ఏపీ సర్కార్ పై జపాన్ సంస్థ ఫిర్యాదు

Update: 2017-01-27 12:50 GMT

అమరావతి నిర్మాణ బాధ్యతల నుంచి మాకీ సంస్థను తప్పిస్తూ ఏక పక్షంగా నిర్ణయించడాన్ని తప్పు పడుతూ జపాన్‌కు చెందిన మాకీ అండ్‌ అసోసియేట్స్‌ భారత ఆర్కిటెక్చర్‌ సమాఖ్యకు ఫిర్యాదు చేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై విచారణ జరపాలని భారతీయ సమాచార హక్కు చట్ట ప్రకారం వివరాలు సేకరించాలని భారత అర్కిటెక్ట్ సమాఖ్యకు మాకీ అసోసియేట్స్‌ అధ్యక్షుడు ఫిర్యాదు చేశారు. భారతీయ ఆర్కిటెక్ట్‌ల వృత్తి నైపుణ్యాన్ని మసకబార్చేలా ఏపీ సిఆర్‌డిఏ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక అసలు కారణాలు బయటకు రావాలని మాకీ సంస్థ భారత ఆర్కిటెక్చర్‌ సమాఖ్య ఉపాధ్యాక్షుడు విజయ్‌ గార్గ్‌ రాసిన లేఖలో విజ్ఞప్తి చేసింది. మాకీ సంస్థను తొలగించి మరొక సంస్థను రాజధాని ఆర్కిటెక్ట్‌గా నియమించడంలో దాగిన రహస్యాలెంటో బయటపెట్టాలని మాకీ సంస్థ డిమాండ్‌ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణంలో అక్కడి ప్రజలకు ఉత్తమ నమూనాలు అందాల్సి ఉందని., అవి రాజకీయ అకాంక్షలకో., వ్యక్తిగత అభిరుచులకో అనుగుణంగా ఉండకూడదని మాకీ ఘాటుగా విమర్శించింది. 2015 డిసెంబర్‌ 12 ఏపీ ప్రభుత్వ ఆహ్వానం మేరకు రాజధాని కాంప్లెక్స్‌ నిర్మాణ పోటీలో పాల్గొన్నామని., 2016 మార్చి 25న అంతర్జాతీయ స్థాయి ఎంపికలో తాము గెలిచినట్లు ప్రకటించారని మాకీ సంస్థ తెలిపింది. ఈ విషయాన్ని భారతీయ., అంతర్జాతీయ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారని., తమ డిజైన్లు అద్భుతంగా ఉన్నాయంటూ భారతీయ పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయని., అయితే ఏడు నెలల తర్వాత పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయని తెలిపారు.

రహస్యాన్ని బయటపెట్టాలంటున్న మాకీ.....

అమరావతి కాంప్లెక్స్‌ కాంపిటీషన్‌ విషయంలో తమకు జరిగిన అనుభవాలను మాకీ సంస్థ భారతీయ ఆర్కిటెక్ట్ సమాఖ్యకు సుదీర్ఘంగా వివరించింది. రాజధాని నిర్మాణ బాధ్యతలు., డిజైన్ల రూపకల్పన విషయంలో జరిగిన పోటీ పూర్తి పారదర్శకంగా జరిగిందని., ఆ తర్వాత జరిగిన పరిణమాలనే విచారించాలని మాకీ డిమాండ్ చేసింది. తమను రాజధాని నిర్మాణ బాధ్యతల నుంచి తప్పించడం వెనుక కుట్ర ఉందని., ఇది అంతర్జాతీయ ప్రమాణాలకు విరుద్ధంగా జరిగిందని., డిజైన్ల రూపకల్పన సమయంలో చెప్పిన తమతో చేసుకున్న ఒప్పంద నిబంధనలకు విరుద్ధంగా కూడా ఉందని మాకీ సంస్థ ఆరోపించింది. మార్చి 7న తమను ఎంపిక చేసినట్లు సిఆర్‌డిఏ ప్రకటించిన తర్వాత కాంట్రాక్టు చేసుకునేందుకు పలుమార్లు లేఖలు రాసినా సిఆర్‌డిఏ స్పందించలేదని మాకీ ఆరోపించింది. 2015 మే 15న ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాకీ బృందం చర్చలు జరిపిందని., తమ డిజైన్లపై చంద్రబాబు సూచించిన సలహాల మేరకు మార్చి సిద్దం చేశామని., అయినా వాటిని ముఖ్యమంత్రి., ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పట్టించుకోలేదని మాకీ ఆరోపించారు. సవరించిన డిజైన్లను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ప్రింటెడ్‌ డాక్యుమెంట్లుగా పంపినా ప్రభుత్వం ఒక్కసారి కూడా స్పందించలేదని మాకీ ఆరోపించారు. అదే సమయంలో రాజధాని కాంప్లెక్స్ భవనాల ఎంపికపై ప్రభుత్వం నియమించిన ప్రొఫెసర్ రవి ఆనంద్‌ను కూడా తమ బృందం కలిసిందని., ఆయన కూడా ప్రభుత్వ ఉద్దేశాలను నర్మగర్భంగా చెప్పారని ఆరోపించింది. 2016 జులై 8 టోక్యో వెళ్ళిన ముగ్గురు అధికారులు హఫీజ్‌ కాంట్రాక్టర్‌ సంస్థతో కలిసి పనిచేయాలని తమపై ఒత్తిడి చేశారని మాకీ ఆరోపించారు. అయితే తమ డిజైన్లను ప్రభుత్వం గుర్తించిన ఆర్కిటెక్చర్‌ సంస్థలన్నింటికి చూపేందుకు వీలు కల్పించాలని కోరినట్లు మాకీ వివరించారు. అందుకు ఏపీ అధికారులు అమోదించారని అన్నారు. 2016 అక్టోబర్ 24న డిజైనింగ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ ఏపీసిఆర్‌డిఏ లేఖ రాసిందని ., అందులో డిజైన్‌పై ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందని., సహేతుకం కాని సేవా రుసుములు., మానవ వనరుల్లో మార్పులు., నిర్ణీత కాల వ్యవధిలో ప్రాజెక్టును పూర్తి చేయలేకపోవడం వంటి అంశాలను సాకుగా చూపడం అవాస్తవాలని ఆరోపించింది.

మాకీని తప్పించడం కుట్రా?

రాజధాని నిర్మాణానికి సంబంధిం ఆర్కిటెక్చర్‌ను ఎంపిక చేయడం ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన సంస్థల మధ్య డిజైన్లలో ఉత్తమంగా నిలిచిందంటూ మాకీను ఎంపిక చేస్తున్నట్లు అర్భాటంగా ప్రకటించారు. ఇందుకోసం దేశ విదేశాలకు చెందిన ఆరుగురు నిపుణుల బృందం మూడు ఆర్కిటెక్ట్ సంస్థలు రూపొందించిన డిజైన్లను పరిశీలించి చివరకు మాకీ డిజైన్‌ను ఫైనల్ చేశారు. ఈ పోటీలో అమెరికాకు చెందిన రోగర్ స్ట్రిక్ హార్బర్ అండ్‌ పార్టనర్స్‌., భారత్‌కు చెందిన వాస్తు శిల్పి., జపాన్‌కు చెందిన మాకీ అండ్‌ అసోసియేట్స్‌ పాల్గొన్నాయి. ఈ మూడు సంస్థలు రూపొందించిన డిజైన్లలో మాకీ డిజైన్లు బాగున్నాయంటూ ప్రభుత్వం ప్రచారాల్లో ఊదర గొట్టింది. డిజైన్లపై ప్రజా వ్యతిరేకత విమర్శల నేపథ్యంలో డిజైన్‌లకు మార్పులు చేసే విషయంలో తమకు ఎలాంటి సమయం ఇవ్వలేదని మాకీ ఆరోపించింది. ఫోస్టర్ అండ్‌ పార్టనర్స్‌., హఫీజ్‌ కాంట్రాక్టర్‌ సంస్థను పోటీ ప్రక్రియలో విజేతగా డిసెంబర్‌లో ప్రకటించడం వెనుక కూడా కుట్ర ఉందని మాకీ ఆరోపించింది. ఈ సంస్థలు తయారు చేసిన డిజైన్ల ఫోటోలు కూడా ఇంతవరకు వెలుగుచూడలేదని., డిజైన్ల రూపకల్పనకు చెల్లిస్తున్న మొత్తాన్ని కూడా వెల్లడించలేదని., ఎంతమంది సిబ్బందిని కేటాయిస్తున్నారో కూడా తెలియదని మాకీ సంస్థ ఆరోపించింది. ప్రజాధనంతో చేపట్టే ఇలాంటి కార్యక్రమాల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎందుకు రహస్యంగా వ్యవహరిస్తుందో తెలియాల్సిన అవసరం ఉందని మాకీ డిమాండ్‌ చేసింది. ఏపీ ప్రభుత్వ అనైతికమైన వ్యవహార శైలి వల్ల భవిష్యత్తులో ఆర్కిటెక్చర్‌ సంస్థల మధ్య అపోహలు ఏర్పడే ప్రమాదం ఉందని దీనిని వెంటనే పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంలో భారతీయ ఆర్కిటెక్చర్ సమాఖ్య భారతీయ పౌరులకు మాత్రమే అందుబాటులో ఉన్న సమాచార హక్కు చట్టం ద్వారా వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని., దీనిపై విచారణ జరపాలని కోరింది. అంతర్జాతీయ పరిశ్రమల్ని ఆంధ్రప్రదేశ్‌కు ఆహ్వానిస్తున్న వేళ జపాన్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ముఖ్యమంత్రిపైనే ఏకంగా విమర్శలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఏపీ సర్కారు తీరుపై దర్యాప్తు జరపాలని భారత ఆర్కిటెక్చర్‌ సమాఖ్య కూడా నిర్ణయించింది. ఆర్కిటెక్చర్‌ సంస్థల మధ్య అనైతిక పోటీకి అడ్డుకట్ట వేయాలని సమాఖ్య నిర్ణయించుకుంది.

Similar News