ప్రజా యుద్ధనౌక గద్దర్ నేతృత్వంలో కొత్త పార్టీ తెలంగాణలో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పార్టీ పేరును ఇప్పటికే ఖరారు చేశారు. ‘త్యాగాల తెలంగాణ’ అని నామకరణం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన గద్దర్ కొత్త పార్టీని ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే క్షేత్రస్థాయిలో వర్క్ జరుగుతుందని చెబుతున్నారు. జిల్లాల వారీగా అభిప్రాయాలను సేకరించిన తర్వాతనే పార్టీని ప్రకటిస్తారట ప్రజాగాయకుడు గద్దర్.
గద్దర్ అందుకే దూరంగా ఉన్నారా?
గద్దర్...ఈ పేరు తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. తెలంగాణ ఆవిర్భవించకముందు ఉమ్మడి రాష్ట్రంలో నిత్యం వార్తల్లో ఉండేవారు. ప్రజాసమస్యలపై పోరాడేవారు. తెలంగాణ ఉద్యమసమయంలోనూ గద్దర్ ప్రత్యేక పాత్రను పోషించారు. గద్దర్ ఆలపించిన ఆరుకోట్ల ప్రాణమా... పోరు తెలంగాణమా.. పాటతో యువత ఉర్రూతలూగింది. ఉద్యమాల్లోకి చొచ్చుకువచ్చేలా చేసింది ఆ పాట. అలాంటి విప్లవ గాయకుడు గద్దర్ తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత కన్పించడం మానేశారు. చాలా రోజుల నుంచి ప్రజా ఉద్యమాలకూ దూరంగానే ఉంటున్నారు. అయితే ఇన్నాళ్లూ ఇక గద్దర్ ఉద్యమాలకూ దూరంగా ఎందుకున్నారనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరుకుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమస్యలే తెలంగాణ ఆవిర్భవించన తర్వాత కూడా ఉండటం....బంగారు తెలంగాణను సాధించుకోవాలంటే తృతీయ రాజకీయ పార్టీ అవసరమని ఆయన భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గద్దర్ కు తెలంగాణ సమస్యలపై పూర్తి స్థాయి అవగాహన ఉంది. ప్రతి జిల్లాపై ఆయనకు పట్టుంది. గ్రామ స్థాయిలో నేటికీ ఆయనను అభిమానించే వాళ్లున్నారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీకి గాని గద్దర్ పార్టీపై స్పష్టత వచ్చే అవకాశం లేదంటున్నారు. జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ తో కలిసి వెళతారా? లేక తను వేరు దారిలో వెళతారా? అన్నది తేలాల్సి ఉంది.