నారు. తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన ఏకైక డివిజన్ కూడా ఇదే నియోజకవర్గంలోనిది. సెటిలర్ల ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కావడంతో టీడీపీకి పట్టు ఉండేది.
ఏపీ ఎన్నికలపై తెలంగాణ ప్రభావం...
కానీ, ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అంత అనుకూలంగా కనిపించడం లేదు. ఏపీలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేన ప్రభావం కూడా ఇక్కడ కనిపిస్తోంది. చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నియోజకవర్గం కావడంతో ఇక్కడ ఆ పార్టీని ఓడించేందుకు అంతర్గతంగా ఈ రెండు పార్టీల అభిమానులు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక్కడ టీడీపీకి అండగా ఉండే కమ్మ ఓటర్లతో పాటు రెడ్డిలు, కాపులు కూడా పెద్దసంఖ్యలో ఉన్నారు. ఇక కర్ణాటకలో తన పిలుపు వల్లే బీజేపీ ఓడిపోయిందని చంద్రబాబు చెబుతుంటారు. అటువంటిది తెలంగాణలో మహాకూటమి వస్తే ఆ క్రెడిట్ మొత్తం చంద్రబాబు తన ఖాతాలో వేసుకోవడం ఖాయం. ఏపీలో రాజకీయంగా తెలంగాణ ఫలితాలను కచ్చితంగా చంద్రబాబు ఉపయోగించుకుంటారు. ఇది టీడీపీకి కూడా ప్లస్ అవుతుంది. దీంతో వైసీపీ, జనసేన శ్రేణులు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలుస్తోంది.
రెండు పార్టీల శ్రేణులు టీఆర్ఎస్ వైపే..?
కూకట్ పల్లితో పాటు టీడీపీ పోటీ చేస్తున్న ఇతర నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. వైసీపికి గత ఎన్నికల్లో కూకట్ పల్లిలో 22వేల ఓట్లు, శేరిలింగంపల్లిలో 24 వేలు, ఉప్పల్ లో 16 వేల ఓట్లు వచ్చాయి. ఇప్పుడు వీరంతా ఎక్కువ శాతం టీఆర్ఎస్ వైపే ఉంటారనే అంచనాలు ఉన్నాయి. ఇక జనసేన గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చింది. పవన్ కళ్యాణ్ కు ఇక్కడ అభిమానులతో పాటు ఆయన పార్టీకి అనుకూలంగా ఉండే కాపు సామాజికవర్గ ప్రజలు కూడా పెద్దసంఖ్యలోనే ఉన్నారు. ఇప్పుడు వీరిలో చాలా వరకు టీఆర్ఎస్ కు అనుకూలంగా కనిపిస్తున్నారు. ఇటీవల వైసీపీకి అనుకూలంగా ఉండే వారు కూకట్ పల్లిలో ఓ సమావేశంలో ఏర్పాటుచేసి కేటీఆర్ ను పిలిచి మద్దతు ప్రకటించారు. అలాగే జనసేనకు అనుకూలంగా ఉండేవారు కూడా ఓ సమావేశాన్ని నిర్వహించి కేటీఆర్ కి మద్దతు ఇచ్చారు. జగన్ పై దాడి జరిగినప్పుడు కేసీఆర్ ఫోన్ లో పరామర్శించడం, కేటీఆర్, కవిత ఖండించడం కూడా వైసీపీ అభిమానులను టీఆర్ఎస్ కు సానుకూలంగా మార్చాయి. ఇక పవన్ కళ్యాణ్ గతంలో కేసీఆర్ ని కలిసి ఆయన పాలనను ప్రశంసించడంతో పవన్ అభిమానులు టీఆర్ఎస్ వైపే ఎక్కువగా ఉన్నారు. ఈ రెండు పార్టీలు తెలంగాణలో పోటీ చేయకపోవడం, ఇక్కడి ఎన్నికల్లో చంద్రబాబు కీలకంగా మారడంతో వీరంతా టీఆర్ఎస్ కి మద్దతు ఇవ్వడం ఆ పార్టీకి కలిసివస్తోంది. దీంతో ఈ స్థానాల్లో గత ఎన్నికల్లా కాకుండా టీఆర్ఎస్ టీడీపీకి గట్టి పోటీ ఇస్తోంది.