పవన్ అయినా,చంద్రబాబు అయినా 'బలప్రదర్శన' తో జగన్ ను భయపెట్టాలనుకోవడం జరగని పని.జగన్ జగమొండి.16 నెలలు జైలులో ఉంది వచ్చినా చెక్కుచెదరకుండా తన 'గమ్యాన్ని' ముద్దాడాలన్న ఏకైక లక్ష్యంతో పోరాడి సీఎం సీటును కైవసం చేసుకున్న మనిషి.ఆయన ఉక్కు సంకల్పం ముందు 'ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ',ఆయన పార్టీ చిగురుటాకులా వణికిపోయిన సన్నివేశాలను 2019 లోనే జనం చూశారు.కనుక ఆయనను 'బలప్రదర్శన'లతో,కర్ర సాము,గారడీ,కనికట్టు విద్యలతో,మాయ,మంత్రాలతో పడగొట్టలేరు.పుంగనూరులో జరిగిన ఘర్షణల వెనుక ఏమి జరిగిందో,ఎవరు పథకరచన చేశారో నెమ్మదిగా బయటకు వస్తున్నవి.ఇలాంటి చౌకబారు ఎత్తుగడలతో ప్రజల ఆదరాభిమానాలు సంపాదించుకోవడం కష్టం.ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత దానంతటే రావాలి.అంతేకానీ ప్రజల్లో వ్యతిరేకతను కృత్రిమంగా నాటడం,దాన్ని పెంచాలని ప్రయత్నించడం వలన ఎలాంటి ప్రయోజనం లేదు.
కాగా చంద్రబాబు చేతిలో మీడియా,ధనబలం,అపార అనుభవం అనే ఆయుధాలున్నప్పటికీ జగన్‌తో పోరాడలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.2019 నుంచే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కాలం కలిసి రావడం లేదు.పరిస్థితి అనుకూలంగా లేకపోతే తాడు కూడా పామయి కరుస్తుందనే నానుడి చంద్రబాబుకు సరిగ్గా సరిపోతోంది.ఎల్లో మీడియాను,పవన్ కల్యాణ్‌ను ఆయన నమ్ముకుంటున్నట్టు అడుగడుగునా కనిపిస్తోంది.అటు ముఖ్యమంత్రి జగన్ మాత్రం ప్రజలను మాత్రమే నమ్ముకున్నారు. రాష్ట్రం,సంక్షేమం, అభివృద్ధి,భవిష్యత్తు తరాల గురించి జగన్ ప్రతిచోటా ప్రస్తావిస్తున్నారు.హింస,అశాంతి,అరాచకం, రెచ్చగొట్టడం లాంటి మాటలు చంద్రబాబు నోట వెలువడుతున్నవి.14 ఏళ్ల పాటు సీఎంగా గడించిన రాజకీయ పాండిత్యం ఎక్కడికి పోయిందో అంతుచిక్కడం లేదు.''జగనన్న వలన మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి'' అనే సాహసోపేతమైన నినాదాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రజల్లోకి వదిలారు.ఆ నినాదం బాగా పాతుకుపోతున్నట్టు అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ విషయంలో కేసీఆర్ కు జగన్ 'ఏక లవ్య' శిష్యుడు అనవచ్చు.సూటిగా చెప్పాలంటే జగన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి 'కోచ్' గా ఉన్నారని కూడా అనుకోవచ్చు.అచ్చం కేసీఆర్ లాగానే జగన్ కూడా సంక్షేమ కార్యక్రమాలను ఓటు బ్యాంకుగా మలచుకుంటున్నారు.కేసీఆర్ ఓటుబ్యాంకు 2018 నాటికే స్థిరపడిపోయింది.జగన్ కు 2024 లో ఆ ఓటు బ్యాంకు సంగతి తేలవచ్చును.చంద్రబాబు సీఎంగా,ప్రతిపక్ష నాయకుడిగా సక్సెస్ గ్రాఫ్ ఏమిటో అందరికీ తెలుసు.చంద్రబాబు మాటలు చెబుతాడని, అరచేతిలో స్వర్గం చూపిస్తాడని,ఆయన పాలనలో సంపన్నులు మరింత సంపన్నులుగా మారారని విమర్శలున్నవి.బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు ఒక్క శాతం ప్రయోజనాన్ని కూడా చంద్రబాబు చేయలేకపోయారన్న అపవాదు ఉన్నది.
ఇరుకు సందుల్లో సభలు ,ర్యాలీల ఫలితంగా 11 మంది మృతి చెందిన ఘటనలు ఇదివరకు జరిగాయి. దీని మీద పవన్ కల్యాణ్ స్పందించిన తీరుపై ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద చర్చే జరిగింది.కందుకూరులో 8 మంది చనిపోయినప్పుడు 'దురదృష్టకరం' అని , గుంటూరులో ముగ్గురు చనిపోయినప్పుడు 'దిగ్బ్రాంతికరం' అంటూ పవన్ చేతులు దులుపుకున్నాడు.కానీ.. ఇప్పటంలో మొండి గోడలకు ఉన్న విలువ,11 మంది ప్రాణాలకు లేదా అని నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్లు పేల్చారు. కానీ ఒక్కటి మాత్రం స్పష్టమైంది. చంద్రబాబు దత్తపుత్రుడని పవన్ ను వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోపిస్తుంటే అంతకు ముందు కొంత ఆమోదయోగ్యంగా లేదని ప్రజలు అనుకున్నారు. కందుకూరు,గుంటూరు ఘటనల జనసేనాని ఆనాడు స్పందించిన తీరు 'దత్తపుత్రుడు' అని రుజువుచేసుకున్నట్లయ్యింది. పవన్ తోక పట్టుకొని 2024 ఎన్నికల గోదారిని ఈదాలనే చంద్రబాబు ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో అంచనాకు అందడం లేదు.పవన్ మూలంగా తాను అధికారంలోకి రావచ్చునని చంద్రబాబులో ఆశలు మిణుకుమిణుకు మంటున్నవి. మరోవైపు 'యువగళం' పేరిట తన కుమారుడు లోకేశ్ జరుపుతున్న పాదయాత్రతో చంద్రబాబుకు 'పుత్రోత్సాహం' కనిపిస్తోంది. టీడీపీ రోజురోజుకూ నిర్వీర్యమై పోతుందని అనుకుంటున్న దశ నుంచి క్రమంగా చంద్రబాబులో 'అధికారం' అందబోతుందన్న ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. అన్న మాటలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నవి.
బీసీలే కాదు ఎస్సీ, ఎస్టీ,మైనార్టీలు చంద్రబాబుకు దూరమయ్యారన్న అభిప్రాయం ప్రజల్లో ఉన్నది.వైఎస్‌ఆర్ సీపీకి ఉన్న 8 మంది రాజ్యసభ సభ్యుల్లో నలుగురు బీసీలే.14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇద్దరు బీసీలనే రాజ్యసభకు పంపారు.చంద్రబాబు 14 ఏళ్ల పాలనను,జగన్ ప్రస్తుత పాలనను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు.ఇప్పుడు చంద్రబాబుకు అర్జంట్‌గా బీజేపీ అనే ఊతకర్ర అవసరం.అందుకోసం పలు విన్యాసాలు చేస్తున్నారు..
కాగా జనసేన ప్రయోజనాలు చంద్రబాబు చుట్టూ బొంగరంలా తిరుగుతున్నవి.2014లో ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయకుండా కాపుల ఓట్లు కొంత శాతం చంద్రబాబుకు బదిలీ అయ్యేలా చూశారు.2019 లో రెండు చోట్లా ఓటమి పాలయి అవమానభారానికి లోనయ్యారు. ఇక 2024 లో ఏమి జరుగుతుందో చూడవలసి ఉన్నది.