తమిళనాడు పాలిటిక్స్ రసకందాయంలో పడ్డాయి. అధికార అన్నా డీఎంకే, ప్రతిపక్ష డీఎంకె పార్టీలు స్వీయ రచనలో మునిగిపోయి ఉన్నాయి. అధికార అన్నాడీఎంకే కి జయ మరణం తర్వాత ప్రధాన కార్యదర్శి లేరు. ప్రధాన కార్యదర్శి గా శశికళను ఎన్నుకోవాలని పార్టీ నేతలు ఇప్పటికే నిర్ణయించారు. అయితే పార్టీలో ఐదేళ్ల సభ్యత్వం ఉండాలన్న నిబంధన శశికళ నియామకానికి అడ్డువచ్చేలా ఉంది. ఈ నిబంధనను సడలించేందుకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 29వ తేదీన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అన్నీ అనుకూలంగా జరిగితే చిన్నమ్మకు ప్రధాన కార్యదర్శి పదవి దక్కే అవకాశాలున్నాయి. కాకుంటే పన్నీరు వర్గం ఏం చేస్తుందోనన్న ఉత్కంఠ శశికళ వర్గంలో ఉంది.
పన్నీరు సెల్వానికి, శశికళకు మధ్య బాగా గ్యాప్ వచ్చిందన్నది అన్నా డీఎంకే వర్గాల కథనం. శశికళతో ఇటీవల 11 మంది యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్లు పోయెస్ గార్డెన్ లో భేటీ అవ్వడాన్ని సీఎం అనుకూలురు ఇష్టపడటం లేదు. దీంతో గవర్నర్ ద్వారా విద్యాశాఖకు దీనిపై నోటీసులు ఇప్పించారని సమాచారం. గవర్నర్ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అత్యున్నతస్థాయి పదవుల్లో ఉండే వ్యక్తులు....అదీ అత్యున్నత విద్యనందించాల్సిన వీసీలు సంబంధంలేని వ్యక్తిని కలవడాన్ని ఆయన తీవ్రమైన అంశంగా కూడా పరిగణిస్తున్నారు. అందుకే తొలుత విద్యాశాఖకు నోటీసులు జారీ చేసినట్లుచెబుతున్నారు. విపక్ష నేత స్టాలిన్ కూడా వీసీలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తమిళనాట దుమారాన్నే రేపింది. అంతేకాకుండా జయలలిత ఉన్నప్పుడు పోయెస్ గార్డెన్ వద్ద జడ్ ప్లస్ భద్రత ఉండేది. హై సెక్యూరిటీ జోన్ గా పోయెస్ గార్డెన్ ను పరిగణించేవారు. అయితే తాజాగా పోయెస్ గార్డెన్ నుంచి సెక్యూరిటీని పూర్తిగా తొలగించారు. ఇది పన్నీరు పనేనన్నది చిన్నమ్మ అనుమానిస్తున్నారు. దీంతో వీరిరువరి మధ్య కొంత వివాదమైతే నడుస్తోంది.
దాదాపు 17 రోజుల పాటు పన్నీరు సెల్వం చిన్నమ్మను కలవనే లేదు. అయితే తాజాగా ఆదివారం శశికళ వద్దకు సీఎం పన్నీరుసెల్వం వెళ్లి పది నిమిషాలు మాట్లాడి వచ్చారని....ఇరువురి మధ్య కొంత రాజీ కుదిరిందని చెబుతున్నారు. పన్నీరు సెల్వం తక్కువవాడేమీ కాదు. అన్నీ ఆరితేరిన....రాజకీయాలు వంటబట్టిన వ్యక్తి. అమ్మ ఉండగా ....అణకువగా ఉన్నాడే కాని ఇప్పడు తన ప్రతాపాన్ని పన్నీరు ప్రదర్శిస్తున్నారని చెబుతున్నారు. రామ్మోహనరావు ఇంటిపై ఐటీ దాడులు చేయడంతో వెంటనే తనకు అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమై రామ్మోహనరావును సీఎస్ పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో గిరిజా వైద్య నారాయణన్ ను నియమించారు. తొలగింపు, నియామకాల్లో పన్నీరు సొంత నిర్ణయమే తీసుకున్నట్లు చెబుతున్నారు. చిన్నమ్మకు కనీసం సూచనప్రాయంగా కూడా తెలపలేదట. దీంతో అన్నాడీఎంకే చీలిక దిశగా పయనిస్తుందన్న వార్తలు తమిళనాట గుప్పు మంటున్నాయి. అయితే ఈ నెల 29 వ తేదీన జరగనున్న పార్టీ సర్వసభ్య సమావేశంలో చిన్నమ్మ ఫ్యూచర్ తేలిపోనుంది.
పార్టీ పదవికి కనిమొళి...
మరోవైపు డీఎంకే, జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. ఆచితూచి వ్యవహరిస్తుంది. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ఆరోగ్యం బాగా లేకపోవడంతో పార్టీ పగ్గాలు స్టాలిన్ కు అప్పగించనున్నారు. ఇది మామూలుగా జరిగే విషయమే. డీఎంకే సర్వసభ్య సమావేశం ఈనెల 20వ తేదీనే జరగాల్సి ఉంది. కాని కరుణ ఆరోగ్యం బాగాలేకపోవడంతో వాయిదా వేశారు. తాజాగా అన్నాడీఎంకే సమావేశం తర్వాత జరపాలని స్టాలిన్ నిర్ణయించుకున్నారు. జనవరి 4వ తేదీన డీఎంకే సర్వసభ్య సమావేశం జరగనుంది. అంటే అన్నాడీఎంకే సమావేశం తర్వాత తాము సమావేశమవ్వడానికి డీఎంకే నిర్ణయించుకుంది. ఆ పార్టీలో పరిస్థితులను బట్టి వాటిపై చర్చించి డీఎంకే నేతలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలిసింది. ముఖ్యంగా పార్టీలో కనిమొళికి కీలక పదవి దక్కే అవకాశముందని చెబుతున్నారు. మొత్తం మీద జయ మరణం తర్వాత తమిళ రాజకీయాలు హీటెక్కాయి.