అనుకున్నదొక్కటి... అయినది ఒక్కటి...!

Update: 2018-11-17 09:30 GMT

తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి మనుగడ ఉండదనుకున్నారో... కేసీఆర్ ను ఎదుర్కొవాలంటే కాంగ్రెస్ లోనే చేరాలనుకున్నారో... లేదా నాయకుడు చంద్రబాబు నాయుడు అంతర్గత ఆదేశాలో తెలియదు గానీ తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఎనుముల రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కాంగ్రెస్ గూటికి చేరి సంవత్సరం పైనే అయ్యింది. ఆయనతో పాటు టీడీపీలో నియోజకవర్గ స్థాయి నేతలుగా ఉన్న సుమారు 15 - 20 మందిని కూడా కాంగ్రెస్ లో చేర్చారు. వారి రాజకీయ భవిష్యత్ పైన కూడా రేవంత్ భరోసా ఇచ్చి పార్టీలో చేర్చారు. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద, ముఖ్యంగా రాహుల్ గాంధీ వద్ద రేవంత్ కు గుర్తింపు మాత్రం వచ్చింది. అయితే, కాంగ్రెస్ లో సాధించిన రేవంత్ సాధించిందేంటి అంటే మాత్రం చెప్పలేని పరిస్థితి. తన వెంట వచ్చిన నాయకులకు ఆయన టిక్కెట్లు ఇప్పించలేకపోయారు. కాంగ్రెస్ లో టిక్కెట్లు దక్కని రేవంత్ వర్గం నేతల్లో కొందరు బలమైన వారు ఇంకా టీడీపీలో ఉంటే పొత్తులోనూ వారికే టిక్కెట్ దక్కేది. కానీ, కాంగ్రెస్ లో చేరి.. జూనియర్లుగా మిగిలిపోయి పోటీగా దూరమయ్యారు.

నలుగురిలో ఒకరిగా...

అమరావతికి వెళ్లి తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు కలిసి వచ్చి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రావడంతోనే కాంగ్రెస్ క్యాడర్ లో రాష్ట్ర స్థాయి నేతగా గుర్తింపు పొందారు. అయితే, పార్టీలో అనేక ఏళ్లుగా పనిచేస్తున్న సీనియర్ నాయకులు మాత్రం రేవంత్ రెడ్డిని కొంత దూరం పెట్టారు. జూనియర్ అయిన రేవంత్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. అయినా, మెల్లిగా ఆయన పార్టీలో పట్టు పెంచుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేసులో లేని సీనియర్ నాయకులు రేవంత్ తో సఖ్యతతో ఉన్నారు. ప్రచార కమిటీ బాధ్యతలు తీసుకుని రాష్ట్రం మొత్తం తీరిగి పార్టీని గెలిపించాలనుకున్నా... రేవంత్ కు ఆశాభంగం తప్పలేదు. కేవలం వర్కింగ్ ప్రసిడెంట్ పదవితో సరిపెట్టారు. అయితే, ఇప్పటివరకు వర్కింగ్ ప్రసిడెంట్ భట్టి విక్రమార్క ఒక్కరు ఉన్నప్పుడే ఆయనకు అంతగా గుర్తింపు ఉండేది కాదు. ఇప్పుడు రేవంత్ తో పాటు పొన్నం ప్రభాకర్ కి ఇదే పదవులు కేటాయించడంతో ముగ్గురు వర్కింగ్ ప్రసిడెంట్లు అయ్యారు. అయినా, పోనీలే అని రేవంత్ సంతృప్తి చెందారు. ఇక తాజాగా కమ్మ సామాజికవర్గానికి టిక్కెట్లు ఇవ్వనందున పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ పదవిని ఆ సామాజికవర్గానికి చెందిన కుసుమకుమార్ కి ఇచ్చారు. దీంతో వర్కింగ్ ప్రసిడెంట్ల సంఖ్య నాలుగుకి చేరింది. దీంతో రేవంత్ పదవికి ఏమాత్రం ప్రాధాన్యత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

నమ్మి వచ్చిన వారికి టిక్కెట్లు లేక...

టిక్కెట్ల కేటాయింపులోనూ రేవంత్ కి తీవ్ర నిరాశే ఎదురైంది. కనీసం 10 టిక్కెట్లు తన వర్గానికి కావాలని రేవంత్ అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చారు. సితక్క, విజయరామారావు, అరికెల నర్సారెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రాజారాం యాదవ్, తొటకూర జంగయ్య యాదవ్, బోడ జనార్ధన్, దరువు ఎల్లన్న వంటి నేతలకు ఆయన టిక్కెట్లు కావాలని పట్టుబట్టారు. వీరిలో సీతక్క, విజయరామారావు, మేడిపల్లి సత్యం మినహా మిగతా ఎవరికీ టిక్కెట్లు దక్కలేదు. దీంతో రేవంత్ ని నమ్ముకుని వస్తే అన్యాయం జరిగిందనే బాధతో ఉన్నారు. వీరిలో కొందరు వారివారి నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు. వారు టీడీపీలోనే ఉండి ఉన్నా.. పొత్తులో టిక్కెట్ కూడా దక్కి ఉండేది. మొత్తానికి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ‘చెయ్యి’ ఇచ్చినట్లుగానే కనిపిస్తోంది.

Similar News