టీఆర్ఎస్ లో అంతా అనుకున్నట్లే జరుగుతోంది. కేసీఆర్ రాజకీయ వారసుడిగా కేటీఆర్ ఫిక్స్ అయిపోయారు. ఆయనకు మొదట పార్టీ పగ్గాలు అప్పగించేందుకు ముహూర్తం ఖరారైంది. తిరుగులేని మెజారిటీతో టీఆర్ఎస్ ప్రజలు అధికారం కట్టబెట్టడం కుమారుడికి పట్టాభిషేకం చేసేందుకు కేసీఆర్ లైన్ క్లీయర్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిన్న జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో... ఇక నుంచి కేటీఆర్ అందుబాటులో ఉంటారని పార్టీ నాయకులకు స్పష్టంగా చెప్పేశారు. తాను జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉంటానని చెప్పకనే చెప్పేశారు. అయితే, కేటీఆర్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కేబినెట్ విస్తరణ కూడా ఇది దృష్టిలో పెట్టుకునే జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కేటీఆర్ కి సన్నిహితంగా ఉండే వారిని కేబినెట్ లోకి తీసుకుని... సీనియర్లను పార్లమెంటుకు పంపించాలని ఆలోచిస్తున్నారట. సీనియర్లను లోక్ సభకు పోటీ చేయిస్తే గెలవడం సులభం కావడంతో పాటు తనకు జాతీయ స్థాయిలో సహకారంగా ఉంటారనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు.
ఓడిన ముఖ్యులు లోక్ సభకు..?
ఇప్పటికైతే పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ బాధ్యతలు కేటీఆర్ కి అప్పగించి కీలక బాధ్యతలు ఆయనకు ఇచ్చినా... త్వరలోనే ముఖ్యమంత్రిని చేస్తారనే వాదన గట్టిగా వినపడుతోంది. ఆ దిశగా కేబినెట్ ఎంపిక కూడా ఉండే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాలో సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే, ఆయనను మంత్రిగా తీసుకోకుండా లోక్ సభకు పంపించాలని కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. ఇక్కడ ఇప్పుడు ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉందట. ఇప్పుడే కాకున్నా పార్లమెంటు ఎన్నికల వరకు ఈ నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. పొంగులేటికి కేటీఆర్ తో సత్సంబంధాలు ఉన్నాయి. ఇక వరంగల్ జిల్లాలోనూ కడియం శ్రీహరిని ఈసారి లోక్ సభకు పంపించి కేటీఆర్ కి సన్నిహితంగా ఉండే వినయ భాస్కర్ ను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది.
రాష్ట్ర కేబినెట్ లోకి కేటీఆర్ సన్నిహితులు
అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నుంచి ఓడిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డిని ఈసారి చేవెళ్ల ఎంపీగా పోటీ చేయించాలని భావిస్తున్నారు. చేవెళ్ల ప్రస్తుత ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఆయనను దెబ్బ తీయాలంటే మహేందర్ రెడ్డి సరైన వ్యక్తి అని భావిస్తున్నారు. ఇలా పలువురు సీనియర్లను, ఇప్పటికే కేసీఆర్ కేబినెట్ లో పనిచేసిన వారిని లోక్ సభకు పంపించాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. కచ్చితంగా రాష్ట్రంలో అన్ని పార్లమెంటు ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తున్న కేసీఆర్... జిల్లా వ్యాప్తంగా సీనియర్లకు పట్టు ఉండటంతో వారిని బరిలో నిలిపితే గెలవడం కూడా సులువవుతుందని అనుకుంటున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నలుగురు మంత్రులను రాష్ట్ర కేబినెట్ లోకి తీసుకునే అవకాశం లేదు. అదే సమయంలో జూనియర్లు, కేటీఆర్ కి సన్నిహితులు రాష్ట్ర కేబినెట్ లో ఉంటే రేపు కేటీఆర్ ని ముఖ్యమంత్రిని చేసినా ఇబ్బంది ఉండనే ఆలోచన ఉందట. మొత్తానికి కేసీఆర్ ... ఇక్కడ కేటీఆర్ టీమ్ ని రెడీ చేయడంతో పాటు సీనియర్లను ఢిల్లీ బాట పట్టించి తన జట్టుగా మార్చుకోవాలనుకుంటున్నట్లు కనిపిస్తోంది.