జంప్ జిలాలనీలపై మండిపడుతున్న జనం
ఎమ్మెల్యేలు పార్టీలు మారుతూనే ఉన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు జంప్ జిలానీలుగా మారుతూనే ఉన్నారు. నీతి...నియమాలు లేని రాజకీయాలు ఇప్పడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్నాయి. ప్రజలు ఒక పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను నమ్మి ఓటేసి గెలిపిస్తే... వాటిని తుంగలో తొక్కి స్వప్రయోజనాల కోసం అధికారపార్టీ వైపు విపక్ష ఎమ్మెల్యేలు పరుగులు తీస్తున్నారు. అందలం ఎక్కేందుకు ఆశపడుతున్నారు. నవ్విపోదురు గాక...నాకేమిటి? అన్న రీతిలో ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు. జంప్ జిలానీల తీరుపై జనం మండిపడుతున్నారు.
చట్టం అపహాస్యం.....
తాజా ఏపీలో మరో వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పార్టీని ఫిరాయించడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అధికార పార్టీలు అపహాస్యం చేస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఫిరాయింపులు ఇప్పడు కొత్తగా వచ్చిందేమీ కాదు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇది ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైంది. ఉద్యమ పార్టీ నుంచి గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ తన పార్టీలోకి చేర్చుకున్నారు. ఇందుకు ఎమ్మెల్యేలకు పెద్ద యెత్తున ముడుపులు ఇచ్చినట్లు ఆప్పట్లో టీఆర్ఎస్ ఆరోపించింది. అసెంబ్లీకాలం ముగిసి పోతున్న తరుణంలో ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకున్నారు. తర్వాత రెండు రాష్ట్రాలూ విడిపోయాయి. ఇప్పడు ఏపీ, తెలంగాణల్లో ఫిరాయింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో ప్రతిపక్షపార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీతో పాటు చివరకు ఒకే ఒక సీపీఐ సభ్యుడ కూడా అధికార పార్టీలోకి జంప్ చేసేశారు. మరీ విచిత్రమేమిటంటే తెలుగుదేశం పార్టీ గుర్తుపై గెలిచిన తలసాని శ్రీనివాసయాదవ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కొన్ని నెలలపాటు మంత్రి పదవిలో కొనసాగారు. ఇది అనేక విమర్శలకు దారి తీసింది. ఇందుకు తెలుగుశం పార్టీ గగ్గోలు పెట్టింది. తమ ఎమ్మెల్యేలను కేసీఆర్ ప్రలోభపెట్టి తీసుకెళుతున్నారని ఆరోపించింది. అదే పనిని ఆంధ్రప్రదేశ్ లో ఎలా అమలు పరుస్తుంది? అయితే విపక్ష పార్టీలు మారినా తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు బలంగానే ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎంలు అధికార పక్షాన్ని అవసరమైనప్పుడల్లా ఇరుకున పెడుతూనే ఉన్నాయి.
విపక్షం లేకుండా చేయాలనేనా?
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే అక్కడ ప్రతిపక్షపార్టీ ఒక్కటే. ఏపీ అసెంబ్లీలో మూడే మూడు పార్టీలు ఉన్నాయి. టీడీపీ, బీజేపీ, వైఎస్ఆర్సీపీ. బీజేపీ ఎటూ మిత్రపక్షమే కాబట్టి ప్రతిపక్షం ఒక్క వైఎస్సార్సీపీయే. ఇప్పడు విపక్షమనేది లేకుండా చేయాలన్నది టీడీపీ వ్యూహంగా కన్పిస్తోంది. ఇప్పటికే 16మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిపోయారు. మరికొందరు రెడీగా ఉన్నారని అధికార పార్టీ సభ్యులే చెబుతున్నారు. జగన్ పార్టీని ఖాళీ చేస్తామని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. కాని ప్రజాస్వామ్యంలో అది సరైన విధానమేనా? అని ప్రశ్నిస్తున్నారు మేధావులు. విపక్షం లేకుండా నియంత పాలనకు తెరతీస్తున్నారా? అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. అధికారపక్షం చేసే తప్పులను విపక్షమే సభలో నిలదీయాలి. పలు విషయాల్లో నిర్మాణాత్మకమైన సూచనలు చేయాలి. అలాంటి ప్రతిపక్షమే లేకుండా చేయడం ఎంతవరకు సబబు? దీనికి అధికార పార్టీ తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కుంటిసాకులు చెబుతోంది. అభివృద్ధిని చూసే ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తున్నారన్నది వారి వాదన. అయితే ప్రజలు వేసిన ఓటుకు విలువ ఏముంటుంది?
బలముండి...కూడా..
రెండు తెలుగురాష్ట్రాల్లో అధికార పార్టీలకు సంపూర్ణ మెజారిటీ ఉంది. ఇతర సభ్యుల మద్దతు అవసరమే లేదు. కాని ఫిరాయింపులను ఇద్దరూ ప్రోత్సహిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. రాజకీయ సుస్థితర కోసం చేశారంటే నిజమనుకోవచ్చు. కాని అటువంటి పరిస్థితే లేనప్పుడు జరుగుతున్న ఈ ఫిరాయింపులను ప్రతిపక్షం లేకుండా చేయడానికేనన్న విమర్శలు విన్పిస్తున్నాయి. తాము ఓట్లు వేసిన పార్టీలో ఉండకుండా వేరే పార్టీలోకి వెళుతున్న నేతలను వచ్చే ఎన్నికల్లో జనం ఆదరిస్తారా? అనేది కూడా అనుమానమే. చట్టాన్ని అపహాస్యం చేసినా....జనం నుంచి మాత్రం తప్పించుకోలేరన్నది విశ్లేషకుల అంచనా.
ఫిరాయింపుల నిరోధక చట్టమంటే...
పార్టీ ఫిరాయింపులను నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం 1985లో చట్టం తెచ్చింది. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 52 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ చట్టాన్ని తెచ్చారు. ఈ చట్టం ప్రకారం ఒక పార్టీ నుంచి టిక్కెట్ పొంది గెలిచి వేరే పార్టీలోకి వెళ్లినప్పడు... పార్టీ జారీ చేసిన విప్ కు వ్యతిరేకంగా సభ్యుడు గైర్హాజరైనా, వ్యతిరేకంగా ఓటు వేసినా ఆ సభ్యుడు అనర్హతకు గురవుతాడు. స్వతంత్ర అభ్యర్ధులుగా గెలిచి ఏదైనా పార్టీలో చేరినా వారి సభ్యత్వం రద్దవుతుంది. అయితే ఈ చట్టంలో ఇచ్చిన మినహాయింపులు అధికార పార్టీలకు వరంగా మారాయి. పార్టీ టిక్కెట్ పై గెల్చిన మొత్తం సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది వేరే పార్టీలో చేరితే వారికి అనర్హత వర్తించదు. వేరే పార్టీ ఏర్పాటు చేసుకున్నా అనర్హతకు గురికారు. శాసనసభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం స్పీకర్ కు మాత్రమే ఉంటుంది. పార్టీ అధ్యక్షుడి ఫిర్యాదు మేరకు స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు.