ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే ముందుగానే ఢిల్లీలో బీజేపీయేతర పార్టీల సమావేశం రేపు జరగనుంది. ఈ సమావేశం దేశ రాజకీయాల్లో చారిత్రాత్మకమని మోదీ వ్యతిరేక పార్టీలు గట్టిగా చెబుతున్నాయి. ఈ సమావేశం ఢిల్లీలోనే జరుగుతుండంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభానికి ఒక్కరోజు ముందు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వాస్తవానికి గత నెల 22వ తేదీ ఈ సమావేశాన్ని నిర్వహించాలనుకున్నా, ఐదు రాష్ట్రాల ఎన్నికలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ విజ్ఞప్తి మేరకు ఈనెల పదో తేదీకి వాయిదా వేసుకున్నారు.
బాబు యాక్టివ్ రోల్.....
ఈ సమావేశం విజయవంతం కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. తమను,రాష్ట్రాన్ని నమ్మించి మోసం చేసిన మోదీకి వ్యతిరేకంగా ఏకం చేయాలన్న లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారు. గత రెండు రోజుల నుంచి జాతీయపార్టీలు, వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతో చంద్రబాబు సంప్రదింపులు జరుపుతున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతబెనర్జీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. వాళ్లు ఈ సమావేశానికి హాజరయ్యేందుకు అంగీకరించారు.
ఫోన్లోనే పిలుపులు....
ఇక జమ్మూకాశ్మీర్ నుంచి పీడీపీ అధినేత ముఫ్తీని కూడా చంద్రబాబు ఆహ్వానించారు. సమాజ్ వాదీ పార్టీ అగ్రనేత అఖిలేష్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, డీఎంకే అధినేత స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, కేరళ సీఎం పినరయి విజయన్ లతోనూ ఫోన్లో సంప్రదించి సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అలాగే బీఎస్పీ అధినేత్రి మాయావతిని కూడా ఆహ్వానించారు. అయితే సమావేశానికి వస్తున్నట్లు మాయావతి ఖచ్చితంగా చెప్పలేదు. దీంతో మాయావతి ఈ సమావేశానికి హాజరవుతారా? లేదా? అన్నది అనుమానమే.
వ్యూహరచన చేసేందుకు....
ఈ సమావేశంలో ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా సిద్ధం చేయనున్నారు. దీంతో పాటు మోదీకి, బీజేపీ అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా ఎక్కెడక్కడ అందరూ కలసి ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించాల్సింది కూడా నిర్ణయించనున్నారు. తొలుత పార్లమెంటు ఉభయ సభల్లో తమ ఐక్యతను చాటి తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో జరుపుతున్న ధర్మ పోరాట చివరి సభకు వీరందరినీ ఆహ్వానించాలని భావిస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు ఈ సమావేశం విజయవంతం కావాలని కీ రోల్ పోషిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.