కిషన్ దూకుడుకు బ్రేకులు పడతాయా..?

Update: 2018-11-23 00:30 GMT

తెలంగాణలో ఎన్నికల్లో అందరి దృష్టి ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో అంబర్ పేట ఒక్కటి. ఇక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ ముఖ్యనేత జి.కిషన్ రెడ్డి పోటీ చేస్తుండటమే ఇందుకు కారణం. ఆయన గత రెండు ఎన్నికల్లో అంబర్ పేట నుంచి తిరుగులేని మెజారిటీతో విజయం సాధించారు. అంతకుముందు ఆయన హిమాయత్ నగర్ నుంచి కూడా ఒకసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో హిమాయత్ నగర్ నియోజవకర్గం రద్దై అంబర్ పేట గా మారింది. 2009లో కాంగ్రెస్ పై, 2014లో టీఆర్ఎస్ పై ఆయన విజయం సాధించారు. ఆయన మరోసారి పోటీ చేస్తున్నారు. కిషన్ రెడ్డిపై బలమైన అభ్యర్థిని పోటీలో ఉంచి ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్ తీవ్ర కసరత్తు చేసి చివరికి కాలేరు వెంకటేష్ ను అభ్యర్థిగా ఖరారు చేశారు. దీంతో ఆయన ప్రచారంలో కొంత వెనుకబడ్డా విజయంపై ధీమాగా ఉన్నారు.

కిషన్ రెడ్డికి పట్టున్న ప్రాంతం...

మూడుసార్లు ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కిషన్ రెడ్డి ఈ స్థానాన్ని కంచుకోటగా మార్చుకున్నారు. అందుబాటులో ఉంటారనే పేరు, ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. దీనికి తోడూ బీజేపీకి ఇక్కడ గట్టి పట్టుంది. ఇక్కడి నుంచి గతంలో బీజేపీ ముఖ్యనేతగా ఉన్న ఆలె నరేంద్ర కూడా రెండుసార్లు విజయం సాధించారు. అయితే, గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గంలోని అన్ని కార్పొరేటర్ స్థానాల్లోనూ విజయం సాధించింది. నియోజకవర్గంలో టీఆర్ఎస్ బాగా బలోపేతం అయ్యింది. దీంతో కిషన్ రెడ్డిని ఓడించేందుకు టీఆర్ఎస్ వ్యూహాలు పన్నుతోంది.

బలం పెంచుకున్న టీఆర్ఎస్

టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ కార్పొరేటర్, అడ్వకేట్ కాలేరు వెంకటేష్ ను ప్రకటించారు. ఆయన భార్య ప్రస్తుతం కార్పొరేటర్ గా ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయి, పార్టీకి ఇంతకాలం ఇంఛార్జిగా ఉన్న ఎడ్ల సుధాకర్ రెడ్డికి టిక్కెట్ దక్కలేదు. మాజీ మంత్రి కృష్ణయాదవ్ కూడా టిక్కెట్ ఆశించినా ఇవ్వలేదు. దీంతో వారు పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారు. వీరు పార్టీ అభ్యర్థికి పూర్తిగా మద్దతు ఇవ్వకపోతే కాలేరు వెంకటేష్ కి ఇబ్బందులు తప్పవంటున్నారు. ఇక 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న కిషన్ రెడ్డిపై సహజంగానే ఏర్పడే వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇక నియోజకవర్గంలో పెద్దసంఖ్యలో ఉన్న ముస్లిం ఓట్లు కూడా తమకు కలిసివస్తుందని నమ్మకంగా ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎంఐఎం అభ్యర్థి బరిలో దిగగా 17 వేల ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ టీఆర్ఎస్ కే మద్దతు ఇస్తోంది.

మహాకూటమిలో తెగని పంచాయితీ

ఇక మహాకూటమిలో అంబర్ పేట సీటు లొల్లి ఇంకా పరిష్కారం కాలేదు. వాస్తవానికి, ఈ స్థానాన్ని తెలంగాణ జన సమితికి కేటాయించారు. దీంతో రమేశ్ ను ఆ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక చివరి నిమిషంలో తీవ్ర హైడ్రామా మధ్య కాంగ్రెస్ కూడా అంబర్ పేటలో పోటీకి దిగింది. ముగ్గురు, నలుగురు నేతలు ఈ టిక్కెట్ ఆశించినా చివరకు లక్ష్మణ్ యాదవ్ కి టక్కెట్ దక్కింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో మిగతా ఆశావహులలో అసమ్మతి ఉంది. ఇక కాంగ్రెస్, టీజేఎస్ మధ్య స్నేహపూర్వక పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ ఇక్కడ గతంలో కొంత బలంగానే ఉన్నా... చాలా మంది నేతలు టీఆర్ఎస్ లో చేరడంతో కాంగ్రెస్ ఇప్పుడు బలహీనంగా మారింది. గత ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసిన సీనియర్ నేత వి.హనుమంతరావు కేవలం 16 వేల ఓట్లమే సాధించి నాలుగో స్థానానికి పరిమితమయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. అసలే బలహీనంగా ఉండటం, పైగా స్వంత పార్టీలోనే అసమ్మతి, మిత్రపక్షం నుంచే ఇంకో అభ్యర్థి బరిలో ఉండటంతో కాంగ్రెస్ కి ఇక్కడ కష్టకాలమే ఉంది.

కిషన్ రెడ్డికి గట్టి పోటీ ఇస్తున్న టీఆర్ఎస్

గత ఎన్నికల్లో కిషన్ రెడ్డి 62 వేల ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. ఆయనకు దరిదాపుల్లో కూడా ఇతర పార్టీలు లేవు. రెండో స్థానంలో నిలిచిన టీఆర్ఎస్ కేవలం 18 వేల ఓట్లు మాత్రమే సాధించింది. అభివృద్ధి విషయంలో పెద్దగా మార్పులేమీ కనపడకున్నా ఇక్కడి ప్రజల్లో కిషన్ రెడ్డికి మంచి ఇమేజ్ ఉంది. ఇక్కడ కిషన్ రెడ్డికి ఉన్న పట్టుకు గత ఎన్నికల ఫలితాలే రుజువు. అయితే, 2014కి ఇప్పటికి పరిస్థితి మారింది. టీఆర్ఎస్ బాగా బలం పెంచుకుంది. ఇక నియోజకవర్గంలో ప్రభావం చూపగలిగే స్థాయిలో ఉన్న బీసీలు, మైనారిటీలు టీఆర్ఎస్ వైపు ఎక్కువగా ఉంటారనే అంచనాలు ఉన్నాయి. అయితే, కిషన్ రెడ్డి బీజేపీ నేతే అయినా ముస్లింలలో కూడా మంచి పేరే ఉంది. మొత్తానికి అంబర్ పేటలో బీజేపీ, టీఆర్ఎస్ కి మధ్యే ప్రధాన పోటీ ఉండనున్నట్లు కనపడుతోంది. అయితే, గత ఎన్నికల మాదిరిగా ఫలితాలు ఏకపక్షంగా ఉండే అవకాశం లేదు. కిషన్ రెడ్డికి టీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వనుంది. ఇప్పటికి పరిస్థితి కిషన్ రెడ్డికి సానుకూలంగానే కనిపిస్తోంది.

Similar News