ఏపీ సర్కార్ కు షాక్

Update: 2017-01-06 05:40 GMT

వేల కోట్ల రుపాయల వ్యయం...., లక్షల మంది లబ్దిదారులు..... కాని అర్హుల జాబితా అమాంతం పెరిగిపోతోంది.....సంతృప్త స్థాయికి సంక్షేమ పథకాలను చేరవేయాలన్న ప్రభుత్వ ఆలోచన కొంప ముంచుతోంది. కొత్త రేషన్‌ కార్డులు., ఇతర పింఛన్ల కోసం వందలు..వేలల్లో కాదు..... లక్షల్లో కొత్తగా వస్తున్న దరఖాస్తుల్ని చూసి ప్రభుత్వం తలలు పట్టుకుంటుంది. 2016 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో 43 లక్షల వృద్ధాప్య., వితంతు, వికలాంగుల ఫించన్లతో పాటు సామాజిక భద్రత కార్డులు ఉన్నాయి. తాజాగా జనవరి 2 నుంచి ప్రారంభించిన జన్మభూమి కార్యక్రమంలో కొత్త కార్డుల పంపిణీ ప్రారంభించింది. ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన 8.5 లక్షల రేషన్‌ కార్డుల్లో దాదాపు మూడున్నర లక్షల కార్డులు అనర్హులవేనని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అక్రమాలకు అడ్డుకట్ట వేశామని జబ్బలు చరుచుకుంటున్నా లొగుట్టు తెలిసి సర్కారు షాక్‌కు గురవుతోంది. చంద్రన్న క్రిస్మస్‌., సంక్రాంతి కానుకల రూపేణా దాదాపు 450 కోట్లను అదనంగా ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. వీటికి తోడు నెలవారీ రేషన్‌పై భారీగా ఖర్చు చేస్తోంది. అక్రమాలను నియంత్రించేందుకు ఈ పోస్‌ యంత్రాలు., ఆధార్‌ ఆధారిత సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినా అక్రమార్కులు కొత్త కొత్త మార్గాలు కనిపెడుతున్నారు.

గొప్పలు...మాటల వరకే...

డిజిటల్ చెల్లింపుల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని సర్కారు గొప్పలు చెప్పుకుంటున్నా., ఆచరణలో మాత్రం లోపాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పౌరసరఫరాల శాఖ., గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ., గ్రామీణాభివృద్ధి శాఖల అంచనాలను మించి కొత్తగా కుటుంబాలు ఏర్పడటం., వృద్ధాప్య పింఛను అర్హుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. క్షేత్ర స్థాయిలో పైరవీలతో పాటు అవినీతి., అధికార పక్షం అండదండల కారణంగానే ఈ అవినీతి జరుగుతోందని ప్రభుత్వం గుర్తించింది.

అక్రమాలు జరుగుతున్నాయిలా....

ఆధార్......అన్ని సమస్యలకు పరిష్కారం అంటూ ఊదరగొట్టిన వాళ్లే ఇప్పుడు అదే అసలు సమస్య అని గుర్తించారు. ఆధార్‌ కార్డులో మార్పులు చేర్పులు ఎవరైనా ఎప్పుడైనా ఇంటర్నెట్ ద్వారా చేసుకునే సౌలభ్యం కల్పించడంతో అక్రమాలు ఊపందుకున్నాయి. వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసు 60 ఏళ్ళు కావడంతో 50 దాటిన వాళ్ళలో చాలామంది వయసు మార్చుకుని కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీటిలో ఎక్కువగా పాలక పార్టీ సిఫార్సుల ద్వారానే జరిగాయి. వీటికి అడ్డుకట్ట వేయడానికి సాంకేతిక సంస్కరణలు అవసరం. గ్రామ కమిటీలు తమకు నచ్చిన వాళ్లతో ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. లోపాలు లేకుండా సంక్షేమ ఫలాలను అర్హులకు అందేలా పకడ్బందీ చర్యలు అవసరమని., అయితే ఆధార్‌పై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రానిది కావడంతో సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని ఏపీ సర్కారు భావిస్తోంది.

Similar News