లగడపాటి సర్వేతో కాంగ్రెస్ కు లక్కేనా..?

Update: 2018-12-01 02:30 GMT

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ను రాజకీయంగా కొందరు వ్యతిరేకించవచ్చు... కొందరు సమర్థించవచ్చు. కానీ, ఆయన చేసే సర్వేలను మాత్రం చాలావరకు నమ్ముతారు. ఆయన గతంలో జరిపిన సర్వేలు నిజం కావడమే ఇందుకు కారణం. అయితే, తెలంగాణ ఎన్నికలపై లగడపాటి సర్వే అంటూ సోషల్ మీడియాలో వారానికి ఒక సర్వే తెరపైకి వస్తుంది. కానీ, అవన్నీ ఆయన చేయించినవి కాదు. అయితే, తాజాగా ఆయన తెలంగాణ ఎన్నికలపై నిర్వహించిన సర్వేకు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తెలంగాణ స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీల అభ్యర్థులకు చెమటలు పట్టుస్తున్నారనేది ఆయన చెప్పిన విషయం బట్టి స్పష్టమవుతోంది. రాష్ట్రంలో సుమారు 8 - 10 నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించనున్నట్లు ఆయన అంచనా వేశారు. అంతేకాదు రోజుకు ఇద్దరు గెలవబోయే స్వతంత్ర అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తానని చెప్పి మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట నుంచి స్వతంత్ర అభ్యర్థి శివకుమార్ రెడ్డి, అదిలాబాద్ జిల్లా బోధ్ నుంచి అనీల్ కుమార్ జాదవ్ గెలుస్తారని ప్రకటించారు.

మ్యాజిక్ ఫిగర్ రాకపోతే...

అయితే, తెలంగాణ గత ఎన్నికలలో టీఆర్ఎస్ కు ప్రభుత్వం ఏర్పాటుచేసే మ్యాజిక్ ఫిగర్ కు కేవలం 3 సీట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. ఇక ఈ ఎన్నికల్లో హంగ్ వచ్చే అవకాశం కూడా ఉందని కూడా కొందరు జోస్యం చెబుతున్నారు. ఎంఐఎం నేత అక్బరుద్దిన్ కూడా ఇంచుమించు ఇటువంటి వ్యాఖ్యలే చేసి... తమ సహకారం లేకుండా ప్రభుత్వం రాదన్నట్లుగా మాట్లాడారు. కర్ణాటకలో కుమారస్వామి లా తామెందుకు కాదన్నట్లుగా ఆయన మాట్లాడారు. ఒకవేళ అదే నిజమై ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ ని చేరుకోకపోతే ఎవరు ఎటువైపు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. ఎంఐఎం ఎలాగూ 6 - 8 సీట్లు గెలవడం ఖాయం. వారు టీఆర్ఎస్ వైపే ఉంటారు. ఇక బీజేపీ కూడా కొన్ని సీట్లు గెలిచే అవకాశం ఉన్నా వారు కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చే సవాలే లేదు. ఇక ఎంఐఎం మద్దతు ఇచ్చే టీఆర్ఎస్ కి కూడా ఇచ్చే అవకాశం తక్కువ. టీఆర్ఎస్ కి ఎంఐఎం, బీజేపీల్లో ఒకే పార్టీ మద్దతు ఉంటంది. మొత్తానికి టీఆర్ఎస్ కి ఎంఐఎం మద్దతు తీసుకునే అవకాశం ఉంది. కానీ, కాంగ్రెస్ ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ దగ్గరకు వచ్చి ఆగిపోతే మాత్రం కష్టమే.

కాంగ్రెస్ కు లగడపాటి తీపి కబురు

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కి కొంత ఊరటను ఇచ్చే వార్త చెప్పారు లగడపాటి రాజగోపాల్. ఆయన ఇవాళ గెలుస్తారని చెప్పిన శివకుమార్ రెడ్డి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసినా టీఆర్ఎస్ ను తీవ్రంగా వ్యతరేకించి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లోనూ టిక్కెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ రెబల్ గానే బరిలో ఉన్నారు. అనీల్ కుమార్ జాదవ్ కూడా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి. రాష్ట్రవ్యాప్తంగా బరిలో ఉన్న స్వతంత్రులు కూడా ఎక్కువగా కాంగ్రెస్ రెబెల్సే. పొత్తుల్లో భాగంగా టిక్కెట్లు దొరకకపోవడంతో వారు స్వతంత్రంగా బరిలో దిగారు. వీరు ఒకవేళ గెలిస్తే కాంగ్రెస్ కే మద్దతు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. గత ఎన్నికల్లోనూ నర్సంపేట నుంచి ఇండిపెండెంట్ గా గెలిచిన దొంతి మాధవరెడ్డి అధికారంలో లేకున్నా స్వంత పార్టీ కాంగ్రెస్ లోనే చేరారు. దీంతో మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా వచ్చి ఆగిపోతే ఇతర పార్టీలేవీ మద్దతు ఇచ్చే అవకాశం కాంగ్రెస్ కి లేకపోవడంతో ఇప్పుడు లగడపాటి చెప్పిన వార్తతో స్వతంత్రులే కాపాడుతారని కొంత నమ్మకం ఏర్పడింది. ఇక టీఆర్ఎస్ నుంచి టిక్కెట్ దక్కని మన్నె గోవర్ధన్ రెడ్డి, పన్నాల హరీష్ చంద్రారెడ్డి, తోకల శ్రీనివాస్ రెడ్డి, నక్క ప్రభాకర్ గౌడ్, రాజారపు ప్రతాప్, గండ్ర సత్యానారయణరావు వంటి వారు కూడా స్వతంత్రులుగా బరిలో ఉన్నారు. ఒకవేళ వారు గెలిస్తే టీఆర్ఎస్ వైపు ఉండే అవకాశం ఉంది.

Similar News