ఉద్యమాల ఖిల్లా ఓరుగల్లు జిల్లాలో కీలక స్థానం వరంగల్ వెస్ట్. జిల్లా కేంద్రమైన ఈ నియోజకవర్గం టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి కూడా ఆ పార్టీకి కంచుకోటలా మారింది. 2004, 2009, 2010 ఉప ఎన్నికలు, 2014 ఎన్నికల్లో వరుసగా ఇక్కడి నుంచి టీఆర్ఎస్ గెలుస్తూ సత్తా చాటుతోంది. గత మూడు ఎన్నికల్లోనూ ఆ పార్టీ తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. మరోసారి ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో రెండు నెలలుగా ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక మహాకూటమిలో భాగంగా ఈ స్థానాన్ని ఎవరూ ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీకి కేటాయించింది. ఇక్కడి నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డికి టిక్కెట్ కేటాయించారు.
వినయ్ భాస్కర్ కి ఎదురులేదా..?
ఈ నియోజకవర్గం ఉద్యమానికి కేంద్రం. ప్రభుత్వ ఉద్యోగుల ఎక్కువగా ఉంటారు. ఉద్యమ ప్రభావంతో టీఆర్ఎస్ కు ఎదురు లేకుండా గత నాలుగు ఎన్నికలు జరిగాయి. 2010 ఉప ఎన్నికలు, 2014 ఎన్నికల్లో అయినా ఏకంగా సుమారు 60 వేలకు పైగా మెజారిటీ టీఆర్ఎస్ అభ్యర్థి వినయ్ భాస్కర్ కి వచ్చింది. ప్రజల్లో ఉండే వ్యక్తిగా వినయ్ భాస్కర్ కి పేరుంది. ఆయన సామాజికవర్గానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉండటంతో పాటు కొత్త ప్రాంతాల్లో బలమైన ఓటు బ్యాంకు ఆయనకు ఏర్పడింది. దీంతో ఆయనకు ఎదురు లేదన్నట్లుగా పరిస్థితి ఇంతకాలం ఉంది. అయితే, అభివృద్ధి విషయంలో హామీలు పూర్తిగా నెరవేర్చలేకపోవడం, మూడు పర్యాయాలు గెలిచినందున సహజంగానే కొంత వ్యతిరేకత రావడం మైనస్ గా మారింది. అయినా విజయంపై ధీమాగా ప్రచారం చేసుకుంటున్నారు.
మహాకూటమిలో అసమ్మతి
కాంగ్రెస్ పార్టీ నుంచి డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి టిక్కెట్ ఆశించారు. ఆయన నియోజకవర్గంలో మంచి పట్టు సంపాదించుకున్నారు. కానీ, పొత్తులో భాగంగా నర్సంపేటకు చెందిన రేవూరి ప్రకాష్ రెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. దీంతో నాయిని పూర్తిగా అసంతృప్తితో ఉన్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ క్యాడర్ మొత్తం ఆయన వెంటే ఉంది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని ప్రకటించారు. ఆయన భారీగానే ఓట్లు చీల్చే అవకాశం ఉండటం కూటమి అభ్యర్థికి మైనస్ గా మారింది. ఉద్యమ కేంద్రమైన ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ప్రజలు ఏమేర గుర్తిస్తారో కూడా చెప్పలేం. 2010 ఉప ఎన్నికల సమయంలో ఆ పార్టీకి ఇక్కడ 10 వేల ఓట్లు కూడా రాలేదు. అయితే, రెడ్డి సామాజికవర్గ ఓట్లు ఎక్కువగానే ఉండటం, మూడు పర్యాయాలు ఎమ్మెల్యే పనిచేసిన అనుభవం ఉండటం, క్లీన్ ఇమేజ్ ఉండటం రేవూరికి కలిసివచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు పరిస్థితి వినయ్ భాస్కర్ కి అనుకూలంగా కనిపిస్తున్నా... సైలెంట్ ఓటింగ్ తమకు అనుకూలంగా ఉంటుందని మహాకూటమి అభ్యర్థి నమ్మకంగా ఉన్నారు.