కామ్రేడ్లు కనుమరుగవుతున్నారా?

Update: 2016-12-20 09:00 GMT

వామపక్షాలు జనానికి దూరమవుతున్నాయా? కామ్రేడ్లు కనుమరుగవుతున్నారా? లెఫ్ట్ పార్టీల మనుగడ భవిష్యత్తులో కష్టమేనా?ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో నష్టపోయిన లెఫ్ట్ పార్టీలు కాస్తో....కూస్తో క్యాడర్ ఉన్న తెలుగు రాష్ట్రాల్లోనూ కన్పించకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. పెరుగుతున్న ఆధునికత.... సాంకేతికతతో పాటు అక్షరాస్యత పెరుగుదల...తో వామపక్ష భావజాలాన్ని అంగీకరించేవారు తగ్గుముఖం పడుతుండటంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నది ఓ కారణంగా చెప్పవచ్చు.

కంచుకోటకు...బీటలు...

ఒకప్పడు ఉమ్మడి రాష్ట్రంలో వామపక్షాల హవా కొనసాగేది. పుచ్చలపల్లి సుందరయ్య లాంటి నేతలు లెఫ్ట్ పార్టీలను పేదలు, బడుగుల ముంగిటకు తీసుకెళ్లారు. లెఫ్ట అంటేనే సామన్యుడి గొంతుక అన్న రీతిలో పోరాటాలు చేశారు. అందుకే ఎన్నికల్లో వామపక్షాలు ...పార్టీల గెలుపు, ఓటములను నిర్ణయించే శక్తిగా మారాయి. వామపక్షాల మద్దతు ఉంటే గెలుపుఖాయమని అప్పట్లో ఆ పార్టీల గడప తొక్కని నేత లేడన్నది నిజం. ఇక బెజవాడ కమ్యునిస్టులకు కంచుకోటగా ఉండేది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ను కైవసం చేసుకున్నాయి వామపక్ష పార్టీలు. అటువంటి లెఫ్ట్ పార్టీలు ఇప్పడు స్వీయ రక్షణ కోసం అనేకపాట్లు పడుతున్నాయి.

పొత్తులతోనే....ఈ పరిస్థితి

ఎరుపు చొక్కాలకు అనేక రంగులు పులిమాయి. పార్టీ జెండాలపై అనేక గుర్తులను ముద్రించారు. వామపక్ష పార్టీలు ఒకసారి కాంగ్రెస్ తోనూ, మరొకసారి తెలుగుదేశంతోనూ పొత్తు పెట్టుకుని మరీ ఎన్నికల్లో పోటీ చేశాయి. బీజేపీయేతర పార్టీలెవరితోనైనా తమకు పొత్తు సమ్మతమేనని ఎన్నికల ముందు అవి గేట్లు బార్లా తెరిచాయి. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని దానికి అధికారాన్ని అప్పగించాయి. తర్వాత కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని సర్కారు ఏర్పాటయ్యేందుకు తోడ్పడ్డాయి. ఇలా రెండు దశాబ్దాల నుంచి పొత్తుల మధ్యనే వామపక్షాలు మనుగడ సాగించాయి. దీనివల్ల క్యాడర్ లో ఓ నైరాశ్యత అలుముకుంది. వామపక్షాలు మద్దతిచ్చిన పార్టీ అధికారంలోకి రాగానే ప్రజా సమస్యలను పక్కన బెట్టేస్తు్న్నాయి. ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను గాలికి వదిలేస్తున్నాయి. దీంతో అధికార పార్టీ మకిలి మద్దతిచ్చినందుకు సహజంగానే లెఫ్ట్ పార్టీలకూ అంటుకుంటుంది.

క్యాడర్ ఎక్కడ?

లెఫ్ట్ పార్టీలకు ఒకప్పడు క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉండేది. గ్రామగ్రామాన సుశిక్షుతులైన కార్యకర్తలు పార్టీకి అండగా ఉండేవారు.రాష్ట్ర రాజధానిలో పార్టీ అగ్రనేతలు పిలుపునిస్తే పల్లెలవరకూ ఆందోళన వ్యాపించేది. అయితే ఇప్పడు సీన్ మారింది. వామపక్షాల నిరసనలు టీవీల వరకే పరిమితమయ్యాయి. పదుల సంఖ్యలో కార్యకర్తలు టీవీ మైకుల ముందు చేస్తున్న డిమాండ్డు తప్ప మరేదీ కన్పించడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలకు పార్టీ కార్యదర్శులను నియమించింది. రెండు రాష్ట్రాల్లో సీపీఐ, సీపీఎం నేతల హడావిడి అప్పడప్పుడు కన్పిస్తున్నా... వారికి గ్రామస్థాయిలో మద్దతు దొరకడం లేదన్నది స్పష్టమవుతోంది. తెలంగాణలో మాత్రం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మహాజన పాదయాత్ర చేస్తున్నారు. కొంత పార్టీని బలోపేతం చేయాలన్నలక్ష్యంతో ఆయన ఆ పనికి పూనుకున్నారు. కాని ఈ యాత్రకు వస్తున్న స్పందన కూడా అంతంత మాత్రమే. క్యాడర్ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో వామపక్షాలకు సొంతకాళ్ల మీద నిలబడే శక్తి లేదు. ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదు. ఏదో ఒక పార్టీ కి గొడుగు పట్టాల్సింది. ఎవరో ఒకరి పంచన చేరాల్సిందే. ఏపీలో ఒక్క కమ్యునిస్టు పార్టీ ఎమ్మెల్యే లేరు. తెలంగణాలో మాత్రం సీపీఐకి ఒకరు, సీపీఎం తరుపున ఒకరు గెలిచారు. దీన్ని బట్టి చూస్తే కమ్యునిస్టుల సిద్ధాంతాలు ఈ తరానికి రుచిస్తున్నట్లు లేవు. అభివృద్ధికి వామపక్షాలు సహకరించరనే విమర్శ ఉంది. ప్రజాసమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్నకామ్రేడ్లు పార్టీకి బలం ఎలా పెంచుకుంటారన్నదే ఇప్పడు ప్రశ్న.

కొసమెరుపు:ఎర్రసైన్యం ఎప్పుడు ఎవరి పంచన చేరుతుందో తెలియదు. ప్రస్తుతం ఏపీ కమ్యునిస్టులు మాత్రం జనసేనానికి దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. మరి జనసేనను ఏంచేస్తారో కామ్రేడ్లు.

Similar News