తెలంగాణలో ఒక టెన్షన్ కు తెరపడి మరో టెన్షన్ ప్రారంభమైంది. ఎన్నికలు ప్రశాంతంగా ముగియగా ఫలితాలు ఎలా ఉంటాయనే ఉత్కంఠ తెలుగు ప్రజల్లో నెలకొంది. ఇక పోటీలో ఉన్న నేతలు చాలా టెన్షన్ లో ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ప్రధాన నాయకులు ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొన్నందున వారు గెలుస్తామా లేదా అని టెన్షన్ తో గడుపుతున్నారు. ఇక టీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో హేమాహేమీలుగా, ముఖ్యమంత్రి అభ్యర్థులుగా చెప్పుకుంటున్న నేతలు ఓడిపోనున్నారని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ లో ముఖ్యనేతలు కొందరు ఓటమి అంచున కొందరు నేతలు ఉన్నట్లుగా విశ్లేషణలు ఉన్నాయి.
గీతారెడ్డి : జహిరాబాద్ నుంచి బరిలో ఉన్న గీతారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్ రావు నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొన్నారు. ఆమె 2009, 2014 ఎన్నికల్లో చాలా స్వల్ప ఓట్ల మెజారిటీతో ఇక్కడ విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్ రావుపై కేవలం 842 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మాణిక్ రావు విజయం కోసం చాలా శ్రమించారు. ఆయనకు సానుభూతి వర్కవుట్ అయితే గీతారెడ్డికి ఓడిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది.
షబ్బీర్ అలీ : శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన షబ్బీర్ అలీ కామారెడ్డి నుంచి బరిలో ఉన్నారు. ఆయన గత రెండు ఎన్నికల్లో గంపా గోవర్ధన్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లోనూ ఆయన గట్టి పోటీ ఇచ్చినా విజయం ముంగిట ఆగిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ హవా కనిపిస్తున్నందున ఆయనకు పరిస్థితి అనుకూలంగా లేదు. అయితే, వరుసగా రెండుసార్లు ఓడిపోవడంతో ఈసారి కచ్చితంగా గెలుస్తానని ఆయన నమ్మకంగా ఉన్నారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి : నల్గొండ నుంచి నాలుగుసార్లు వరుసగా గెలిచి 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నట్లు కనిపిస్తోంది. ఆయనకు గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా బరిలో దిగి ధీటైన పోటీ ఇచ్చిన కంచర్ల భూపాల్ రెడ్డి ఈసారి టీఆర్ఎస్ తరపున బరిలో ఉన్నారు. ఆయనకు నియోజకవర్గంలో మంచి బలం, సానుభూతి ఉంది. అయితే, వెంకటరెడ్డికి మాస్ ఇమేజ్, ప్రజలకు అందుబాటులో ఉంటారనే పేరుంది. ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఆలోచిస్తే మాత్రం కోమటిరెడ్డికి కష్టమే. కానీ, ఎన్నికల చివరి నిమిషంలో టీఆర్ఎస్ ముఖ్యనేత దుబ్బాక నరసింహారెడ్డిని కాంగ్రెస్ గూటికి చేర్చడం, ఎన్నడూ లేనంత కష్టపడటంతో ఆయన కొంత సేఫ్ అయ్యే అవకాశాలూ ఉన్నాయి.
పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి : కోదాడ నుంచి బరిలో ఉన్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఉత్తమ్ పద్మావతి కూడా క్లిష్ట పరిస్థితుల్లోనే ఉన్నారు. ఆమెకు చివరి నిమిషంలో టీఆర్ఎస్ లో చేరి టిక్కెట్ దక్కించుకున్న బొల్లం మల్లయ్య యాదవ్ గట్టి పోటీ ఇచ్చారు. ఆయనకు నియోజకవర్గంలో మంచి పేరుంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసినా వ్యక్తిగత ఛరిష్మాతో 68 వేల ఓట్లు సాధించారు. ఆయన ఈసారి గెలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.
కొండా సురేఖ : తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడ్డ కొండా సురేఖ కూడా ఓటమి అంచున ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని సవాల్ చేసి కాంగ్రెస్ లో చేరి పరకాల బరిలో ఉన్నారు. అయితే, ఐదేళ్లు నియోజకవర్గానికి దూరంగా ఉండటం, ప్రత్యర్థి ధర్మారెడ్డి చాలా బలంగా మారడం, టీఆర్ఎస్ పెద్దలు ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టడం, కొండా దంపతులు గతంలోలా పట్టు సాధించలేకపోవడంతో ఆమె గెలుపు కష్టమే అన్న అంచనాలు ఉన్నాయి.