మాజీ స్పీకర్ ఇక మాజీ ఎమ్మెల్యేనేనా..?

Update: 2018-11-16 00:30 GMT

తెలంగాణ ఎన్నికల్లో ఆసక్తికరమైన పోటీ ఉన్న నియోజకవర్గాల్లో భూపాలపల్లి ఒకటి. ఇక్కడి నుంచి స్పీకర్ గా పనిచేసిన సిరికొండ మధుసుదనాచారి పోటీలో ఉండటమే ఇందుకు కారణం. కాంగ్రెస్ తరపున కూడా బలమైన నాయకుడిగా ఉన్న గండ్ర వెంకటరమణారెడ్డి పోటీలో ఉండగా టీఆర్ఎస్ కు రెబల్ బెడల ఉండటంతో ఇక్కడ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. రెండు నెలలుగా మధుసుదనాచారి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్న గండ్ర వెంకటరమణారెడ్డి కూడా ప్రచారం చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ కి రెబల్ గా గండ్ర సత్యానారాయణరావు పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి చందుపట్ల కీర్తిరెడ్డి బరిలో ఉన్నారు. 2009లో ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి గెలవగా అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి మధుసుదనాచారి గెలవగా రాష్ట్రంలోనూ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. దీంతో ఇక్కడి నుంచి గెలిచిన పార్టీనే అధికారం చేపడుతుందనే ఓ సెంటిమెంట్ ఏర్పడింది.

ప్రజలకు అందుబాటులో ఉన్నా...

గత ఎన్నికల్లో నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. మధుసుదనాచారి 7 వేల ఓట్లతో విజయం సాధించారు. రెండుమూడు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి, బీజేపీ నుంచి పోటీ చేసిన గండ్ర సత్యనారాయణరావు సుమారు 57 వేల ఓట్లు సాధించారు. వీరిద్దరి మధ్య ఓట్ల తేడా వందల్లోనే ఉంది. మధుసుదనాచారికి స్పీకర్ పదవి దక్కింది. అయినా ఆయన నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులోనే ఉన్నారు. అధికార పార్టీలో ఉండటంతో అభివృద్ధి పనులు కూడా చేయగలిగారు. పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇక భూపాలపల్లి జిల్లాగా ఏర్పడటం కూడా ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ, మధుసుదనాచారిపై అదేస్థాయిలో వ్యతిరేకత కూడా ఉంది. ముఖ్యంగా ఆయన కుమారులపై ఉన్న ఆరోపణలు ప్రజల్లో బాగా చర్చకు దారితీస్తున్నాయి. ముగ్గురు కుమారులు తలా రెండు మండలాల్లో అనధికారికంగా ఎమ్మెల్యేలుగా పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇవి చారికి మైనస్ గా మారనున్నాయి.

ఛతుర్ముఖ పోటీ కావడంతో...

కాంగ్రెస్ పార్టీ నుంచి గండ్రి వెంకటరమణారెడ్డి పేరును ప్రకటించారు. ఆయనకు నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉంది. తన హయాంలో అభివృద్ధి పనులు చేశారనే పేరు కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీకి కూడా మంచి ఓటు బ్యాంకు ఉంది. దీంతో విజయంపై నమ్మకంతో ప్రచారం చేసుకుంటున్నారు. ఇక గత ఎన్నికల్లో టీడీపీ నుంచి చివరి నిమిషంలో బీజేపీలో చేరి పోటీ చేసిన గండ్ర సత్యనారాయణరావు 57 వేల ఓట్లు సాధించారు. ఆయనకు వ్యక్తిగతంగా నియోజకవర్గంలో మంచి పేరుంది. గ్రామగ్రామాన వ్యక్తిగతంగా క్యాడర్ ను తయారు చేసుకున్నారు. టిక్కెట్ పై హామీతో ఆయన తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. ఓ దశలో టీఆర్ఎస్ టిక్కెట్ ఈసారి ఆయనకే ఇస్తారని ప్రచారం కూడా జరిగింది.

గండ్ర ఇండిపెండెంట్ గా....

కానీ, మళ్లీ మధుసుదనాచారికే టిక్కెట్ ఇవ్వడంతో గండ్ర టీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పారు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే రెండు నెలలుగా ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు బీజేపీ నుంచి చందుపట్ల కీర్తిరెడ్డి పోటీ చేస్తున్నారు. మొదటి జాబితాలోనే ఆమె పేరు ఖరారైంది. చాలా రోజులుగా ఆమె నియోజకవర్గంలో పనిచేసుకుంటున్నారు. మొత్తానికి భూపాలపల్లిలో ఛతుర్ముఖ పోటీ, అందునా అందరూ బలమైన అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. అయితే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం టీఆర్ఎస్ అభ్యర్థి మధుసుదనాచారికి కలిసి వచ్చేలా కనిపిస్తోంది.

Similar News