తెలంగాణలో కౌంటింగ్ కి సమయం దగ్గరపడుతున్నా కొద్ది ఉత్కంఠ నెలకొంది. ప్రజానాడి ఏ పార్టీ పు ఉందనే అంచనాలు స్పష్టంగా తేలలేదు. ఎగ్జిట్ పోల్స్ కొన్ని టీఆర్ఎస్ గెలుస్తుందని, మరికిన్ని మాత్రం హంగ్ ఏర్పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేశాయి. దీంతో రాష్ట్రంలో అధికారం చేపట్టాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రెబెల్స్, స్వతంత్ర అభ్యర్థులపై దృష్టి సారించింది. ఒకవేళ టీఆర్ఎస్ కు 53 సీట్లు వచ్చినా ఎంఐఎం మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కానీ, కాంగ్రెస్ కి మాత్రం అటువంటి అవకాశం ఏమీ లేదు. ప్రజాకూటమిలోని పార్టీలు మినహాయిస్తే ఎంఐఎం, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వవు. దీంతో మ్యాజిక్ ఫిగర్ కు కాంగ్రెస్ చేరువలో ఉంటే స్వతంత్రుల మద్దతుతో అధికారం చేపట్టాలని భావిస్తోంది. దీంతో ఇప్పటికే కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ రంగంలోకి దిగి పలువురు స్వతంత్ర అభ్యర్థులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. శివకుమార్ కర్ణాటకలో ఇటీవల జరగిని ఎన్నికల్లో ఇటువంటి వ్యూహాలను విజయవంతంగా నడిపారు. దీంతో కాంగ్రెస్ ఈ బాధ్యతను ఆయనపైనే ఉంచింది. ఇక మరి గులాం నబీ ఆజాద్, వీరప్ప మొయిలీ వంటి వారు కూడా హైదరాబాద్ కి చేరుకున్నారు.
రెబెల్స్ తో టచ్ లో కాంగ్రెస్ నేతలు
ప్రజాకూటమి ఏర్పాటుకావడంతో పలువురు బలమైన కాంగ్రెస్ నేతలకు టిక్కెట్లు దొరకలేదు. దీంతో వారు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగారు. ఇలా కాంగ్రెస్ రెబెల్స్ పలువురు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు అంచనాలు వేస్తున్నారు. దీంతో వారు చేజారకుండా ఇవాళే వారితో మంతనాలు జరిపి క్యాంప్ కి తరలించనున్నారు. రేపు విజయం సాధించాక వారి స్థానంలో ఏజెంట్లు రిటర్నింగ్ అధికారి నుంచి ధృవీకరణ పొందే వెసులుబాటు ఉంది. దీంతో స్వతంత్ర అభ్యర్థులను ఇవాళ రహస్య ప్రదేశానికి తరలించనున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి బీఎస్పీ టిక్కెట్ పై బరిలో ఉన్న మల్ రెడ్డి రంగారెడ్డికి ఎన్నికల ముందే కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో ఆయన కాంగ్రెస్ లోనే ఉండే అవకాశం ఉంది.
గెలిచే వారు వీరేనా..?
కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి భంగపడి నారాయణపేటలో బీఎల్పీ నుంచి బరిలో ఉన్న శివకుమార్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది. దీంతో డీకే అరుణ ద్వారా ఆయనను కాంగ్రెస్ తమవైపు తిప్పుకుంటోంది. మక్తల్ నుంచి బరిలో ఉన్న టీఆర్ఎస్ రెబల్ జలంధర్ రెడ్డి కూడా గెలిచే అవకాశం ఉంది. ఆయన గతంలో కాంగ్రెస్ జైపాల్ రెడ్డి వర్గం నేతగా కొనసాగారు. జైపాల్ రెడ్డి ద్వారానే ఆయనను కాంగ్రెస్ లైన్ లో పెడుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ టిక్కెట్ కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నించి భంగపడ్డ అనీల్ కుమార్ జాదవ్ బోధ్ నుంచి స్వతంత్రంగా బరిలో దిగారు. ఆయన గెలుస్తారని లగడపాటి రాజగోపాల్ కూడా అంచనా వేశారు. ఆయనకు సన్నిహితుడైన డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి ద్వారా అనీల్ ను కాంగ్రెస్ తోనే ఉంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా కాంగ్రెస్ టిక్కెట్ రెండుసార్లు ఆశించి సాధించలేకపోయిన రాములు నాయక్ కూడా గెలుస్తారని అంటున్నారు. ఆయనను కూడా భట్టి విక్రమార్క ద్వారా కాంగ్రెస్ కే మద్దతు ఇచ్చేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా ఐదుగురు కాంగ్రెస్ రెబెల్స్ తో ఇప్పటికే కాంగ్రెస్ నేతలు టచ్ లో ఉన్నారు. వీరిని బెంగళూరుకి క్యాంప్ కి తరలించే అవకాశం ఉంది.
టీఆర్ఎస్ కి ఉన్నారుగా..!
పలువురు టీఆర్ఎస్ రెబెల్స్ కూడా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగి గట్టి పోటీ ఇస్తున్నారు. రామగుండం నుంచి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న కొరుకంటి చందర్, గడ్డం వినోద్ లు కచ్చితంగా గెలుస్తారనే అంచనాలు ఉన్నాయి. ఆయనతో పాటు భూపాలపల్లి నుంచి గండ్ర సత్యానారాయణరావు, రాజేంద్రనగర్ నుంచి తోకల శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ నుంచి నక్క ప్రభాకర్ గౌడ్, కూకట్ పల్లి నుంచి పన్నాల హరీష్ చంద్రారెడ్డి, ఖైరతాబాద్ నుంచి మన్నె గోవర్ధన్ రెడ్డి, వంటి టీఆర్ఎస్ నేతలు కూడా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగారు. వీరిలో ఎవరు గెలిచినా టీఆర్ఎస్ కే మద్దతు ఇచ్చేలా చేసుకునేందుకు ఆ పార్టీ కూడా ప్రయత్నాలు ప్రారంభించనుంది. మొత్తానికి రేపు గనుక హంగ్ వస్తే స్వతంత్రులకు డిమాండ్ అమాంతం పెరిగే అవకాశం ఉంది.