ఎర్రబెల్లి ఎక్కడ?

Update: 2016-12-22 10:09 GMT

ఎర్రబెల్లి దయాకరరావు. తెలంగాణ రాష్ట్రంలో ఈ పేరు వినని వారుండరు. తెలుగుదేశంలో ఉన్న కాలంలో ఎర్రబెల్లి దయాకరరావు ఓ వెలుగు వెలిగారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి దక్కకున్నా...తన పవర్ ఏమిటో ప్రత్యర్ధులకు చూపించాడు. మాస్ లీడర్ గా పేరున్న ఎర్రబెల్లి సంవత్సరం కాలం క్రితం టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన కన్పించుట లేదు.

ఎందుకు?

సొంత ఇమేజ్ తెలుగుదేశంలో సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు, వరంగల్ జిల్లాలో బలమైన నేత. పార్టీ కంటే వ్యక్తిగతంగానే ఇమేజ్ సంపాదించుకున్న ఎర్రబెల్లి ఇటీవల కాలంలో మీడియాకు దూరమయ్యారు. వార్తల్లో వ్యక్తిగా ఉండటం లేదు. వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎర్రబెల్లి విజయం సాధించారు. రాష్ట్రమంతటా గులాబీ గాలి వీస్తున్నా....ఎర్రబెల్లి సైకిల్ మాత్రం ఎన్నికల్లో ఫలితాల్లో ముందుంది. టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్ ను, ఆయన కుటుంబాన్ని ఎర్రబెల్లి ఎండగట్టే వారు. ఒంటికాలిమీద లేచే వారు. కాని ఉన్నట్లుండి టీఆర్ఎస్ లో చేరిపోయారు.

మౌనమే..నీ...భాష

వరంగల్ జిల్లాలో గ్రూపు రాజకీయాలకు కొదవ లేదు. అన్ని పార్టీల్లోనూ గ్రూపు గొడవలే. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కడియం శ్రీహరితో పడేది కాదు. ఇక కొండా మురళి, సురేఖలతో ముఖాముఖి తలపడేవారు. కాంగ్రెస్ లో ఉండి కొండా సురేఖ దంపతులు ఎర్రబెల్లిని ముప్పుతిప్పలు పెట్టేవారు. అయినా...ఆయన అన్నింటికీ తట్టుకున్నారు. టీడీపీలో రేవంత్ రెడ్డితో చికాకులుండేవి. చివరకు...ఎట్టకేలకు ఇంటిపోరుతో టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. తన చిరకాల ప్రత్యర్ధులందరూ ఇప్పడు టీఆర్ఎస్ లోనే ఉన్నారు. కడియం శ్రీహరి డిప్యూటీ సీఎం అయిపోయారు. తీరా పార్టీ లో చేరిన తర్వాతగాని ఎర్రబెల్లికి పరిస్థితి అర్ధం కాలేదు. నేను అక్కడ ఇమడ లేకపోతున్నానంటూ ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నారని తెలిసింది. పబ్లిక్ కార్యక్రమాలకు కూడా ఎర్రబెల్లి దూరంగానే ఉంటున్నారు. కడియం పాల్గొనే కార్యక్రమాలకు ఆయన గైర్హాజరవుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా మౌనంగానే ఉంటున్నారు. పాపం ఎర్రబెల్లికి కాలం కలిసి రాలేదు.

Similar News