కన్నా లక్ష్మీనారాయణ ఊగిసలాటలో ఉన్నారా? ఒకవైపు వైసీపీలో చేరాలని మనసు పీకుతున్నా... మరోవైపు నుంచి వచ్చిన...వస్తున్న వత్తిడులతో కన్నా సతమతమవుతున్నారా? అంటే అవుననే అంటున్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి మూడు రోజులు గడుస్తుంది. అయితే ఆయన చేరికపై ఇంకా క్లారిటీ రాలేదు. ఆయనకు వైసీపీలో చేరాలని మనససులో బలంగా ఉంది. ఆయన అనుచరులు సయితం ఫ్యాన్ పార్టీలోకే వెళదామని వత్తిడి తెస్తున్నారు.
అమిత్ షా క్లాస్ తో.....
వాస్తవానికి కన్నా లక్ష్మీనారాయణ ఈ నెల 25వ తేదీనే వైసీపీలో చేరాల్సి ఉంది. అదేరోజు తెల్లవారుజామున హైబీపీ రావడంతో ఆసుపత్రిలో చేరారని ఆయన అనుచరులు చెబుతున్నారు. కాని వైసీపీలో చేరిక ఆగిపోవడానికి బలమైన కారణాలున్నాయంటున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేసి కన్నాకు క్లాస్ పీకారని తెలుస్తోంది. పార్టీలోనే ఉంటే భవిష్యత్తులో మంచి పదవులు దక్కుతాయని కూడా అమిత్ షా హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో కొంత సంకోచంలో పడినట్లు కన్నా సన్నిహితులు చెబుతున్నారు. అయితే పైకి మాత్రం తమ నేత విశ్రాంతి తీసుకుంటున్నారని, రెండు, మూడురోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశముందంటున్నారు.
టీడీపీనుంచి వత్తిడి.....
ఇక తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కన్నాపై వత్తిడి ఉంది. కన్నాకు టీడీపీలో మంచి ఆఫర్ ఇచ్చారు. గుంటూరు వెస్ట్ సీటు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. అంతేకాకుండా మంత్రి పదవి కూడా అధికారంలోకి తిరిగి రాగానే ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే కన్నా మాత్రం టీడీపీలోకి వెళ్లేందుకు సుతారమూ ఇష్టపడటం లేదని తెలిసింది. నిన్న మొన్నటి వరకూ అటు కాంగ్రెస్ లోనూ, ఇటు బీజేపీలోనూ చంద్రబాబుపై నిప్పులు చెరిగిన తాను అదే పార్టీలోకి వెళ్లడం బాగుండదని ఆయన తన సన్నిహితుల ముందు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
కన్నా ఇంటికి క్యూ కడుతున్న నేతలు.....
అయితే కన్నాకు అత్యంత దగ్గరగా ఉండే వారు మాత్రం కన్నా ఎట్టి పరిస్థితుల్లో టీడీపీలో చేరరంటున్నారు. ఆయన వైసీపీలో చేరటం ఖాయమని, అయితే అది ఎప్పుడనేది ఆయనే చెప్పాలంటున్నారు. వైసీపీ నేతలు ఇప్పటికీ కన్నాతో టచ్ లో ఉన్నారు. ఇటు బీజేపీ నేతలు సయితం కన్నాను కలసి వెళ్లారు. టీడీపీ నేతలు కూడా కన్నా ఇంటికి పరామర్శ పేరుతో వెళ్లివస్తున్నారు. కాని కన్నా మాత్రం తన మనసులో మాటను బయటకు చెప్పడం లేదు. మొత్తం మీద కన్నా పార్టీ మారతారా? లేదా? అన్నది రెండు, మూడురోజుల్లోనే తేలిపోనుంది. ఊగిసలాటలో ఉన్నా కన్నా మరి ఏ పార్టీలోకి వెళతారన్నది ఆసక్తికరంగా మారింది.