కూటమిలో పోరుతో నష్టమెవరికి..?

Update: 2018-11-20 06:30 GMT

తెలంగాణ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. రెండు నెలలుగా జరుగుతున మహాకూటమి పొత్తుల చర్చలు నామినేషన్ల గడువు ముగిసే వరకు కొనసాగాయి. కొన్ని స్థానాల్లో ఏ పార్టీ పోటీ చేయాలనే గందరగోళం అభ్యర్థుల్లో నెలకొంది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ తాను తీసుకున్న 94 స్థానాలకు అదనంగా 5 స్థానాల్లో అభ్యర్థులకు బీఫాంలు ఇచ్చింది. ఈ ఐదు స్థానాల్లో తెలంగాణ జన సమితి కూడా అభ్యర్థులను నిలబెట్టింది. ఇక టీడీపీకి పోయిన అశ్వరావుపేట, మహబూబ్ నగర్ స్థానాల్లోనూ జన సమితి అభ్యర్థులను నిలబెట్టింది. వాస్తవానికి టీజేఎస్ కి పొత్తులో ఎనిమిది స్థానాలే పోటీ చేయాల్సి ఉన్నా 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో స్నేహపూర్వక పోటీ తప్పేలా కనిపించడం లేదు. కేవలం టీజేఎస్ పోటీ చేసే వర్ధన్నపేట, మల్కాజిగిరి, అంబర్ పేట స్థానాల్లో మాత్రమే కూటమి నుంచి ఒకే అభ్యర్థి ఉన్నారు. మిగతా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ లేదా టీడీపీ నుంచి స్నేహపూర్వక పోటీ ఎదుర్కోనుంది. ఇక సీపీఐ, టీడీపీతో కాంగ్రెస్ కొంత సఖ్యత చూపినట్లు కనిపిస్తోంది. ఈ రెండు పార్టీలు పోటీ చేసే స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టలేదు. అయితే, 14 సీట్లలో పోటీ చేయాల్సి ఉన్న టీడీపీ 13 స్థానాలకే పరిమితమైంది.

టీజేఎస్ కు సీట్ల తలనొప్పి...

పొత్తులో భాగంగా టీజేఎస్ మొదటి నుంచి కనీసం 20 స్థానాలు కావాలని డిమాండ్ చేస్తూ వస్తోంది. ఎట్టకేలకు అనేక బుజ్జగింపులు, చర్చల తర్వాత 8 స్థానాలకు టీజేఎస్ ను ఒప్పించారు. పోటీ చేసే స్థానాలు తక్కువే అయినా ప్రచార రాష్ట్రమంతా మహాకూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేయాల్సిన బాధ్యతను, కూటమి అధికారంలోకి వచ్చాక కామన్ మినిమన్ ప్రొగ్రాం అమలు బాధ్యతను కోదండరాంకి అప్పగించేందుకు కాంగ్రెస్ మొగ్గు చూపింది. దీంతో ఆయనకు కేటాయించిన జనగామ స్థానాన్ని కూడా కోదండరాం వదులుకున్నారు. అయితే, టీజేఎస్ లోనూ సీట్ల కోసం తీవ్ర పోటీ ఏర్పడటంతో నిన్న టీజేఎస్ కార్యాలయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అనుకున్న స్థానాల కంటే ఎక్కువ బీఫాంలు ఇచ్చారు. దీంతో చాలా చోట్ల కాంగ్రెస్, టీడీపీతో స్నేహపూర్వక పోటీ ఉండనుంది.

స్నేహపూర్వక పోటీ ఉండే నియోజకవర్గాలు...

వరంగల్ ఈస్ట్ నుంచి టీజేఎస్ గాదె ఇన్నారెడ్డిని నిలబెట్టగా కాంగ్రెస్ గ్రైనేట్ వ్యాపారి వద్దిరాజు రవిచంద్రని నిలబెట్టింది. దుబ్బాకలో టీజేఎస్ చిందం రాజ్ కుమార్ ను, కాంగ్రెస్ నాగేశ్వరరెడ్డిని నిలబెట్టాయి. మిర్యాలగూడ స్థానానికి టీజేఎస్ విధ్యాధర్ రెడ్డికి కేటాయించింది. ఇదే స్థానం నుంచి ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్ ఆర్.కృష్ణయ్యను నిలబెట్టింది. మెదక్ లో టీజేఎస్ జనార్ధన్ రెడ్డికి, కాంగ్రెస్ ఉపేందర్ రెడ్డికి బీఫాంలు ఇచ్చింది. ఆసిఫాబాద్ లో టీజేఎస్ విజయ్ కి, కాంగ్రెస్ ఆత్రం సక్కు కు టిక్కెట్ ఇచ్చింది. ఖానాపూర్ లో కాంగ్రెస్ పార్టీ రమేష్ రాథోడ్ ని నిలబెట్టగా టీజేఎస్ భీంరావుకి టిక్కెట్ ఇచ్చింది. చెన్నూరు, స్టేషన్ ఘనపూర్ లోనూ రెండు పార్టీలు అభ్యర్థులను నిలబెట్టాయి. ఇక మహబూబ్ నగర్ స్థానం నుంచి టీజేఎస్ రాజేందర్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వగా ఇప్పటికే అక్కడ టీడీపీ ఎర్ర శేఖర్ కి టిక్కెట్ ఇచ్చింది. అశ్వరావుపేటలోనూ టీడీపీ మచ్చ నాగేశ్వరరావును నిలబెట్టగా టీజేఎస్ కూడా అభ్యర్థిని నిలబెట్టింది. మొత్తానికి టీజేఎస్ స్నేహపూర్వక పోటీ వల్ల గెలుపు అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంది. కాంగ్రెస్, టీడీపీకి క్యాడర్ బలంగా ఉండటం, ఓటు బ్యాంకు ఉండటంతో స్నేహపూర్వక పోటీ వల్ల కొత్త పార్టీ అయిన టీజేఎస్ కే ఎక్కువ నష్టం ఉంటుందని అంటున్నారు. ఇక కూటమిలోని ఈ లొల్లి టీఆర్ఎస్ కి కలిసివచ్చే అవకాశం ఉంది.

Similar News