ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోట అయిన మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో నేడు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున చిలుముల మదన్ రెడ్డి ఇక్కడి నుంచి విజయం సాధించగా ఈసారి మళ్లీ ఆయనే బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి నర్సాపూర్ నుంచి బరిలో ఉండనున్నారు. ఆమె మూడు పర్యాయాలు ఇక్కడి నుంచి విజయం సాధించారు. గత ఎన్నికల్లో 14 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఆమె మళ్లీ ఈసారి బరిలో ఉన్నారు. మరోసారి నర్సాపూర్ లో విజయపతాకం ఎగరేయాలని టీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. ఇదే సమయంలో సునీతా లక్ష్మారెడ్డి కూడా విజయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
గెలిస్తే మంత్రి పదవి ఖాయం...
నర్సాపూర్ నియోజకవర్గంలో సీపీఐ కీలక నేతగా పనిచేసిన చిలుముల విఠల్ రెడ్డి ఏకంగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈ నియోజకవర్గంలో విఠల్ రెడ్డికి కంచుకోటగా ఉండేది. ఆయన వారసుడిగా మదన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చి సునీతా లక్ష్మారెడ్డిపై రెండుసార్లు ఓటమిపాలై గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున విజయం సాధించారు. సునీతా లక్ష్మారెడ్డికి నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉంది. మంత్రిగా పనిచేసినప్పుడు అభివృద్ధి చేశారనే పేరుంది. గత ఎన్నికల్లో ఓటమితో ఆమె ఈ ఎన్నికలను మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నారు. ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. ఇటీవల రేవంత్ రెడ్డి కూడా నియోజకవర్గంలో సునీతా లక్ష్మారెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు. తాను గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆమె మంత్రి పదవి దక్కే అవకాశం ఉందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
అభివృద్ధే గెలిపిస్తుందని...
నర్సాపూర్ స్థానాన్ని మంత్రి హరీష్ రావు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఆయన నియోజకవర్గంలో అనేకసార్లు పర్యటించారు. అభివృద్ధి పనుల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుని దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించారు. మదన్ రెడ్డి హయాంలోనే నర్సాపూర్ లో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు, బస్సు డిపో ఏర్పాటు వంటి అంశాలు ఆయనకు కలిసివచ్చే అవకాశం ఉంది. తాను చేసిన అభివృద్ధితో పాటు పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న సానుకూలతతో తాను సులువుగా విజయం సాధిస్తానని నమ్మకంగా ఉన్నారు. మొత్తానికి నర్సాపూర్ లో ద్విముఖ పోటీనే జరగనుంది. టీఆర్ఎస్ పార్టీ మరోసారి గెలుపు తమదే అని ధీమాగా ఉన్నా పరిస్థితులు చూస్తుంటే సునీతా లక్ష్మారెడ్డి గట్టి పోటీ ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.