ఆల్ ఈజ్ వెల్ కాదట...ముందు నుయ్యి... వెనక.. గొయ్యి
రాజకీయాల్లో ఎత్తుగడలుంటాయి. వ్యూహాలు కూడా పనిచేస్తాయి. అంతే తప్ప ప్రత్యర్థిని బలహీనం చేశామని భావిస్తే అది భ్రమే అవుతుంది
రాజకీయాల్లో ఎత్తుగడలుంటాయి. వ్యూహాలు కూడా పనిచేస్తాయి. అంతే తప్ప ప్రత్యర్థిని బలహీనం చేశామని భావిస్తే అది భ్రమే అవుతుంది. తమ అసలు బలం తాము తెలుసుకోకపోవడమే నేతల నైజం. 2019లో చంద్రబాబు కావచ్చు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కావచ్చు. తనను మించిన బలవంతుడు లేరని భావిస్తున్నారు. కానీ అది భ్రమ అని తేలడానికి ఈవీఎంలు ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. మనపై ఇంత వ్యతిరేకత ఉందా? ఇంత చేసినా ప్రజలు నన్ను ఎందుకు ఓడించారు? అన్న ప్రశ్నను తనను తానే వేసుకోకుండా బయటకు కూడా వేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. చంద్రబాబు అలాగే ప్రజలు ఎందుకు ఓడించిందీ తనకు అర్థం కావడం లేదని 2019 ఎన్నికల తర్వాత అన్నారంటే ఆయనకు క్షేత్రస్థాయిలో అసలు విషయాన్ని చేరనివ్వకపోవడం వల్లనే.
అంతా సవ్యంగానే అనుకుంటే...
చేరికలు, సంక్షేమ పథకాలతో తనను ప్రజలు మరోసారి ఆదరిస్తారని నాడు చంద్రబాబు భావించారు. ఇప్పుడు అదే భావనలో జగన్ ఉన్నట్లు కనపడుతుంది. వినడానికి ఇది ఆశ్చర్యంగా కనిపిస్తున్నా.. నియోజకవర్గాల్లో నెలకొన్న నిజం. ఎందుకంటే క్యాడర్ లో సంతోషం లేదు. నేతలకు జనంలో పట్టు లేదు. సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రభుత్వం చెబుతున్నట్లు సంక్షేమ పథకాలు చేరుతున్నా అది కొందరికే పరిమితమవుతుంది. మిగిలిన వారి సంగతేమిటి? నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పనీ జరిగిన పాపాన పోలేదు. అంతా జగన్ మయంగానే కనిపిస్తుంది. ఎమ్మెల్యేలకు విలువ లేదు. అదేమంటే నిధులు లేవన్న మాట అధికారుల నుంచి వెంటనే వినిపిస్తుంది.
నేతల మధ్య..
ఇక నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు మామూలుగా లేవు. ఎంతగా అంటే జగన్ స్వయంగా కల్పించుకున్నా సమసిపోలేనంతగా అనే చెప్పాలి. నాలుగున్నరేళ్లు నాన్చి నాన్చి పట్టించుకోక పోవడంతో ఆ పంతాలు బిగుసుకు పోయాయి. ఒకరినొకరు సహకారం అందించుకునే పరిస్థితి లేదు. అవసరమైతే ప్రత్యర్థికి సహకారం అందించేందుకు కూడా జగన్ సొంత సామాజికవర్గమే రెడీ అవుతుంది. గత ఎన్నికల్లో రిజర్వ్‌డ్ నియోజకవర్గమైన కొండపి మినహా అన్ని ఎస్.సి నియోజకవర్గాల్లో ఫ్యాన్ పార్టీ ఒక ఊపు ఊపింది. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, అక్కడి ప్రధాన సామాజికవర్గం నేతలకు మధ్య పొసగడం లేదు.
గ్రౌండ్ లెవెల్‌లో మాత్రం...
ప్రాంతాలుగా విభజించి సమన్వయకర్తలను నియమించినా విభేదాలను పరిష్కరించడం సాధ్యం కాలేదు. ఇవి మరింత ముదిరి ఎన్నికల నాటికి ఎక్కువయ్యే సూచనలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక పదవులు విషయంలోనూ రెడ్డి సామాజికవర్గం నేతలు పూర్తి అసంతృప్తిగా ఉన్నారు. గత ఎన్నికల్లో తమ సొంత డబ్బు పెట్టుకుని వైసీపీ గెలుపునకు కృషి చేసిన వాళ్లు సయితం ఏ పదవి పొందక.. పనులు దక్కక ఆర్థికంగా నష్టపోయిన వారు ప్రతి నియోజకవర్గంలో కనిపిస్తున్నారు. ఇవి సరిచేసుకోకుండా వైనాట్ 175 అంటే అది నినాదంగానే మిగిలిపోతుంది తప్ప గత ఎన్నికల్లో మాదిరి ఏకపక్షంగా గెలుపు సాధ్యం కాదన్న విషయాన్ని జగన్ తెలుసుకుంటే మంచిది. ఇదంతా గ్రౌండ్ రియాలిటీ. జగన్ చెవిలో అఫిషియల్స్ చెబుతున్న మాటలకు, సర్వే నివేదికలకు.. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు పొంతనలేదన్నది మాత్రం యదార్థం. ఇప్పటికైనా జగన్ మేలుకుంటే మంచిది. లేకుంటే ఫలితాల తర్వాత చంద్రబాబు తరహాలోనే తనను తాను ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది.