రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో.. రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి. మరో పది మాసాలు లేదా ఈ ఏడాది డిసెంబరులోనే జరుగుతాయని భావిస్తున్న ఎన్నికలకు సంబంధించి ప్రతి పార్టీ తనదైన వ్యూహంతో ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో కీలకమైన టీడీపీ, వైసీపీ, జనసేనలు తమ తమ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో తాము ఎన్నికల్లో గెలిచాక ఏం చేస్తామనే విషయాలు చెప్పుకొస్తున్నారు. అయితే, తాజాగా మళ్లీ పుంజుకుంటామని చెబుతున్న కాంగ్రెస్ మాత్రం జగన్ జపం చేస్తోంది. జగనే టార్గెట్ అంటూ మీడియాకు లీకులు ఇస్తోంది. జగన్ ను దెబ్బకొడితేనే తాము ఉనికిని కాపాడుకుంటామని హస్తం నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ రాజకీయాలు, వ్యూహాలు ఏంటనే విషయాలపై తాజాగా చర్చ నడుస్తోంది. నిజానికి ఇప్పుడున్న పరిస్థితిలో జగన్‌ను ఢీకొట్టే సత్తా కాంగ్రెస్‌కు ఉందా? అనేది పెద్ద ప్రశ్న.
జగన్ తన వెంట.....
వ్యూహాత్మక రాజకీయాలు చేయడంలో కాంగ్రెస్ దిట్ట! అనేది ఒకప్పటి పరిస్థితి. కానీ, నేడు పరిస్థితి మారిపోయింది. ఎవరో ఒకరి బలహీనతలపై వేసుకున్న నిచ్చెనతో ఎదుగుదామనే తరహాలోనే కాంగ్రెస్ దిగజారి పోతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వాస్తవానికి జగన్‌కు బలమేదైనా ఉందీ అనుకుంటే అది ప్రజలు మాత్రమే. నిజానికి ఆయన ఎక్కడా కాంగ్రెస్ నుంచి వచ్చే ఓటు బ్యాంకునుకానీ, కాంగ్రెస్ నేతలను చూసుకుని కానీ, ఆయన రాజకీయాలు చేయలేదు. రాజకీయాలు చేయబోడు కూడా! 2012లో స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ లక్ష్యం జనం. జగన్ బలం జనం! మరి అలాంటి పరిస్థితిని అర్ధం చేసుకోవడంలో కాంగ్రెస్ నేతలు విఫలమవుతున్నారనేది నెటిజన్ల కామెంట్! వాస్తవం చెప్పుకోవాలంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్ ను దెబ్బకొట్టింది కాంగ్రెస్ నేతలే. ఈ విషయంలో రెండో మాట కూడా లేదు. కాంగ్రెస్‌ను దెబ్బతీసిన వారిలో కీలకంగా వ్యవహరించిన నాయకులు.. అనేక మంది ఉన్నారు.
పార్టీ వీడిన వారంతా.....
వారంతా నేడు సేఫ్‌గానే ఉన్నారు. కీలకమైన మంత్రి పదవులు పొంది.. వాటిని అనుభవించిన గల్లా అరుణ నేడు టీడీపీలో ఉన్నారు. పురందేశ్వరి నేడు బీజేపీలో ఉన్నారు. కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు, గంటా శ్రీనివాసరావు (కాంగ్రెస్ హయాంలో మంత్రిగా ఉన్నారు), కన్నా లక్ష్మీనారాయణ(బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు), జ్యోతుల నెహ్రూ (ఇప్పుడు టీడీపీ) ఇలా.. అనేక మంది కీలక నాయకులు, కులాలను సైతం కదిలించగల నేతలు ఇప్పుడు టీడీపీలోనే చక్రం తిప్పుతున్నారు. మరికొందరు బీజేపీలో ఉన్నారు. ఇక, వైసీపీ విషయానికి వస్తే.. ఈ పార్టీలోకి వచ్చిన ఒకరిద్దరు నేతలు మినహా మిగిలిన వారంతా వైఎస్ పేరు చెప్పుకొని, జగన్ ప్రచారంతో ముందుకు నడుస్తున్నవారే!
వ్యూహాత్మక తప్పిదమే.....
అలాంటప్పుడు కాంగ్రెస్ నేతలను జగన్ తన్నుకుపోయాడనో.. కాంగ్రెస్ ఓటు బ్యాంకును గుంజుకున్నాడనో భావించడం వృథా ప్రయాసే అవుతుంది తప్ప.. ఇంకేమీ లేదు. వ్యవస్థాగత మార్పు ద్వారానే కాంగ్రెస్ పుంజుకోవాలి తప్ప..మా వాళ్లను జగన్ లాక్కున్నాడు కాబట్టి.. మేం జగన్‌ను స్మాష్ చేస్తామంటే.. జనాలను పిచ్చివాళ్లను చేయడమే అవుతుంది. పోనీ.. తటస్థంగా ఉన్న ఎంపీలు సబ్బం హరి, ఉండవల్లి అరుణ్ కుమార్ వంటివారు ఇప్ప[టికీ.. తాము కాంగ్రెస్‌లోకి వస్తామని ఎక్క[డా ప్రకటించకపోగా.. కాంగ్రెస్ ఉనికిపైనే ఇప్పటికీ ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి ఇలాంటి విషయాలు అనేకం ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ హల్‌చల్ చేస్తున్నప్పుడు.. కేవలం ''టార్గెట్ జగన్'' అనడం ద్వారా కాంగ్రెస్ మరింత వ్యూహాత్మక తప్పిదాల దిశగా అడుగులు వేస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి నేతలు వీటిపై దృష్టి పెడతారో లేదో చూడాలి.