ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గంలో ములుగులో ఎన్నికల వేడి రాజుకుంది. పూర్తిగా అటవీ ప్రాంతంతో ఉన్న ఈ నియోజకవర్గంలో కొన్నేళ్ల క్రితం నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉండేది. దేశంలో ప్రసిద్ధ గిరిజన దేవతలు సమ్మక్క - సారలమ్మ కోలువైన ములుగు నియోజకవర్గంలో ఎస్టీల జనాభా ఎక్కువ. 1952లోనే ఏర్పడిన ఈ నియోజకవర్గం అభివృద్ధికి మాత్రం ఆమడదూరంలో ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి అజ్మీరా చందూలాల్ పోటీ చేసి 16 వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి పోదెం వీరయ్యపై విజయం సాధించారు. ఇక టీడీపీ నుంచి పోటీ చేసిన సీతక్క మూడో స్థానంలో నిలిచింది.
లంబాడీ - ఆదివాసీల గొడవ
ములుగు నియోజకవర్గంలో లంబాడీలు, ఆదివాసీ ప్రజలు ఎక్కువ. టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న చందూలాల్ లంబాడీ సామాజికవర్గానికి చెందిన వారు కాగా సీతక్క ఆదివాసీ మహిళ. ఇటీవలి పరిణామాల్లో లంబాడీలు - ఆదివాసీల మధ్య అంతరం ఏర్పడింది. రిజర్వేషన్ల విషయంలో వీరి మధ్య దూరం పెరిగినట్లు కనిపిస్తోంది. దీంతో వీరి ఓట్లు చీలుతాయా లేదా ఏ సామాజకవర్గ ఓటర్లు ఆ సామాజకవర్గ అభ్యర్థికి మద్దతు ఇస్తారా అనేది చర్చనీయాంశమవుతోంది. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న ఇక్కడ గిరిజన గూడేల్లో కనీస మౌళిక సదుపాయాలు కూడా లేవు. దశాబ్దాలుగా అభివృద్ధికి ఆమడదైరంలో ఉన్న ఈ నియోజకవర్గం ఇటీవల కొంత అభివృద్ధి చెందుతోంది. అయితే, ఇంకా చాలా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది.
జిల్లా చేస్తామని కేసీఆర్ హామీ
2014 ఎన్నికల్లో గెలిచాక చందూలాల్ కి మంత్రివర్గంలో అవకాశం లభించింది. అయితే, ఆయన ఆరోగ్యం సహకరించడం లేదనో, ఇతర కారణాలతోనో ఆయనను తర్వాత తప్పించారు. చందూలాల్ మంత్రిగా ఉన్నప్పుడైనా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైనా ఆయన కుమారుడు అజ్మీరా ప్రహ్లాద్ నియోజకవర్గంలో షాడోగా వ్యవహరించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో చందూలాల్ కి టిక్కెట్ దక్కదని పలువురు టీఆర్ఎస్ నేతలు టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్నారు. టిక్కెట్ మళ్లీ చందూలాల్ కే దక్కడంతో వారంతా తిరుగుబావుటా ఎగరేశారు. చాలారోజులే అసమ్మతిగా ఉన్నా తర్వాత పార్టీ పెద్దలు బుజ్జగించడంతో కొందరు తగ్గారు. పార్టీలోని కొందరు చందూలాల్ కి పూర్తిగా సహకరించడం లేదు. ఇక ములుగు జిల్లా కావాలని ఇక్కడి ప్రజలు పెద్దఎత్తున ఉద్యమించారు. అయినా, వారి డిమాండ్ నెరవేరలేదు. ఇది టీఆర్ఎస్ కి మైనస్ గా మారింది. పోడు భూముల వ్యవహారంలోనూ ఆదివాసీలు అసంతృప్తిగా ఉన్నారు. ఇది గ్రహించిన టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇక్కడ నిర్వహించిన సభలో ములుగును జిల్లా చేస్తామని, పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఇది టీఆర్ఎస్ కి కొంత కలిసివచ్చే అవకాశం ఉంది.
ద్విముఖ పోటీ ఉండటంతో...
టీడీపీ నుంచి రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ లో చేరిన సీతక్కకు కాంగ్రెస్ టిక్కెట్ దక్కింది. మరో ఆశావహుడు పోదెం వీరయ్యను భద్రాచలం పంపించడంతో సీతక్కకు ఇక్కడ లైన్ క్లీయర్ అయ్యింది. ఇక పొత్తులు కూడా ఆమెకు కలిసివచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగతంగానూ సీతక్కకు మంచి ఇమేజ్ ఉంది. ఆమె తరపున రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థి, ఆ పార్టీ పై ఉన్న వ్యతిరేకత తనకు బాగా కలిసివస్తుందని ఆమె భావిస్తున్నారు. అయితే, ఇక్కడ ద్విముఖ పోటీ ఉండటం టీఆర్ఎస్ కు మైనస్ గా మారింది. టీఆర్ఎస్ కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారంతా సీతక్క వైపే ఉండనున్నారు. మొత్తానికి ఇక్కడ మంత్రి చందూలాల్ కొంత గడ్డు పరిస్థితులే ఎదుర్కొంటున్నా ఈ నాలుగేళ్లుగా జరిగిన అభివృద్ధి, గిరిజన తండాలను గ్రామ పంచాయితీలు చేయడం, పార్టీ పథకాల పట్ల లబ్ధిపొందిన వారు ఎక్కువగా ఉండటం ఆయనకు కలిసివచ్చే అవకాశం ఉంది.