ఉద్యమాల ఖిల్లా ఓరుగల్లుపై ఈసారి పూర్తిగా ఆధిపత్యం సాధించేందుకు టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించేందుకు వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా వరంగల్ నగరంలోని రెండు స్థానాల్లో విజయం సాధించాలనుకుంటోంది. వీటిలో ఒక్కటైన వరంగల్ తూర్పుపై మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఇక కాంగ్రెస్ కూడా ఈ స్థానాన్ని కీలకంగానే తీసుకుంటోంది. ప్రత్యేకించి టీఆర్ఎస్ కి దూరమై కేసీఆర్ పై, టీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించిన కొండా దంపతులు వరంగల్ తూర్పు బాధ్యతలను తలకెత్తుకున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన కొండా దంపతులు కాంగ్రెస్ అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తున్నారు.
టీఆర్ఎస్ లో అసంతృప్తి ఉన్నా...
గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి కొండా సురేఖ 55 వేల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి బస్వరాజ్ సారయ్యపై విజయం సాధించారు. తర్వాత నాయకుల చేరికలతో టీఆర్ఎస్ ఇక్కడ మరింత బలోపేతం అవడంతో పాటు విభేదాలూ ఏర్పడ్డాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ టిక్కెట్ కోసం కొండా సురేఖతో పాటు మాజీ మంత్రి సారయ్య, మేయర్ నన్నపునేని నరేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, గుడిమళ్ల రవికుమార్ తదితరులు ప్రయత్నించారు. అయితే, మొదటి లిస్టులో కొండా పేరు లేకపోవడంతో ఆమె పార్టీతో పాటు నియోజకవర్గం మారిపోయారు. దీంతో నామినేషన్ల గడువు ముగుస్తుందనగా టిక్కెట్ ను మేయర్ నన్నపునేని నరేందర్ కి టీఆర్ఎస్ కేటాయించింది. దీంతో ఇతర ఆశావహులు అసంతృప్తికి గురైన తర్వాత చల్లబడ్డారు.
కార్పొరేటర్లకు రెండు పార్టీల గాలం
ప్రజాకూటమిలో వరంగల్ ఈస్ట్ స్థానం విషయంలో సమన్వయం కుదరలేదు. తెలంగాణ జన సమితి తరపున సంఘ సేవకులు గాదె ఇన్నారెడ్డికి టిక్కెట్ ఇవ్వగా, కాంగ్రెస్ పార్టీ వ్యాపారవేత్త వద్దిరాజు రవిచంద్రకు టిక్కెట్ ఇచ్చింది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న రవిచంద్ర ఆర్థికంగా బలంగా ఉన్నారు. అయితే, నియోజకవర్గంలో పెద్దగా పట్టులేదు. దీంతో కొండా దంపతులే ఆయన గెలుపు బాధ్యతలను భూజాన వేసుకున్నారు. రవిచంద్ర ఆలస్యంగా వచ్చినా నియోజకవర్గంలో పట్టు పెంచుకోవడంలో కొంత సఫలమయ్యారు. పలువురు కార్పొరేటర్లు, ద్వితీయ శ్రేణి నాయకులకు గాలం వేస్తున్నారు. కొండా దంపతుల క్యాడర్ ఆయన కోసం పనిచేస్తోంది. కొండా దంపతుల్లో ప్రతీరోజు ఎవరో ఒకరు ఈ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ కూడా అలెర్ట్ అయ్యింది. కొండా వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచిస్తోంది. తమ పార్టీ నుంచి కార్పొరేటర్లు, నాయకులు చేజారకుండా చూసుకుంటోంది. వారం క్రితం కొండా మురళి సమక్షంలో కాంగ్రెస్ లో వేణుగోపాల్ అనే కార్పొరేటర్ చేరగా... టీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగి కేటీఆర్ వద్దకు తీసుకెళ్లి మళ్లీ గులాబీ కండువా కప్పించారు. ఇక మరో కార్పొరేటర్ ను తనవైపు తిప్పుకునేందుకు రవిచంద్ర ఆయన ఇంటికి వెళ్లగా విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ ముఖ్యనేతలు వెంటనే ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించారు. ఇలా రెండు పార్టీలూ వ్యూహప్రతివ్యూహాలు పన్నుతున్నారు.
కాంగ్రెస్ కి బలమూ... బలహీనత వారే...
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీసీలు, ముస్లిం ఓట్లే కీలకంగా ఉన్నాయి. బీసీల్లో మున్నురు కాపు, పద్మశాలి ఓటర్లు అధికంగా ఉన్నారు. ప్రధాన పోటీదారులు ఇద్దరు మున్నురు కాపు సామాజికవర్గం వారే. ఇక ముస్లిం ఓటర్లను టీఆర్ఎస్ తమవైపు తిప్పుకుంటోంది. గతంలో కొండా మురళి చేసిన తప్పిదాల వల్ల ముస్లింలు వారి పట్ల కొంత వ్యతిరేకతతో ఉన్నారు. అదే సమయంలో వారికి అనుకూలంగా కూడా కొంతమంది మైనారిటీ నేతలు ఉన్నారు. అభివృద్ధి విషయంలో నియోజకవర్గం వెనుకబడ్డా దానికి కారణంగా మేయర్ ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థితో పాటు ఇంతకాలం ఎమ్మెల్యేగా ఉన్న కొండా సురేఖ వల్ల కాంగ్రెస్ కూడా బాధ్యత వహించాల్సి వస్తోంది. దీంతో ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి పక్షాన టీఆర్ఎస్ నేతలంతా కలిసికట్టుగా ప్రచారం చేస్తున్నారు. అయితే, ఇప్పటికే మేయర్ గా ఉన్న వ్యక్తికి టిక్కెట్ ఇవ్వడం పట్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత కూడా ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థికి పార్టీ బలంతో కలిసివచ్చే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థికి అర్థబలంతో పాటు కొండా దంపతులే బలమూ, బలహీనతగా మారారు. మొత్తానికి ఇప్పటికైతే టీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ కంటే ముందంజలో కనిపిస్తుండగా... కాంగ్రెస్ కూడా పట్టు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.