తెలంగాణ ఆనందంగా ఉంటుందనుకున్నా... ఆగమయ్యింది..!

Update: 2018-11-23 14:10 GMT

తెలంగాణ రాష్ట్రం ఎంతో బాగుంటుందని రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామని, కానీ ఇవాళ నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలన వల్ల తెలంగాణ ప్రజల భవిష్యత్ అందకారంలోకి వెళ్లిపోయిందని యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు ఎంతో కీలకమైనవని... ఆలోచించి కాంగ్రెస్ పార్టీ, ప్రజాకూటమి అభ్యర్థులను గెలిపించి ప్రజాస్వామిక పాలనను తీసుకురావాలని ప్రజలను కోరారు.

సోనియా గాంధీ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే...

- చాలా కాలం తర్వాత స్వంత బిడ్డల దగ్గరకు వచ్చి తల్లికి ఎంతటి సంతోషం ఉంటుందో తెలంగాణకు రావడం తనకూ అంతే సంతోషంగా ఉంది.

- తెలంగాణ ఏర్పాటు చేసేటప్పుడు ఇది ఎంతో కష్టతరమైన సమస్యగా కనపడింది. ఆ సమయంలో ఆంధ్ర, తెలంగాణ ప్రజల బాగోగులు నా ముందు ఉన్నాయి. అంతపెద్ద సమస్య అయినా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఉద్యమస్ఫూర్తిని గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం.

- తెలంగాణ ఏర్పాటు నిర్ణయం వల్ల కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా నష్టం జరిగింది. అయినా కూడా తెలంగాణ ప్రజల జీవితాలు బాగుండాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం.

- తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఏర్పాటుచేస్తూనే ఏపీ ప్రజలు కూడా బాగుండాలని ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటన చేశాం.

- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం.

- ప్రతీ తల్లి తన పిల్లలు బాగుపడాలని కోరుకుంటుంది. అలాగే తెలంగాణ కూడా బాగుండాలని నేను కోరుకున్నాను.

- ఎంతైతే తెలంగాణ ప్రజలు బాగుపడాలని తెలంగాణ ఇచ్చానో ఇవాళ ఇక్కడి ప్రజల బతుకులు చూస్తే బాధనిపిస్తోంది.

- ఈ నాలుగున్నరేళ్ల పాలన చూస్తే అది మీకు కూడా అర్థం అయి ఉంటుంది. ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ కావాలని అనుకున్నారో అవి నెరవేరాయా ?

- నీళ్లు - నిధులు - నియామకాలు అనే నినాదంతో ఉద్యమం చేస్తే ఒక్క వీటిల్లో ఒక్కటైనా టీఆర్ఎస్ సర్కార్ నెరవేర్చిందా ?

- తెలంగాణలో రైతులు ఇవాళ కూడా వేలాది మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది.

- కష్టపడి తీసుకువచ్చిన భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి రైతులను, రైతు కూలీలను ఇబ్బంది పెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం.

- పేదల కోసం మేము తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకాన్ని కూడా నీరుగార్చారు.

- ఉద్యోగాలు లేక తెలంగాణ యువకులు ఎదురుచూస్తున్నారు. నీరు గారిపోతున్నారు.

- గతంలో ఇక్కడ మహిళా స్వయం సహాయక సంఘాల ప్రగతిని చూస్తే గర్వంగా అనిపించేది. ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు కూడా ఇక్కడి మహిళల అభివృద్ధి గురించి చెప్పేవాళ్లం. కానీ టీఆర్ఎస్ సర్కార్ వారిని అణగదొక్కింది.

- దళితులు, ఆదివాసీల గురించి టీఆర్ఎస్ సర్కార్ ఏమైనా చేసిందా ?

- విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్ గురించి ఏమాత్రం ఆలోచించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వంలో వారి కుటుంబం, బంధుమిత్రుల బాగోగులు మాత్రమే చూసుకున్నారు.

- మాట మీద నిలబడని వారు విశ్వసనీయత లేని వారిని నమ్మవద్దు.

- చిన్నపిల్లవాడి పెంపకంలో లోపం ఉంటే పిల్లవాడి భవిష్యత్ ఎలా నాశనం అవుతుందో... నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆగమైంది. భవిష్యత్ అందకారమైంది.

- ఇది ఒక నిర్ణయాత్మక సమయం. ఈ ఎన్నికలు రాష్ట్రానికి కీలకమైనవి. ఈ ఎన్నికలతో తెలంగాణ భవిష్యత్ ముడిపడిఉంది.

- తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎలా కొట్లాడారో.. అదే స్ఫూర్తితో ప్రజాస్వామిక తెలంగాణ కోసం, మోసం చేసిన టీఆర్ఎస్ పై పోరాడాలి. ప్రజలంతా ఆలోచించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నాను.

Similar News