తెలంగాణ ఎన్నికలు ఇలా తుఫాన్ లా వచ్చి అలా వెళ్లిపోయాయి. హేమా హేమీలంతా కదనరంగంలో తమ బలాబలాలను పరీక్షించుకున్నారు. ఉత్కంఠ భరితంగా సభలు, సమావేశాలు, రోడ్ షో లు టీవీల్లో చర్చలు, పత్రికల్లో ప్రకటనలు హోరెత్తిపోయాయి. కానీ జనంలో వారిద్దరూ కనపడితే ఒట్టు. ఇంతకీ ఎవరా ఇద్దరు ...?
సామాజిక తెలంగాణ అంటూ ...
2009 లో సామాజిక తెలంగాణ సాధించడమే తన లక్ష్యం అన్న చిరంజీవి తమ పార్టీ అధికారం లోకి భవిష్యత్తులో చేరుకోలేదేమో అన్న సందేహం తో ప్రజారాజ్యాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపి చేతులు దులుపుకున్నారు. అందుకు ప్రతిఫలంగా ఆయనకు రాజ్యసభ, కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. కట్ చేస్తే ఎపి కాంగ్రెస్ లో భావి సీఎం చిరంజీవే అన్న రేంజ్ లో ప్రచారం సైతం సాగింది. కానీ ఎప్పుడైతో రాష్ట్ర విభజన ఎపి వాదన పక్కన పెట్టి ఏకపక్షంగా కాంగ్రెస్ చేసి పాడేసిందో చిరంజీవి రాజకీయ భవిష్యత్తు గోదావరిలో కొట్టుకుపోయిందని రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట. ఆ తరువాత ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్ పై ప్రతీకారం తీర్చుకుని ఆ పార్టీని జీరో చేసేసారు.
జీరో కావడంతో....
హీరో చిరంజీవి కూడా రాజకీయాల్లో ఒక్కసారిగా జీరో కాక తప్పని పరిణామం దాంతో అనివార్యం అయిపొయింది. అప్పటినుంచి మెగాస్టార్ కాంగ్రెస్ రాజకీయాలకు చాలా దూరం జరుగుతూ వచ్చారు. తనకు అచ్చి వచ్చిన సినిమా రంగంలో ఆరుపదుల వయస్సులో రీ ఎంట్రీ ఇచ్చి సిల్వర్ స్క్రీన్ పై తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని చాటి చెప్పారు. ఇక తన ఫోకస్ సినిమాలే అన్నది స్పష్టం చేస్తూ బిజీ అయిపోయారు. ఎంతో కీలకం అయిన తెలంగాణ ఎన్నికల్లో మెగాస్టార్ పత్తాలేకుండా పోయి కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చేశారు. భాగ్యనగర్ లో చిరంజీవి ప్రచారం చేసి ఉంటే కాంగ్రెస్ టిడిపిలకు ఎన్నో కొన్ని స్థానాలు దక్కేవి కానీ ఆయన రాజకీయాలకు దూరం అయ్యారు. ఇది వ్యూహాత్మకమా లేక సోదరుడు పవన్ జనసేన తో భవిష్యత్తులో తలపడే ఇష్టం లేకనా అన్నది తేలాలి.
ఒక్క బాల్ ఆడలేదు ...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి టి ఎన్నికల్లో భూతద్దం పెట్టి వెతికినా కనపడలేదు. అధిష్టానం స్వయంగా ఆయనను ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండమని ఇచ్చిన ఆదేశాలే కిరణ్ కనిపించకపోవడానికి కారణం అన్న వాదన పార్టీ వర్గాల్లో వుంది. నిజానికి కిరణ్ కుమార్ రెడ్డి, అవ్వడానికి చిత్తూరు ప్రాంతవాసి అయినా పెరిగింది అంతా భాగ్యనగర్ లోనే. రాజకీయాల్లో చక్రం తిప్పింది హైదరాబాద్ కేంద్రంగానే. ఇక ఆయన సర్కిల్ అంతా భాగ్యనగర్ లో విస్తృతంగా వున్నారు. కిరణ్ అంటే ఏపీలో ప్రత్యేక ఆకర్షణ వుంది. కిరణ్ కుమార్ రెడ్డి ఎంట్రీ ఇచ్చివుంటే హైదరాబాద్ సెటిలర్స్ కొంత టర్న్ అయ్యి ఉండేవారని అంటున్నారు. కానీ అన్నిటికి ఆయన దూరం కావడం హస్తం కి తీరని లోటు గా చెబుతున్నారు. దశాబ్దాల పాటు రాజకీయ శత్రువుగా వున్న తెలుగుదేశం పార్టీ ని ఆహ్వానించిన కాంగ్రెస్ చిరంజీవి, కిరణ్ కుమార్ రెడ్డిలను ఉపయోగించుకోలేకపోవడం ఎలాంటి మైనస్ మార్కులు వేసిందో ఫలితాలు తేల్చి చెప్పాయి.