అమరావతి నగరంలో నిర్మించబోయే ప్రభుత్వ భవనాలు అత్యున్నతంగా(ఐకానిక్), వాటి ఆకృతులు విలక్షణంగా (యునిక్) వుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. కొత్త రాజధానిలోని ప్రతి కట్టడానికి ఏకరూపత వుండి తీరాలని నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో జరిపిన ప్రత్యేక సమావేశంలో స్పష్టంచేశారు. రాజధానిలోని ప్రభుత్వ భవంతుల సముదాయ నిర్మాణానికి నార్మన్ ఫోస్టర్ సంస్థ నాలుగు రకాల ఆకృతులను రూపొందించి వాటిని ప్రభుత్వానికి అందించింది. ఇది కాన్సెప్ట్ స్థాయి ఆకృతులని, వీటిపై అందరి అభిప్రాయాలను తీసుకుని సవివర కార్య ప్రణాళిక రూపొందిస్తామని, ఆ తరువాత నిర్మాణ ప్రణాళికను అందిస్తామని నార్మన్ ఫోస్టర్ తెలిపారు. మొత్తం ప్రభుత్వ భవనాల సముదాయంలో శాసనసభ, ఉన్నత న్యాయస్థానం భవంతులు కచ్చితంగా అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని, మిగిలిన అన్ని భవంతుల ఆకృతులు విలక్షణంగా వుండాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. రాజధాని కట్టడాల ఆకృతుల రూపకల్పనలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో పాటు స్థానికంగా వుండే గొప్ప అనుభవశీలురైన ఆర్కిటెక్టుల సహాయ సహకారాలు తీసుకోవాలన్నదే తన ఆలోచన అని తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఆస్థానా నగరాన్ని 150 మంది ఆర్కిటెక్టులు రూపొందించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
అత్యుత్తమ నగరాల్లో ఒకటి....
ఏదో ఒక స్థాయి నగరంగా రాజధాని వుండాలని అనుకోవడం లేదని, ప్రపంచంలోని అత్యుత్తమ ఐదు నగరాలలో ఒకటిగా వుండేలా అంతర్జాతీయ నగరాన్ని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. రాజధానిలోని ప్రతి నిర్మాణం, కట్టడంలో తెలుగువారి సంస్కృతి, సంప్రదాయం, చరిత్ర, వారసత్వ సంపద ప్రతిబింబించాలని సూచించారు. దీనిపై ఏర్పాటు చేసిన నిష్ణాతుల కమిటీ దానికి అవసరమైన సూచనలు చేస్తుందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు రాజధానిలోకి ప్రవేశించగానే అది తమ సొంతమనే భావన వ్యక్తమయ్యేలా నిర్మాణంలో అందరి ప్రాతినిధ్యం వుంటుందన్నారు. దేశంలో గొప్ప రాజధానులుగా వున్న గాంధీనగర్, నయారాయపూర్, చండీగర్ నగరాలలో ఒక్కొక్కచోటా ఒక్కొక్క లోపం కనిపిస్తుందని, అమరావతి అలాకాకుండా బ్లూ, గ్రీన్ ఫీల్డ్ సిటీగా, ఆర్ధిక కార్యకలాపాలకు వేదికగా, ప్రజా రాజధానిగా భాసిల్లాలన్నదే తన తాపత్రాయమని చెప్పారు. మన సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపదలను నిలుపుకునే ప్రపంచశ్రేణి నగరంగా, ఎకనామిక్ సిటీగా, పీపుల్ క్యాపిటల్‌గా అమరావతి నిర్మాణం జరుగుతుందని అన్నారు. దీనిపై రాష్ట్రంలోని ప్రజలందరి అభిప్రాయాలను తీసుకోవాలని అనుకుంటున్నామని, దీనికోసం సోషల్ మీడియాను ఉపయోగించుకుంటామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారి సూచనలు, సలహాలు తీసుకునేందుకు త్వరలో ఒక ప్రత్యేక వెబ్ పోర్టల్ రూపొందించాలని ముఖ్యమంత్రి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) కమిషనర్ చెరుకూరి శ్రీధర్‌ను ఆదేశించారు. అలాగే, ఫేస్ బుక్ పేజీ, ట్టిటర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ అకౌంట్లను ప్రారంభించాలని చెప్పారు. నార్మన్ ఫోస్టర్ ఆకృతులను చూపించి అందరి అభిప్రాయాలను తెలుసుకునేందుకు, సూచనలు, సలహాలను పొందేందుకు రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, అన్ని శాఖల అధిపతులతో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయకల్లామ్‌కు సూచించారు.
గ్రామాల అస్థిత్వాన్ని కాపాడాలి...
అభివృద్ధి ప్రవాహంలో కొట్టుకుపోకుండా రాజధాని పరిధిలోని 29 గ్రామాల అస్థిత్వాన్ని ఏదో ఒక రూపంలో నిక్షిప్తం చేసుకోవాలని, దానికోసం ప్రభుత్వం ఒక నిర్ధిష్ట కార్య ప్రణాళికను ఏర్పాటుచేసుకోవాల్సిన అవసరం వున్నదని సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ ముఖ్యమంత్రిని కోరారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి రాజధాని పరిధిలోని కొన్ని గ్రామాలను యథాతధంగా వుంచుతామని ప్రకటించారు. రాజధాని నిర్మాణం పూర్తయినా కూడా ఇవి అలా గ్రామాలుగానే వుంటాయని, వాటి ఆనవాళ్లు దెబ్బతినకుండా కాపాడుకుందామని అన్నారు. చెంగ్డూ, చండీగర్ నగరాలలో కొన్ని పాత గ్రామాలను యథాతథంగా వుంచి వాటికి పర్యాటక ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల ఉనికి కోల్పోకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుందామని చెప్పారు. అలాగే, రాజధానిప్రాంతంలో వున్న చరిత్రాత్మక ఆనవాళ్లు, గురుతులు, శిలాశాసనాలను సంరక్షించుకుందామని తెలిపారు. నార్మన్ ఫోస్టర్ అందించిన కాన్సెప్ట్ స్థాయి ఆకృతులలో శాసనసభ, ఉన్నత న్యాయస్థానం, రాజ్‌భవన్, సచివాలయం భవంతులకు ఏవిధంగా రూపకల్పన జరిపారో పురపాలక మంత్రి పి. నారాయణ ముఖ్యమంత్రికి సవివరంగా తెలియజేశారు. అంతకు ముందు ముఖ్యమంత్రి తన కార్యాలయంలో నార్మన్ ప్రతినిధులు ఏర్పాటుచేసిన కాన్సెప్షనల్ ప్లాన్స్ నమూనా ఆకృతులను తిలకించారు. 900 ఎకరాలలో ప్రభుత్వ భవంతుల సముదాయ నిర్మాణానికి సంబంధించి నార్మన్ ఫోస్టర్ రూపొందించి ఇచ్చిన నాలుగు నమూనా ఆకృతులను నిశితంగా పరిశీలించారు. పుత్రజయ, ఆస్థానా, వాషింగ్టన్ డీసీ, లండన్, బ్రెసీలియా, న్యూఢిల్లీ తదితర నగరాలను పరిశీలించి వాటిల్లో ఉత్తమమైన అంశాలను తీసుకుని ఈ ఆకృతులను ప్రాథమికంగా రూపొందించామని నార్మన్ ఫోస్టర్ తెలిపారు. రచ్చబండలు, గ్రామాల్లోని పురాతన ఆలయాలు, ఉండవల్లి తదితర చారిత్రక ఆనవాళ్లు, ఇంకా, ఆంధ్రప్రదేశ్‌లో స్థానికంగా వుండే కొన్ని అంశాలను పరిశీలనకు తీసుకున్నామని చెప్పారు. రాజధాని ప్రాంతంలో ఉష్ణోగ్రతలను తగ్గించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో, నగర నిర్మాణంలో ఏతరహా విధానాలను అనుసరించాలో ప్రపంచంలో వున్న అన్ని అత్యుత్తమ విధానాలను తెలుసుకుని వాటిని అనుసరించాలని ముఖ్యమంత్రి సూచించారు. తరువాత జరిగిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సమావేశంలో కొండవీటివాగు ప్రణాళికలపై ముఖ్యమంత్రి జలవనరులశాఖ అధికారులతో చర్చించారు.