టీఆర్ఎస్ కు అసద్ అడ్డంకి....!!

Update: 2018-11-15 03:30 GMT

హైదరాబాద్ కి చెప్పాలంటే పాతబస్తీకి మాత్రమే దశాబ్దాలుగా పరిమితమైన ఆల్ ఇండియా మజ్లీస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) గత కొన్ని సంవత్సరాలుగా తన పంథా మార్చుకుంది. పార్టీని విస్తరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కూడా పలు ఎన్నికల్లో పోటీచేసి కొన్ని స్థానాల్లో విజయం సాధించింది. స్థానిక సంస్థల్లో కొన్నిచోట్ల ఎంఐఎం జెండా ఎగరేసింది. ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతాలకు సైతం పార్టీని విస్తరించాలని ఆ పార్టీ పట్టుదలతో ఉంది. గత ఎన్నికల్లో తెలంగాణలోనూ ఈ ప్రయత్నం చేసింది. అయితే, ఆ పార్టీ గెలిచే పాతబస్తీలోని ఏడు స్థానాలు మినహా మిగతా స్థానాలు గెలవలేదు. కానీ, పలు స్థానాల్లో భారీగా ఓట్లు సాధించి పట్టు నిలుపుకుంది. అయితే, ఈ ఎన్నికల్లో మాత్రం ఎంఐఎం విస్తరణ కాంక్ష బ్రేక్ పడేలా కనిపిస్తోంది. టీఆర్ఎస్ తో స్నేహపూర్వక పోటీ కారణంగా యధేచ్ఛగా పోటీ చేసే అవకాశం ఎంఐఎంకి లేదు.

ముస్లింలు కీలకంగా ఉన్న నియోజకవర్గాల్లో

తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల జనాభా 12.5 శాతం ఉంటుందనే లెక్కలు ఉన్నాయి. అయితే, హైదరాబాద్ మినహా మిగతా నియోజకవర్గాల్లో వీరిలో అధిక శాతం కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉండేవారు. ఎంఐఎంతో సుదీర్ఘకాలం స్నేహబంధం ఉండటం కూడా ఇందుకు కారణం. అయితే, 2014 నుంచి సీన్ రివర్స్ అయ్యింది. కాంగ్రెస్ తో ఎంఐఎంకి చెడింది. ఇప్పుడు టీఆర్ఎస్ తో ఆ పార్టీని స్నేహం చేస్తోంది. తెలంగాణలో హైదరాబాద్ తో పాటు వరంగల్, నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, బోధన్ వంటి పలు జిల్లాల్లోని నియోజకవర్గాల్లో కూడా ముస్లింల ప్రాభల్యం ఎక్కువ ఉంటుంది. ఈ నియోజకవర్గాల్లో ఆ పార్టీ విస్తరించేందుకు కొంత అవకాశం ఉండేది. కానీ, టీఆర్ఎస్ తో స్నేహం కారణంగా ఈ స్థానాల్లో ఆ పార్టీ నేరుగా పోటీ చేయడం లేదు. ఆయా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కే మద్దతు ఇస్తున్నట్లు ఎంఐఎం ప్రకటించింది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో అసదుద్దిన్ ఓవైసీ ఈ మేరకు సభలు నిర్వహించి ప్రచారం కూడా చేశారు.

టీఆర్ఎస్ నియోజకవర్గాల్లో బలమైన ఓటు బ్యాంక్

గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ లో ఎంఐఎం తరపున నవీన్ యాదవ్ 41 వేల ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ఆయన మరోసారి పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ, టీఆర్ఎస్ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పోటీలో ఉన్నారు. మరి, ఎంఐఎం పోటీ చేస్తే టీఆర్ఎస్ కి ఇబ్బంది తప్పదు. ఇక రాజేంద్రనగర్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి 50 వేల ఓట్లు సాధించారు. ఈసారి ఎంఐఎం ఇక్కడి నుంచి కచ్చితంగా గెలవాలనుకుంటుంది. ఈ మేరకు అసదుద్దిన్ ప్రచారం కూడా చేశారు. టీఆర్ఎస్ ఈ స్థానానికి రావొద్దని ఇటీవల ఆయన ఓ బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు.

రెండు పార్టీల మధ్య.....

టీఆర్ఎస్ నుంచి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పోటీలో ఉన్నారు. మరి ఈ రెండు టీఆర్ఎస్ నియోజకవర్గాల్లో రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉండటం ఖాయంగా కనపడుతోంది. ఇక నిజామాబాద్ అర్బన్ లో కూడా ఎంఐఎం అభ్యర్థి గత ఎన్నికల్లో 40 వేలకు పైగా ఓట్లు సాధించి టీఆర్ఎస్ కి గట్టి పోటీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ సిట్టింగ్ గా ఉన్న గణేష్ గుప్తా పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎంఐఎం పోటీలో ఉంటుందా లేదా స్పష్టం కాలేదు. మొత్తానికి టీఆర్ఎస్ తో స్నేహం ఎంఐఎం విస్తరణ ఆకాంక్షకు బ్రేకులు వేసినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో ఎంఐఎం బలంగా ఉన్న పాతబస్తీలోని ఏడు స్థానాల్లో టీఆర్ఎస్ నామమాత్రంగానే పోటీలో ఉంటోంది. అందుకే బలమైన అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వలేదు. నాంపల్లిలో ఎంఐఎంకి కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉండటంతో టీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థికి బీఫాం ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టింది. ఇక్కడ ఎంఐఎంకి ఇబ్బంది కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Similar News