నాగం ఇన్ బిగ్ ట్రబుల్....??

Update: 2018-12-05 00:30 GMT

ఓ వైపు ఆరుసార్లు గెలిచిన నాగం జనార్ధన్ రెడ్డి... మరో వైపు అభివృద్ధి మంత్రం పటిస్తున్న మర్రి జనార్ధన్ రెడ్డి... వీరి నడుమ నాగర్ కర్నూల్ రాజకీయం వేడెక్కింది. తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన నాగం జనార్ధన్ రెడ్డి వరుసగా ఐదుసార్లు నాగర్ కర్నూల్ నుంచి విజయం సాధించి తన కంచుకోటగా మలుచుకున్నారు. అంతకు ముందు కూడా ఆయన 1985లో విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమ ప్రభావం ఆయన రాజకీయ జీవితం కీలక మలుపులు తీసుకుంది. టీడీపీకి రాజీనామా చేసి తెలంగాణ నగారా సమితి స్థాపించిన ఆయన తర్వాత ఆ పార్టీకి బీజేపీలో విలీనం చేసి గత ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి పోటీ చేశారు. ఆయన కుమారుడు శశిధర్ రెడ్డిని నాగర్ కర్నూల్ అసెంబ్లీకి పోటీ చేయించారు. వీరిద్దరూ ఓట్లు బాగానే సాధించినా ఓటమి పాలయ్యారు.

పూర్వ వైభవం కోసం నాగం తాపత్రయం...

ఇటీవల నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారు. అయితే, ఒకప్పుడు నాగర్ కర్నూల్ లో తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయించిన నాగం ఇప్పుడు పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయనకు నియోజకవర్గంలో వ్యతిరేకతలు ఎక్కవ కావడంతో విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. గత వైభవం కోసం చెమటోడుస్తున్నారు. నాగం జనార్ధన్ రెడ్డికి ఇక్కడ గ్రామగ్రామాన క్యాడర్ ఉంది. ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. అయితే, ఇవేమీ ఆయన విజయం సాధించడానికి సరిపోయేలా కనపడటం లేదు. గతంలో ఎన్నడూ లేనంతగా ఆయన నియోజకవర్గంలో చెమటోడుస్తున్నారు.

బలమైన నేతగా ఎదిగిన మర్రి జనార్ధన్ రెడ్డి

గత ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుంచి 14 వేల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డి రెండో స్థానంలో ఉండగా, బీజేపీ అభ్యర్థి నాగం శశిధర్ రెడ్డి 27 వేల ఓట్లు సాధించారు. గెలిచిన తర్వాత మర్రి జనార్ధన్ రెడ్డి నియోజకవర్గంలో బలమైన నేతగా ఎదిగారు. నియోజకవర్గంలో అభివృద్ధి చేయగలిగారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ లో ఉన్న దామోదర్ రెడ్డి నాగం చేరికను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ లో చేరారు. దీంతో టీఆర్ఎస్ బలం మరింత పెరిగింది. మర్రి జనార్ధన్ రెడ్డి నాలుగున్నరేళ్ల కాలంలో నియోజకవర్గంలో అభివృద్ధిలో మంచి మార్కులు వేయించుకున్నారు. పట్టణంలో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం, మౌళిక వసతులు మెరుగుపర్చారనే పేరుంది. స్వంత నిధులతోనూ కొన్ని పనులు చేయించారు. దీంతో ఆయన ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు.

అభివృద్ధినే నమ్ముకున్న మర్రి....

నాగర్ కర్నూల్ లో ప్రధాన పోటీ టీఆర్ఎస్ కాంగ్రెస్ మద్యే ఉండనుంది. తన హయాంలో జరిగిన అభివృద్ధి, నియోజకవర్గ ప్రజలతో ఉన్న సత్సంబంధాలు, కాంగ్రెస్ ఓటు బ్యాంకుపైనే నాగం నమ్మకం పెట్టుకున్నారు. ఇక అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ బలం పెరగడంతో మర్రి జనార్ధన్ రెడ్డి విజయంపై ధీమాగా ఉన్నారు. నాగర్ కర్నూల్ ప్రత్యేక జిల్లాగా ఏర్పడటం ఆయనకు కలిసివచ్చే అవకాశం ఉంది. ఇక నియోజకవర్గంలో ప్రభావం చూపు స్థాయిలో ఉన్న మత్య్సకారులు, గొల్లకురుమలు టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల సంతృప్తిగా ఉన్నారనే అంచనాలు ఉండటం టీఆర్ఎస్ కి మర్రికి కలిసిరానుంది. ఇదే సమయంలో ఆయన సోదరుడిదే ఇక్కడ అధికారమని, ప్రజలకు ఎక్కువగా అందుబాటులో ఉండరని, అభివృద్ధి నాగర్ కర్నూల్ పట్టణానికే పరిమితమైందని కూడా ఆయనపై విమర్శలు ఉన్నాయి. అయితే, అయినా, మర్రి జనార్ధన్ రెడ్డిని ఓడించడం నాగం జనార్ధన్ రెడ్డికి చాలా కష్టమని తెలుస్తోంది.

Similar News