డీల్‌ సెట్‌ అవుతుందా..?

Update: 2018-12-18 11:00 GMT

తెలంగాణలో ఎన్నో ఆశలతో ఏర్పడిన మహాకూటమి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ దూకుడుకు కుదేల‌య్యింది. మూడున్నర దశాబ్దాల రాజకీయ వైరాన్ని పక్కన పెట్టిన టీడీపీ -కాంగ్రెస్‌ తెలంగాణ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని గద్దె దింపేందుకు కూటమిగా ఏర్పడ్డాయి. దీనిపై రకరకాల విమర్శలు వచ్చినా చంద్రబాబు మాత్రం కాంగ్రెస్‌తో జట్టు కట్టారు. ఎన్నికల్లో కేసీఆర్‌ను గ‌ద్దె దింపేందుకు చంద్రబాబు ఎన్నో త్యాగాలు చేసి చివరకు గత ఎన్నికల్లో టీడీపీ గెలుచుకున్న సీట్లకంటే తక్కువ సీట్లలో పోటీ చేశారు. తెలుగుదేశం తెలంగాణలో 13 సీట్లలో పోటీ చేసినా 10 సీట్లలో మాత్రమే టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ టీడీపీ మధ్య‌ పోటీ సాగింది. తెలుగుదేశం, కాంగ్రెస్‌ పొత్తు సక్సెస్‌ కాలేదని ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. తెలుగుదేశం తెలంగాణలో కేవలం రెండు సీట్లకే పరిమితం అయ్యింది. ఆ రెండు సీట్లు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆంధ్రాకు సరిహద్దుగా ఉన్న సత్తుపల్లి, అశ్వారావుపేట కావడం గమనార్హం.

ఏదోలా గట్టెక్కి....

ఈ రెండు నియోజకవర్గాలపై ఆంధ్రా ప్రభావం ఎక్కువగా ఉండడం సెటిలర్ల ఓట్లు ఉండడంతో టీడీపీ ఏదోలా గట్టెక్కింది. తెలుగుదేశం ఎన్నో ఆశలు పెట్టుకున్న ఖమ్మం, గ్రేటర్‌ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, సనత్‌నగర్‌, ఉప్పల్‌ నియోజకవర్గాల్లోనూ ఘోర పరాజయం పాలైంది. తెలంగాణలో కాంగ్రెస్‌, టీడీపీ పొత్తు సక్సెస్‌ కాకపోవడంతో వచ్చే వేసవిలో ఏపీలో జరిగే సాధారణ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య‌ పొత్తు ఉంటుందా ? పొత్తు కుదిరితే సీట్ల డీల్‌ ఎలా ఉంటుంది అన్న దానిపై ఆసక్తికర చర్చలు స్టార్ట్‌ అయ్యాయి. ఏపీలో కాంగ్రెస్‌ ఎలాగో జీరో అయిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తేనే ఖాతా తెరిచేందుకు ఛాన్స్‌ ఉంటుంది. ఈ విషయంలో ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షులు రఘువీరారెడ్డి సైతం టీడీపీతో వెళ్లక తప్పని పరిస్థితని... టీడీపీతో పొత్తు కుదిరితే తనతో పాటు కొంతమందికి మాత్రమే పోటీ చేసే ఛాన్సులు వస్తాయని... చాలా మంది త్యాగాలు చెయ్యక తప్పదని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే మంచి ఆప్షన్‌ అని కూడా తన అభిప్రాయాన్ని ఉత్తరాంధ్ర నాయకుల సమావేశంలో కుండ బద్దలు కొట్టేశారు.

బాబుకే వదిలేశారా....?

ఇదిలా ఉంటే రాహుల్‌ గాంధీ సైతం ఏపీలో టీడీపీతో పొత్తు విషయాన్ని చంద్రబాబుకే వదిలేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్‌ పార్టీ ఏపీ నాయకులు మాత్రం తమకు 8 లోక్‌సభ సీట్లు, 25 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలన్న ప్రతిపాద‌న తెలంగాణ ఎన్నికలకంటే ముందే పెట్టారు. అయితే ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ బలాన్ని బట్టీ చూస్తే ఇది గొంతెమ్మ కోరిక కిందే లెక్కా. ఎందుకంటే గత ఎన్నికల్లోనే బీజేపీకి టీడీపీ 4 ఎంపీ, 15ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది. ఆ సీట్లలోనే బీజేపీ సరిగ్గా ప్ర‌భావం చూప‌లేక‌పోయింది. కేవలం 2 ఎంపీతో పాటు 4 ఎమ్మెల్యే సీట్లకే పరిమితం అయ్యింది. ఇక ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ఫలితాలు రావడం తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్‌ కూటమి సక్సెస్‌ కాకపోవడంతో పాటు దారుణమైన ఫలితాలు రావడంతో ఏపీలో కాంగ్రెస్‌తో కలిసి ముందుకు వెళ్లేందుకు ఏపీలో టీడీపీకి చెందిన చాలా మంది నాయకులు ఒప్పుకోవడం లేదు. ఇక ప్రస్తుతం టీడీపీ కాంగ్రెస్‌కు ప్రతిపాదించే స్థానాల్లో కూడా ఎస్టీ, ఎస్సీ స్థానాలు ఉన్నట్టు తెలుస్తోంది.

మూడు ఎంపీ స్థానాలే...

ఎంపీ సీట్ల‌ విషయానికి వస్తే అరకు ఎస్టీ స్థానం, అమలాపురం, తిరుపతి ఎస్సీ స్థానాలు కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్‌ పార్టీ మాత్రం కాకినాడ, కర్నూలు, బాపట్ల ఎంపీ సీట్లపై కన్నేసినట్టు తెలుస్తోంది. ఈ స్థానాల నుంచి కాంగ్రెస్‌కు ఇప్పటికి కాస్త పేరున్న బలమైన నాయకులు ఉండడమే ఇందుకు కారణం. ఆరకు నుంచి వైరిచెర్ల కిషోర్‌చంద్రదేవ్‌, కాకినాడ నుంచి పల్లంరాజు, బాపట్ల నుంచి పనబాక లక్ష్మి, అమలాపురం నుంచి హర్షకుమార్‌, తిరుపతి నుంచి చింతామోహన్‌ లాంటి వ్యక్తిగత ఇమేజ్‌ ఉన్న నాయకులు ఉండడంతో ఈ ఎంపీ సీట్ల కోసం కాంగ్రెస్‌ గట్టిగా పట్టుపట్టే ఛాన్సులు ఉన్నాయి. అలాగే ఎమ్మెల్యే సీట్ల విషయానికి వస్తే 8 నుంచి 10 సీట్లు టీడీపీ ఇచ్చే ఛాన్సులుఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, శింగనమల నుంచి మాజీ మంత్రి శైలజా నాథ్‌, విశాఖ ఉత్తరం నుంచి ద్రోణంరాజు శ్రీనివాస్‌ ఇలా కొందరు కీలకనేతలకు పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ టిక్కెట్లు దక్కవచ్చని తెలుస్తోంది.

టీడీపీలో అసంతృప్తి.....

అలాగే గుంటూరులో మాజీ ఎమ్మెల్యే మ‌స్తాన్‌వ‌లీ పేరు కూడా తెర‌మీద‌కు వ‌స్తోంది. కాంగ్రెస్‌ ఆశలు ఎలా ఉన్నా ఈ పొత్తు ఎంత వరకు సెట్‌ అవుతుంది, కాంగ్రెస్‌ కోరిన సీట్లు అన్నీ టీడీపీ ఇస్తుందా అన్నది సందేహమే. ఎందుకంటే తెలుగుదేశం నంచి ఈ స్థానాలు ఆశిస్తున్న వారు ఇప్పటికే తమ అసంతృప్తిని బయటకు వెళ్లకక్కుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, కాంగ్రెస్‌ పొత్తు ఎలా ఉంటుంది? సీట్ల పంపిణి ఎలా సెట్‌ అవుతుంది? తెలంగాణలో కుదిరిన పొత్తును చంద్రబాబు, రాహుల్‌గాంధీ ఎలా ముందుకు తీసుకువెళ్తారు అన్నది ఉత్కంఠగా నెలకొంది. అయితే జాతీయ స్థాయిలో బీజేపీ, ఇతర పక్షాలని ఒక తాటి మీదకు తీసుకువచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు కొన్ని త్యాగాలకు సిద్ధపడి అయినా కాంగ్రెస్‌తో ఏపీలోనూ పొత్తు పెట్టుకుంటారన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం.

Similar News