కొండా వెనుకబడ్డారా..?

Update: 2018-11-29 00:30 GMT

తెలంగాణ ఎన్నికల్లో ఉత్కంఠభరిత పోటీ ఉన్న నియోజకవర్గాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గం ఒకటి. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ, టీఆర్ఎస్ తరపున తాజా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, బీజేపీ తరపున విజయ్ చందర్ రెడ్డి బరిలో ఉన్నారు. తనకు టీఆర్ఎస్ ఫస్ట్ లిస్టులో టిక్కెట్ ఇవ్వకుండా అవమానించడంతో కొండా సురేఖ టీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పి స్వంత గూడు కాంగ్రెస్ పార్టీలో చేరి, స్వంత నియోజకవర్గం పరకాల నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించి తనను అవమానించిన టీఆర్ఎస్ పార్టీపై ప్రతీకారం తీర్చుకోవాలని కొండా దంపతులు పట్టుదలగా ఉన్నారు. ఇక టీఆర్ఎస్ కూడా ఈ స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కొండా సురేఖను ఓడించి వారి దూకుడుకు కళ్లెం వేయాలని భావిస్తోంది. ఇక బీజేపీ కూడా ఈ నియోజకవర్గంపై కాషాయ జెండా ఎగరేసేందుకు ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సభ నిర్వహించింది.

పట్టు కోల్పోయిన కొండా

గత ఎన్నికల ముందు వరకు కూడా పరకాల నియోజకవర్గంలో 15 ఏళ్ల పాటు కొండా సురేఖ క్రియాశీలకంగా ఉన్నారు. అయితే, ఎన్నికల ముందు టీఆర్ఎస్ లో చేరగా నియోజకవర్గం మారి వరంగల్ ఈస్ట్ నుంచి బరిలో నిలిచి విజయం సాధించారు. దీంతో ఈ ఐదేళ్ల పాటు ఆమె పరకాలకు దూరంగా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయం సాధించిన చల్లా ధర్మారెడ్డి టీఆర్ఎస్ లో చేరి ఈసారి పోటీ చేస్తున్నారు. కొండా దంపతులు పరకాలకు దూరంగా కావడంతో వారి క్యాడర్ మొత్తం చెల్లాచెదురైంది. ఎక్కువ శాతం టీఆర్ఎస్ లో చల్లా వర్గంలో చేరారు. వాస్తవానికి వారికి ఈ నియోజకవర్గంలో బలం ఎక్కువే ఉండేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీంతో తిరిగి బలం పెంచుకునేందుకు కొండా దంపతులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొండా సురేఖ ప్రచారం చేస్తుండగా కొండా మురళీ మాత్రం క్యాడర్ ను తమ వైపు మలుచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. దీంతో అలెర్ట్ అయిన చల్లా ధర్మారెడ్డి తన వర్గం చేజారకుండా ప్రయత్నిస్తున్నారు.

అభివృద్ధిలో చల్లాకు మంచి మార్కులు

టీడీపీ బలం కంటే సొంత బలంతోనే గత ఎన్నికల్లో చల్లా ధర్మారెడ్డి విజయం సాధించారు. ఈ నాలుగున్నరేళ్లలో ఆయన నియోజకవర్గంలో అభివృద్ధి బాగానే చేశారనే పేరుంది. పరకాల మున్సిపాలిటీ కావడం, రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, మౌళిక సదుపాయాలు మెరుగవడం వంటి అంశాలు చల్లా ధర్మారెడ్డికి కలిసివచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఆయన గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఇక, కొండా సురేఖ కూడా తన హయాంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేస్తున్నారు. తాను గెలిచి పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ మంత్రి పదవి వస్తుందని, ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇక చల్లా ధర్మారెడ్డి ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకుని కాంట్రాక్టులు దక్కించుకుని లాభపడ్డారనే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. నియోజకవర్గంలో 80 వేలకు పైగా బీసీలు ఉండటం, ఆ వర్గం నుంచి సురేఖ మాత్రమే బరిలో ఉండటంతో ఆమెకు కలిసివస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి. మొత్తానికి పరకాల మాదే అనే కొండా దంపతుల ధీమాని చల్లా ధర్మారెడ్డి నీరుగారుస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఆయనకే ఎక్కువ మొగ్గు ఉన్నా ఎన్నికల వ్యూహాల్లో దిట్ట అయిన కొండా కు కూడా గెలుపు అవకాశాలు ఉన్నాయి.

Similar News