గిడ్డి టిక్కెట్ కు అడ్డుపడుతున్నదెవరంటే.... !!

Update: 2018-12-25 14:30 GMT

గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి నోరున్న ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అనంతర కాలంలో వైసీపీని వీడిపోయారు. ఆమె అధికార తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇంకోవైపు అధినాయకుడు చంద్రబాబు టికెట్లు ముందుగానే ఇస్తామని ప్రకటించారు. ఈ నేపధ్యంలో టికెట్ వస్తుందా రాదా అన్న ఆందోళనలో ఎమ్మెల్యేలు ఊన్నారు. పాడేరు విషయానికి వస్తే అక్కడ పోటీ గట్టిగానే ఉంది.

మణికుమారికేనా....?

పాడేరు ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో 26 వేల పై చిలుకు మెజారిటీతో వైసీపీ తరఫున గెలిచిన గిడ్డి ఈశ్వరి ఇపుడు టీడీపీలో మాజీ మంత్రి మణికుమారితో టికెట్ కోసం పోటీ పడాల్సివస్తోంది. మణికుమారి 1999 ఎన్నికల్లో గెలిచి మంత్రిగా కూడా చంద్రబాబు క్యాబినెట్లో పనిచేశారు. అంతకు ముందు ఆమె భర్త బాలరాజు కూడా పాడేరు ఎమ్మెల్యెగా పని చేశారు. ఆ ప్రాంతంలో వారిది పట్టున్న రాజకీయ కుటుంబంగా పేరుంది. ఆ తరువాత నుంచి ఆమె పార్టీ కోసం పని చేస్తూ వస్తున్నారు. ఇక పాటీకి పెద్ద దిక్కుగా ఉంటూ ఏజెన్సీలో కాపాడుకుంటున్న మణికుమారి వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఈశ్వరి చేరిక వల్ల ఎవరిని పార్టీ బరిలో నిలుపుతుందా అన్న చర్చ సాగుతోంది. కానీ ఫిరాయింపు ఎమ్మెల్యేగా ఉన్న ఈశ్వరి పట్ల పాడేరు గిరిజనంలో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో పాటు, మావోయిస్టులు కూడా అదే అంశాన్ని ప్రస్తావించడం వంటి కారణాలు ఇపుడు గిడ్డి టికెట్ కు అడ్డుపడుతున్నాయి. దాంతో ఆమెకు టికెట్ ఇచ్చేందుకు పార్టీ కూడా నిరాకరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

గెలిస్తే మంత్రి అతనే....

ఇక అరకు నుంచి కిడారి సర్వేశ్వరరావుని మావోయిస్టులు పొట్టన పెట్టుకున్నందువల్ల ఆయన కుటుంబానికి న్యాయం చేస్తూ చంద్రబాబు కిడారి కొడుకు శ్రావణ్ కుమార్ ని ఏకంగా మంత్రిని చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే అరకు ఎమ్మెల్యే అభ్యర్ధి కూడా. దాంతో పార్టీ అధికారంలోకి వస్తే మరో మారు శ్రావణ్ కే మంత్రి పదవి దక్కుతుందని అంటున్నారు. ఈ నేపధ్యంలో గిడ్డిని పూర్తిగా పక్కన పెడతారని కూడా చెబుతున్నారు. అరకులో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత శివేరి సోమ కూడా మరణించడంతో అక్కడ టీడీపీకి పోటీ లేదు. కానీ పాడేరులో మాత్రం ఆ పార్టీలో ముందు నుంచి ఉన్న వారంతా ఇపుడు అధినాయకత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. పైగా పార్టీ సర్వేల్లో కూడా ఈశ్వ‌రికి మార్కులు పడకపోవడంతో ఆమెకు టికెట్ హుళక్కేనని వినిపిస్తోంది.

Similar News