తెలంగాణలో కేసీఆర్ ను గద్దె దించి అధికారాన్ని సాధించాలనే లక్ష్యంతో మహాకూటమి ఏర్పడింది. కూటమిలో పెద్దన్న పాత్ర కాంగ్రెస్ పోషిస్తున్నా తెలుగుదేశం పార్టీ కీలకంగా వ్యవహరిస్తోంది. ఆ పార్టీకి 14 స్థానాలను కాంగ్రెస్ కేటాయించింది. ఇందులో ఇప్పటికే 11 స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ఫైనల్ చేసింది. అయితే, దశాబ్దాలుగా వ్యతిరేక పార్టీలుగా ఉన్న కాంగ్రెస్ - టీడీపీలు సులువుగా కలిసిపోయినా, రాష్ట్రస్థాయి నేతలు ఆప్యాయులుగా మారిపోయినా స్థానికంగా మాత్రం నేతలు కలిసే అవకాశాలు కనిపించడం లేదు. టీడీపీ పోటీ చేస్తున్న స్థానాల్లో టిక్కెట్లు దక్కని కాంగ్రెస్ అసంతృప్తులు టీడీపీ అభ్యర్థులకు అంతగా మద్దతు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
ఇండిపెండెంట్ గా పోటీ చేసే యోచనలో బిక్షపతి యాదవ్
టీడీపీకి అనుకూల ఓటు బ్యాంకు ఎక్కువగా ఉందనుకుంటున్న శేరిలింగంపల్లి స్థానాన్ని కాంగ్రెస్ నుంచి బిక్షపతి యాదవ్ ఆశించారు. ఆయన ఇప్పటికే ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించారు. ఇక టీడీపీ టిక్కెట్ భవ్య ఆనంద్ ప్రసాద్ కి కేటాయించడం పట్ల అదే పార్టీ నేత మొవ్వా సత్యనారాయణ కూడా అసమ్మతి బావుటా ఎగరేశారు.
ఉద్యమ కేంద్రంలో టీడీపీ గెలుపు సాధ్యమా..?
వరంగల్ పశ్చిమ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి వదిలేసింది. అక్కడి నుంచి నర్సంపేట నేత రేవూరి ప్రకాష్ రెడ్డిని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ స్థానంలో టీడీపీకి ప్రస్తుతం ఏమాత్రం బలం లేదు. కాంగ్రెస్ నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి బలమైన నేత. ఆయన టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించి భంగపడ్డారు. ఆయన ఇండిపెండెంట్ గా పోటీచేస్తానని చెబుతున్నా పార్టీ పెద్దలు బుజ్జగిస్తే విరమించుకోవచ్చు కానీ రేవూరి ప్రకాష్ రెడ్డికి మాత్రం పూర్తి స్థాయిలో పనిచేసే అవకాశం లేదు. తెలంగాణ ఉద్యమానికి కేంద్రమైన ఈ స్థానంలో టీఆర్ఎస్ బలంగా ఉంది. మరి కాంగ్రెస్ సహకారం లేకుండా టీడీపీ అభ్యర్థి ఎన్నికలకు ఎదుర్కోవడం కష్టమే.
కాంగ్రెస్ నేతలను పట్టించుకోని వీరేందర్ గౌడ్
ఉప్పల్ స్థానం పొత్తులో టీడీపీకి దక్కగా మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ ని అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన చాలా రోజులుగా ఇక్కడ పని చేసుకుంటున్నారు. అయితే, తన తండ్రికి ఈ ప్రాంతంలో ఉన్న ఇమేజ్, టీడీపీ క్యాడరే తనను గెలుపిస్తుందని బాగా నమ్ముతున్న ఆయన కాంగ్రెస్ నేతలను పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ నేతల మద్దతు కూడా కూడగట్టే ప్రయత్నం చేయలేదు. ఇక్కడ కాంగ్రెస్ టిక్కెట్ ఆశించిన రాగిడి లక్ష్మారెడ్డి, మేకల శివారెడ్డి పార్టీ నిర్ణయంపై అసంతప్తిగా ఉన్నా పార్టీలోనే ఉంటారు. అయితే, వీరు వీరేందర్ గౌడ్ కి మాత్రం పూర్తిగా సహకరిస్తారని చెప్పలేం.
ఇబ్రహీంపట్నం వద్దంటున్న సామ
ఎల్బీనగర్ సీటును ఆశించిన టీడీపీ నేత సామ రంగారెడ్డికి ఇబ్రహీంపట్నం టిక్కెట్ ను కేటాయించారు. ఈ నియోజకవర్గానికి సామ కొత్త. కాంగ్రెస్ పార్టీలోనే ఈ స్థానానికి మల్ రెడ్డి రంగారెడ్డి, క్యామ మల్లెష్ మధ్య తీవ్ర పోటీ ఉంది. అటువంటిది ఏకంగా పక్క నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతకు టిక్కెట్ ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో టీడీపీ తనకు అన్యాయం చేసిందని ఇబ్రహీంపట్నం టీడీపీ నేత రొక్కం భీంరెడ్డి అంటున్నారు. దీంతో సామ రంగారెడ్డికి కాంగ్రెస్ నేతలతో పాటు టీడీపీ నేతలు కూడా సహకరించే పరిస్థితి లేదు. దీంతో ఆయన తనకు ఎల్బీనగరే కావాలని, ఓడిపోయే స్థానం తనకు వద్దని సామ రంగారెడ్డి కోరుతున్నారు.
రాజీనామా చేసిన కార్తీక్ రెడ్డి
రాజేంద్రనగర్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ హోంమంత్రి సబిత ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి ఆశించారు. ఆయన చాలా రోజులుగా ఇక్కడి నుంచి పనిచేసుకుంటూ బలం పెంచుకున్నారు. అయితే, గత ఎన్నికల్లో టీడీపీ ఈ స్థానంలో గెలిచినందున ఆ పార్టీనే ఈ స్థానాన్ని తీసుకుంది. టీడీపీ నేత గణేష్ కి ఇక్కడ టిక్కెట్ కేటాయించారు. ఈ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేని కార్తీక్ రెడ్డి కాంగ్రెస్ కి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా బరిలో దిగుతున్నారు. కాంగ్రెస్ క్యాడర్ కూడా ఆయన వెంటే ఉంది. దీంతో టీడీపీ ఇక్కడి నుంచి పోటీ చేసిన ప్రయోజనం లేదన్నట్లుగా పరిస్థితి ఉంది.
ఖమ్మంలో అసంతృప్తి ఉన్నా...
ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మూడు స్థానాలు కేటాయించారు. ఇందులో ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య, అశ్వరావుపేట నుంచి మచ్చ నాగేశ్వరరావుకి టిక్కెట్లు కేటాయించారు. టీడీపీకి మొదటి నుంచి బలం ఉన్న ఈ జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థుల పరిస్థితి కొంత ఫరవాలేదు అన్నట్లుగా ఉంది. పూర్తి స్థాయిలో కాకుండా కొంతమేర కాంగ్రెస్ స్థానిక నేతలు టీడీపీ అభ్యర్థులకు సహకరిస్తున్నారు. కాంగ్రెస్ లో ఇంకా కొంత అసంతృప్తి ఉన్నా రానురాను సహకరించే అవకాశం ఉంది.
పాలమూరులో ఒకటి ఓకే కానీ...
మహబూబ్ నగర్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ టీడీపీకి వదిలేసింది. ఈ స్థానానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ సహా ముగ్గురు నేతలు కాంగ్రెస్ టిక్కెట్ కోసం ప్రయత్నించారు. అయితే, వారెవరికీ కాకుండా జడ్చర్లలో మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన ఎర్ర శేఖర్ ను తీసుకువచ్చి టీడీపీ టిక్కెట్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎర్ర శేఖర్ కు రెబల్ గా ఎవరూ పోటీ చేసే అవకాశం అయితే లేకున్నా ఆయనకు మద్దతు ఇచ్చే అవకాశం కూడా లేదు. ఇదే జిల్లాలో మక్తల్ స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డికి టీడీపీ ఇచ్చింది. ఇక్కడి నుంచి డీకే అరున కుమార్తె స్నిగ్ధరెడ్డి కోసం టిక్కెట్ ఆశించారు. అయితే, ఎమ్మెల్యేగా పనిచేసినందున దయాకర్ రెడ్డికి కొంత ఫర్వాలేదు అనే విశ్లేషణలు ఉన్నాయి.