కృష్ణయ్య ఇరుక్కున్నారా..? ఇరికించారా..?

Update: 2018-11-20 02:30 GMT

బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య కు బీసీ వర్గాల్లో మంచి గుర్తింపు ఉంది. బీసీ వర్గాల ప్రజల తరుపున పోరాటానికి ఎప్పుడూ ముందుండే ఆయనను బీసీలు టైగర్ కృష్ణన్న అని ముద్దుగా పిలుచుకుంటారు. సుదీర్ఘకాలం సామాజిక ఉద్యమాల్లో కీలకంగా పనిచేసిన ఆయన గత ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కు పరిమితం కానున్న తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు రచించిన తెలంగాణ ఎన్నికల వ్యూహంలో భాగంగా ఆయన టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా గత ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి బరిలో దిగి విజయం సాధించారు. అయితే, పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన కేవలం ఎమ్మెల్యేగానే ఉండిపోయారు.

రాహుల్ గాంధీతో భేటీ అయినా...

వాస్తవానికి ఆయన టీడీపీ ఎమ్మెల్యేనే అయినా ఏనాడూ ఆ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నది లేదు. అలా అని మిగతా ఎమ్మెల్యేల్లా పార్టీ మారిపోలేదు. యధావిధిగా బీసీల తరపున ఉద్యమాల్లోనే చురుగ్గా పాల్గొన్నారు. బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యం అంటున్న ఆయన బీసీల కోసం పార్టీని కూడా స్థాపించాలని అనుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన కీలకమవుతారని అంతా అనుకున్నారు. ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం కావడం అనేక ఊహాగానాలకు తావిచ్చింది. ఆయన కాంగ్రెస్ చేరుతారని అప్పడే అనుకున్నారు. కానీ, అటువంటిదేమీ లేదని కృష్ణయ్య స్పష్టం చేశారు. తర్వాత కాంగ్రెస్ టిక్కెట్ల కేటాయింపు పైన ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీలకు టిక్కెట్ల కేటాయింపులో న్యాయం జరగలేదని ఆరోపించారు. దీనికి నిరసనగా తెలంగాణ బంద్ కూడా నిర్వహించాలని కృష్ణయ్య భావించారు.

ఓవైపు అసమ్మతి... మరోవైపు స్నేహపూర్వక పోటీ

ఇక ఈ ఎన్నికలకు కృష్ణయ్య దూరమయ్యారని అంతా అనుకున్నారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా ఆయన కాంగ్రెస్ తరపున మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థిగా ఒక్కరోజు ముందు తెరమీదకు వచ్చారు. టిక్కెట్ల కేటాయింపులో బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసిందనే విమర్శలు రావడంతో కాంగ్రెస్ కృష్ణయ్యను, మరో బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ లకు టిక్కెట్లు కేటాయించి ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. అయితే, కృష్ణయ్య నిలబడే మిర్యాలగూడ స్థానాన్ని పొత్తులో భాగంగా తెలంగాణ జన సమితికి కేటాయించారు. విధ్యాధర్ రెడ్డిని ఆ పార్టీ అభ్యర్థిగా కూడా ప్రకటించింది. ఇక కాంగ్రెస్ టిక్కెట్ కోసం చివరివరకు ప్రయత్నించిన సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డికి ఆశాభంగం కలిగింది. ఓ వైపు కూటమి నుంచి మరో అభ్యర్థి పోటీలో ఉండటం, మరోవైపు కాంగ్రెస్ లో అసంతృప్తి ఉండటంతో కృష్ణయ్యకు ఎన్నికలు కష్టంగా మారాయి. బీసీల పక్షాన గట్టి గళమెత్తే కృష్ణయ్య అసెంబ్లీలో ఉంటే ఆ వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని కొంతమంది బీసీలు భావిస్తున్నారు. అయితే, కొత్త నియోజకవర్గంలో స్వంత పార్టీలో అసమ్మతిని చేదించి ఆయన గెలవడం మాత్రం సులువైన పని కాదు.

Similar News