హస్తానికే ఎడ్జ్ ఉందట ఇక్కడ....!!

Update: 2018-11-25 03:30 GMT

కష్టజీవుల అడ్డా అయిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారింది. 5 లక్షలకు పైగా ఓట్లు ఉన్న ఈ నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీల నుంచి కూడా బీసీ అభ్యర్థులే ఉన్న ఇక్కడ విజయం కోసం అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కే.పీ.వివేకానంద్ 40 వేల భారీగా మెజారిటీతో విజయం సాధించారు. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కొలన్ హనుమంత్ రెడ్డి 75 వేల ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. 2009లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన కూన శ్రీశైలంగౌడ్ 40 వేల ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. వివేకానంద్ తర్వాత టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఈ ఎన్నికల్లో ఆయననే ఆ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు.

పట్టు పెంచుకున్న వివేకానంద...

యువకుడు, విద్యావంతుడైన వివేకానందకు నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీచేసి ఓడిపోయిన సానుభూతి కూడా తోడవడంతో ఆయన గత ఎన్నికల్లో భారీ విజయం సాధించారు. ప్రధానంగా నరేంద్ర మోదీ వేవ్ వల్ల బీజేపీతో పొత్తు, సెటిలర్ల ఓట్లు వివేకానంద్ కు బాగా కలిసి వచ్చింది. తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ ఏకపక్షంగా విజయం సాధించింది. తర్వాత కొన్ని రోజులకే ఆయన టీఆర్ఎస్ లో చేరారు. ఫస్ట్ లిస్ట్ లోనే వివేక్ పేరును కేసీఆర్ ప్రకటించడంతో రెండు నెలల నుంచే ఆయన నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. అభివృద్ధి విషయంలో మంచి మార్కులే వేయించుకున్నారాయన. మౌళిక సదుపాయాలు కూడా నియోజకవర్గంలో గతంలో కంటే మెరుగయ్యాయి. దీంతో పాటు ప్రభుత్వ పట్ల ప్రజల్లో ఉన్న సానుకూలత తనను గెలిపిస్తుందని ఆయన నమ్మకంగా ఉన్నారు.

ముగ్గురు ఒక్కటయ్యారు...

ఇక ప్రజాకూటమి తరపున ఈ స్థానాన్ని కాంగ్రెస్ తీసుకుని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ ని నిలబెట్టింది. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోయినా నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిగా పేరుంది. టీడీపీతో పొత్తు శ్రీశైలంగౌడ్ కి కలిసివచ్చే అవకాశం ది. ఇక్కడి నుంచి టీడీపీ టిక్కెట్ ఆశించిన హనుమంతరావు సహా క్యాడర్ మొత్తం పూర్తిస్థాయిలో ఆయనకు సహకరిస్తోంది. ఇక గత ఎన్నికల్లో భారీగా ఓట్లు సాధించి ఈసారి టిఆర్ఎస్ టిక్కెట్ ఆశించిన కొలన్ హనుమంత్ రెడ్డి టీఆర్ఎస్ ని వీడి టీడీపీలో చేరారు. ఆయన కూడా శ్రీశైలంగౌడ్ కి మద్దతు ఇస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో బలమైన నాయకులుగా ఉన్న ముగ్గురు నేతలూ టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఒక్కటైనట్లు కనిపిస్తోంది.

ఇద్దరి మధ్య తీవ్ర పోటీ

శ్రీశైలంగౌడ్ కి వ్యక్తిగతంగా కూడా మంచి పేరుంది. ఆయన 2009లో కాంగ్రెస్ టిక్కెట్ దక్కకున్నా ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు కూడా ఆయన ఆరునెలల నుంచి నిత్యం ఏదో ఓ కార్యక్రమంలో ప్రజల్లో ఉంటున్నారు. అయితే, సెటిలర్ల ఓట్లే ఇక్కడ జయాపజయాలను ప్రభావితం చేయగలవు. ఇక గత ఎన్నికల్లో సుమారు 15 వేల ఓట్లు సాధించిన ఎంఐఎం ఈసారి పోటీకి దూరంగా ఉండి టీఆర్ఎస్ కి మద్దతిస్తోంది. ఆ ఓట్లు టీఆర్ఎస్ కి కలిసివచ్చే అవకాశం ఉంది. బీజేపీ నుంచి బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ అన్న కుమారుడు కాసాని వీరేష్ పోటీలో ఉన్నారు. ఆయన ఓట్లు బాగానే సాధించే అవకాశం ఉన్నా ప్రధాన పోటీ మాత్రం కూన వివేకానందగౌడ్ కి, కూన శ్రీశైలం గౌడ్ కి మధ్యే ఉండనుంది.

Similar News