లోకేష్ కలల కోట ఏంటన్న డౌట్ చాలా మందికి ఈ హెడ్డింగ్ చూసి రావచ్చు. ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ మంత్రి కావడమే ఓ చిత్ర విచిత్రంగా జరిగింది. ఎమ్మెల్సీ అయిన మూడు రోజులకే ఆయన మంత్రి అయ్యారు. తోటి తెలుగు రాష్ఠ్రం తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టి దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఆయన మంత్రిగా కూడా ట్రెండ్ సెట్ చేస్తున్నారు. కేటీఆర్‌తో లోకేష్‌ను చాలా మంది పోల్చి చూస్తుండడంతో సహజంగానే లోకేష్‌కు తక్కువ మార్కులు పడుతున్నాయి. దొడ్డిదారిన ఆయన మంత్రి అయ్యారన్న అపవాదు కూడా మూటకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగాల్సిన అవసరం ఉంది.
ఇక్కడి నుంచే లోకేష్....
సీమలో కుప్పం నుంచి చంద్రబాబు, హిందూపురం నుంచి మామ బాలయ్య ఉండడంతో ఇప్పుడు లోకేష్ కోసం కృష్ణా జిల్లా పెనమలూరు సీటును బాబు రిజర్వ్ చేసేశారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో 30 వేల పై చిలుకు మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఇక లోకేష్ ఇక్కడ పోటీ చేయాలనుకోవడం వెనక ఈ నియోజకవర్గంలో టీడీపీకి బలమైన కమ్మ సామాజికవర్గంతో పాటు బీసీలు భారీగా ఉన్నారు. రాజధానికి ఆనుకునే ఈ నియోజకవర్గం ఉండడం, అన్ని విధాలా సేఫ్‌గా ఉంటుందన్నదే బాబు ప్లాన్.
లోకేష్ కలల కోటలో జగన్ ప్లాన్ ఏంటో...
ఇక వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర చేస్తోన్న సంగతి తెలిసిందే. కృష్ణా జిల్లాలో కొనసాగుతోన్న ఈ పాదయాత్ర 148వ రోజు పెనమలూరు నియోజకవర్గంలో జరుగుతోంది. ఆదివారం ఉదయం ఆయన ఉయ్యూరు శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి మంటాడ, తాడంకి, కనుమూరు, కురుమద్దాలి, ఉరుటూరు క్రాస్ రోడ్డు మీదుగా పామర్రు వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది.
గత ఎన్నికల్లో జగన్ పొరపాటు.....
గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ తరపున సరైన క్యాండెట్‌ను దించడంలో జగన్ ఫెయిల్ అయ్యారు. అప్పటి వరకు పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని రాజకీయంగా సరైన అనుభవం లేని మాజీ జడ్పీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు తనయుడు కుక్కల విద్యాసాగర్‌ను సీటు ఇచ్చారు. అప్పటి వరకు మచిలీపట్నం ఎంపీ క్యాండెట్‌గా ఉన్న ఆయన చివరి క్షణంలో అప్పటి మంత్రి కొలుసు పార్థసారథి వైసీపీలోకి రావడంతో ఆయనకు మచిలీపట్నం ఎంపీ సీటు ఇచ్చి విద్యాసాగర్‌కు పెనమలూరు అసెంబ్లీ ఇచ్చారు. ఈ స్ట్రాటజీతో ఇద్దరూ ఘోరంగా ఓడారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే బోడే.....
ఇక వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి లోకేష్ టీడీపీ తరపున బరిలో ఉంటారన్న వార్తలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బోడే కూడా స్ట్రాంగ్‌గానే ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన విద్యాసాగర్ అడ్రస్ లేకుండా పోయారు. దీంతో గతంలో ఇక్కడ నుంచి గెలిచిన కొలుసు పార్థసారథి ఈ సీటుపై కన్నేశారు. వచ్చే ఎన్నికల్లో తాను అసెంబ్లీకే పోటీ చేస్తానని ఆయన తన అభీష్టాన్ని ఇప్పటికే జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.
అభ్యర్థికోసం అన్వేషణ.....
నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ. ఈ క్రమంలోనే జిల్లాలో ఈ సామాజిక వర్గానికి బాగా ప్రయారిటీ ఇస్తోన్న జగన్ ఈ సీటును కూడా ఆ సామాజిక వర్గానికే ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో కూడా ఉన్నట్టు సమాచారం. ఆ వర్గం నుంచి ఆర్థికంగా బలమైన వ్యక్తుల కోసం అన్వేషణ జరుగుతోంది. మరి పార్థసారథి నుంచి కూడా జగన్‌పై ఒత్తిడి ఉండడంతో జగన్ సీటు విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో ? చూడాలి. పార్థసారథికే ఇక్కడ సీటు ఇస్తే మచిలీపట్నం ఎంపీ రేసులో మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ పేరు లైన్లో ఉంది.