Ys Jagan : సెకండ్ లిస్ట్ రెడీ... వాళ్లందరూ ఇక తప్పుకోవాల్సిందేనా?
వరస సమావేశాలతో వైసీపీలో హీట్ పెరిగింది. రెండో దశలో వైసీపీ ఇన్‌ఛార్జుల మార్పిడికి జగన్ రెడీ అవుతున్నారు.
వరస సమావేశాలతో వైసీపీలో హీట్ పెరిగింది. రెండో దశలో వైసీపీ ఇన్‌ఛార్జుల మార్పిడికి జగన్ రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగానే తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో తూర్పు. పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి జగన్ భేటీలు జరుగుతున్నాయి. పిఠాపురం, జగ్గంపేట, చింతలపూడి, గుంటూరు వెస్ట్, పోలవరం, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రావడంతో వారిలో టెన్షన్ మొదలయింది. కొందరు ఎమ్మెల్యేలను, మంత్రులను లోక్‌సభకు పంపాలని కూడా జగన్ యోచిస్తున్నారు.
తొలి దశలో....
మొదటి దశలో పదకొండు నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జులను మార్చారు. కొత్త వారిని నియమించారు. మంత్రులకు కూడా మినహాయింపు ఇవ్వలేదు. వారిని మరొక చోటికి వైసీపీ ఇన్‌ఛార్జిగా నియమించారు. దీంతో సీఎంవో నుంచి పిలుపు అంటేనే వైసీపీ నేతల్లో గుండె దడ మొదలయింది. గెలుపే లక్ష్యంగా ఈసారి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక చేయనున్నారు. సోషల్ ఇంజినీరింగ్ లో భాగంగా వైఎస్ జగన్ ప్రస్తుతమున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని నిర్ణయించుకున్నారు.
సెకండ్ ఫేజ్ లో...
అయితే నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేపై జనంలో అసంతృప్తి ఉండటంతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో అక్కడి కీలక నేతలు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సహకరించబోమని తెగేసి చెప్పడంతోనే జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. మరో చోట కూడా టిక్కెట్ దక్కని నేతలకు పార్టీలో ఏదో ఒక కీలక పదవి ఇస్తామని జగన్ ఈ సమావేశాల్లో హామీ ఇస్తున్నారు. వారి రాజకీయ భవిష్యత్ తాను స్వయంగా చూసుకుంటానని జగన్ నేరుగా భరోసా ఇస్తున్నారు. అందుకే సెకండ్ లిస్ట్ లో ఎవరిపేర్లు ఉంటాయన్న దానిపై టెన్షన్ మొదలయింది.
ముందుగానే అభ్యర్థులను....
అయితే ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసి వారితో సమన్వయం చేసుకుని వెళ్లేలా జగన్ ముందస్తుగా ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు. వారిలో ఉన్న అసంతృప్తిని పారదోలి ఆ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయాలని జగన్ భావిస్తున్నారు. టీడీపీ, జనసేన కూటమి ఏర్పాటు కావడంతో అభ్యర్థులను తప్పనిసరిగా మార్పు చేయాలన్న నిర్ణయానికి జగన్ వచ్చారు. అందుకోసమే ముందస్తు కసరత్తులు ప్రారంభించారు. దశలవారీగా నియోజకరవ్గాలకు కొత్త ఇన్‌ఛార్జులను నియమించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.