కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ప్రత్యేకించి ముస్లిముల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రకటించారు. అమలు చేస్తున్నారు. పేద కుటుంబాల్లో అమ్మాయిలకు పెళ్లిళ్లు ప్రభుత్వమే చేయించడం దగ్గరినుంచి రకరకాల కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా అచ్చంగా కేసీఆర్ ముద్రతోనే నడుస్తున్నాయి. మరో కోణంలోంచి చూసినప్పుడు సహజంగానే గొప్ప వక్త అయిన కేసీఆర్ ఆంధ్రాంగ్ల ఉర్దూ భాషల మీద సమానమైన అధికారం ఉంది. ఆయన గనుక ముస్లిం వాడల్లో ప్రసంగించారంటే.. అంతటి తుల్యమైన ఉర్దూలో.. ఆ భాషలోని సామెతలు నుడికారాలు వాడుతూ అలవోకగా మాట్లాడుతారు. ఇన్ని రకాల ఎడ్వాంటేజీలు ఉన్నప్పుడు ముస్లిముల్లో తనకంటూ సొంత ఆదరణ ఏర్పడుతుంది అనే భావన కేసీఆర్ కు కలగాలి కదా? ముస్లిం ఓట్లు పొందాలంటే.. లేదా, ముస్లింల వ్యతిరేకత చవిచూడకుండా ఉండాలంటే.. ఎవరైనా ఎంఐఎం తాళానికి తగ్గట్లుగా ఆడాల్సిందేనా? కేసీఆర్ లో ఇంకా ముస్లిం లంటే ఫోబియా ఉందా అనే అనుమానం కలుగుతోంది.
తను ఉద్యమనాయకుడిగా ఉన్నప్పుడు డిమాండ్ చేసిన నినాదాలను అధికారంలోకి రాగానే ఆయన చాలా కన్వీనియెంట్ గా మరచిపోయారు. సెప్టెంబరు 17న అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలనే డిమాండ్ ను పక్కన పెట్టేశారు. నిజాం ప్రభువు మీద మక్కువతో వెర్రెత్తి ఉన్న ఒక వర్గం ముస్లింల ప్రాపకం కోసం ఆయన ఆరాటపడుతున్నారని అలాంటి సందర్భాల్లో జనం సరిపెట్టుకున్నారు.
జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం మద్దతుతో గద్దె ఎక్కవలసిన పరిస్థితి వస్తుందనే ఉద్దేశంతో కేసీఆర్ వారికి అనుకూలంగా ఉన్నారని అంతా భావించారు. జీహెచ్ఎంసీలో నగర పౌరులు గులాబీ పార్టీని తిరుగులేని స్థాయిలో నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పటికీ ఆయన ఎంఐఎంకు భయపడుతూనే ఉన్నారా అనే సందేహం మాత్రం మిగిలిపోయింది.
ఎందుకంటే.. సర్దార్ వల్లభాయ్ పటేల్ ను జాతీయ దినోత్సవంగా కేంద్రం ప్రకటించిన తర్వాత.. తెలంగాణకు పటేల్ నాయకత్వ పటిమతో ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్నప్పటికీ కూడా.. ఆ జాతీయ దినోత్సవాన్ని నామమాత్రంగా కూడా అధికారికంగా నిర్వహించకపోవడం అనేది విమర్శల పాలవుతోంది. భాజపా శ్రేణులు దీన్ని చాలా సీరియస్ గానే తీసుకుంటున్నాయి. కేంద్రం వద్దకు బోలెడు పథకాలకు కేంద్రమంత్రి దత్తన్న ను దూతగా వాడుకుంటూ ఉండే కేసీఆర్, వారి విమర్శలకే గురికావడం హితకరం కాదు.
ఇలాంటి పనుల వల్ల ముస్లిం ఓటు బ్యాంకు తన పరం అయిపోతుందని ఆయన అనుకుంటారేమో.. అయితే.. నిజానికి, ఇవి ఉద్యమ నాయకుడు, పోరాట యోధుడుగా గుర్తింపు ఉన్న కేసీఆర్ ధైర్య స్థైర్యాల మీద ప్రజల్లో అభిప్రాయాల్ని మారుస్తాయిన ఆయన అర్థం చేసుకోవాలి.