తెలంగాణ ఎన్నికల్లో సినీనటుల ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఎన్నికల్లో కేవలం బీజేపీ నుంచి నటి రేష్మా మినహా ఎవరూ ప్రధాన పార్టీల నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అయితే, ఎవరూ ఊహించని విధంగా కోదాడ నియోజకవర్గంలో హాస్య నటుడు వేణుమాధవ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి వీరాభిమాని అయిన వేణుమాధవ్ స్వతంత్ర అభ్యర్థిగా ఎందుకు పోటీ చేస్తున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. మొదటి నుంచీ టీడీపీలో ఉన్న ఆయన అనేక ఎన్నికల్లో ఆ పార్టీ విజయం కోసం ప్రచారం నిర్వహించారు. తాజాగా నంద్యాలలో జరిగిన ఉప ఎన్నికల్లోనూ టీడీపీ తరపున ప్రచారం తీవ్రంగా చేశారు. ఓ దశలో వైసీపీ అధినేత జగన్ పై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. టీడీపీ అంతే అంత ఇష్టమైన వేణుమాధవ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం వెనక రాజకీయ వ్యూహం ఉండి ఉండచ్చని అంటున్నారు.
టీడీపీ టిక్కెట్ అడగలేదా..?
సుమారు 25 ఏళ్లుగా వేణుమాధవ్ కి టీడీపీతో సంబంధాలు ఉన్నాయి. ఆయన ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి టిక్కెట్ ఆశించినట్లుగా కూడా ఎక్కడా వినపడలేదు. వేణుమాధవ్ స్వస్థలం కోదాడ పట్టణం. ఈ ఎన్నికల్లో ఆయన కోదాడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. వేణుమాధవ్ అక్కడ మిత్రబృందం, పరిచయాలు బాగానే ఉన్నాయి. దీంతో ఆయన బరిలో నిలిచారు. అయితే, ఒకవేళ ఎమ్మెల్యే కావాలనే ఆశ తనలో ఉంటే తాను సుదీర్ఘకాలం పనిచేసిన టీడీపీ టిక్కెట్ అడిగేవారు కదా ? అలా కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగడం వెనుక టీడీపీ వ్యూహమే ఉందంటున్నారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉండే కోదాడ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో భారీగా ఓట్లు సాధించింది. ఆ పార్టీ నుంచి బరిలో నిలిచిన బొల్లం మల్లయ్య యాదవ్ 68 వేల ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు.
మల్లయ్య యాదవ్ ని దెబ్బతీసేందుకా..?
ఈ ఎన్నికల్లోనూ మల్లయ్య యాదవ్ టీడీపీ టిక్కెట్ ఆశించారు. అయితే, మహాకూటమిలో భాగంగా ఈ స్థానం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఉత్తమ్ పద్మావతికి దక్కింది. దీంతో మల్లయ్య యాదవ్ తీవ్ర అసంతృప్తితో టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. చివరి నిమిషంలో టీఆర్ఎస్ లో చేరినా బలమైన నాయకుడైనందున మల్లయ్య యాదవ్ కి టీఆర్ఎస్ టిక్కెట్ దక్కింది. అయితే, స్వయానా పీసీసీ అధ్యక్షుడి భార్య పోటీ చూస్తున్న ఈ స్థానం మహాకూటమికి కీలకమైనది. దీంతో ఇంతకాలం టీడీపీకి నియోజకవర్గంలో పెద్దదిక్కుగా ఉన్న మల్లయ్య యాదవ్ ఓట్లలో చీలిక తెచ్చేందుకే వేణుమాధవ్ తో పోటీ చేయిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఇంతకాలం టీడీపీతో ఉన్న వేణుమాధవ్ ఎక్కువగా మల్లయ్య యాదవ్ ఓట్లే చీల్చే అవకాశం ఉన్నందున టీడీపీ పెద్దలే వేణుమాధవ్ ను ఎన్నికల బరిలో దిగేలా చేశారని అంటున్నారు. అయితే, వేణుమాధవ్ పోటీలో ఉంటారా ? ఉన్నా ఆయన ప్రభావం ఏమేరకు ఉంటుందో చెప్పలేం. అయితే, కోదాడలో పరిచయాలు ఉన్నప్పటికీ ఇద్దరు బలమైన అభ్యర్థుల మధ్య పోటీలో వేణుమాధవ్ కేవలం నామమాత్రంగా మిగిలిపోతారని మాత్రం స్పష్టమవుతోంది.