తెలంగాణలో పోటీ తీవ్రంగా ఉన్న హాట్ సీట్లలో కరీంనగర్ ఒకటి. త్రిముఖ పోటీ నెలకొన్న ఈ స్థానంలో మళ్లీ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చినా విజయం చేజారడంతో ఈసారైనా కరీంనగర్ పై కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ కంకణం కట్టుకుంది. ఈ స్థానాన్ని కీలకంగా తీసుకున్న కాంగ్రెస్ సైతం మాజీ ఎంపీ, పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్ ను బరిలోకి దింపింది. దీంతో మూడు పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ముగ్గురు అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.
బలమైన నేతగా ఎదిగిన గంగుల
2009లో మొదటిసారి టీడీపీ నుంచి కరీంనగర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన గంగుల కమలాకర్ తెలంగాణ ఉద్యమ ప్రభావంతో ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ గూటికి చేరారు. 2014 ఎన్నికల్లో ఆయన 20వేలకు పైగా మెజారిటీతో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ పై విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీనరసింహారావు మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని గంగుల పట్టుదలగా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట వంటి కరీంనగర్ జిల్లాలో ఈసారి క్లీన్ స్వీప్ చేయాలని టీఆర్ఎస్ అధిష్ఠానం కూడా వ్యూహాలు పన్నుతోంది. గంగులకు నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్నా అదే స్థాయిలో ఆరోపణలు కూడా ఉన్నాయి. కొంత మంది కార్పొరేటర్లతో వివాదం కూడా ఆయనకు మైనస్ గా మారింది. ఇటీవల బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో చేసిన వ్యాఖ్యలు కూడా గంగులకు నష్టం చేసే అవకాశం ఉంది. పార్టీ బలం ఆయనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. తన సామాజికవర్గ ఓటర్లు, ముస్లిం ఓటు బ్యాంకుపైన కూడా టీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కరీనగర్ ను డల్లాస్ మాదిరిగా చేస్తా అని భారీ హామీ ఇచ్చారు. అయితే, కొంతమేర సమస్యలు పరిష్కారమైనా కరీంనగర్ పట్టణం పెద్దగా అభివృద్ధి ఏమీ చెందలేదు. ఇది కూడా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మారింది.
కాషాయ జెండా ఎగరేస్తారా..?
ఇక కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న పొన్నం ప్రభాకర్ కి ఇటీవలే పార్టీలో వర్కింగ్ ప్రసిడెంట్ హోదా దక్కింది. దీంతో ఆయనకు ఇక్కడ గెలవడం ప్రతిష్ఠాత్మకంగా మారింది. గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండటంతో పాటు పార్టీకి మంచి పట్టు ఉండటం ఆయనకు కలిసివస్తుందని భావిస్తున్నారు. కానీ, త్రిముఖ పోటీ నెలకొనడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం ఆయనను దెబ్బకొట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక బీజేపీ ఈ స్థానాన్ని సీరియస్ గా తీసుకుంది. హిందుత్వవాదిగా ముద్రపడ్డ బండి సంజయ్ బరిలో ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో భారీగా ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. నియోజకవర్గంలో ముఖ్యంగా పట్టణంలోని యువతలో సంజయ్ కి మంచి పట్టు ఉంది. హిందుత్వ నినాదం కూడా తనకు కలిసి వస్తుందని అనుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి కూడా ఉంది. ఇప్పటికే ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ స్వామి పరిపూర్ణానంద ఇక్కడ బండి సంజయ్ గెలుపు కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి టీఆర్ఎస్ కి కాంగ్రెస్, బీజేపీ గట్టి పోటీ ఇస్తుండగా వ్యతిరేకత ఓటు చీలడం టీఆర్ఎస్ కి మేలు చేసే అవకాశం కనిపిస్తుంది.