పవన్ ఫ్యాన్స్ ఈ వార్త విని తట్టుకోగలరా?

Update: 2017-01-24 12:02 GMT

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు లక్షలాది మంది అభిమానులు. ఆయన చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. పవన్ స్క్రీన్ పై కన్పిస్తే చాలు అని మురిసిపోయే అభిమానులకు ఓ చేదువార్త. పవన్ సినిమాలు కొంచెం లేట్ అయ్యే పరిస్థితి కన్పిస్తోంది. ప్రస్తుతం ఆయన కాటమ రాయుడు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తర్వాత ఆయన త్రివిక్రమ్ సినిమాకు కమిట్ అయ్యారు. ఆ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. అయితే తాజా రాజకీయ పరిణామాలు పవన్ కల్యాణ్ సినిమాలపై ప్రభావం చూపేలా కన్పిస్తున్నాయి.

త్రివిక్రమ్ సినిమా జాప్యం....

పవర్ స్టార్ వపన్ కల్యాణ్ సినీ హీరో మాత్రమే కాదు. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా. జనసేన పార్టీని స్థాపించి ఆయన ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉండటంతో కొన్ని సినిమాలు చేయవచ్చని భావించిన పవర్ స్టార్ రెండు సినిమాలకు ఒప్పేసుకున్నారు. ఇందులో కాటమరాయుడు షూటింగ్ శరవేగంతో జరుగుతోంది. తన సన్నిహితుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రంలో నటించేందుకు పవన్ ఓకే చెప్పేశారు. దీనికి సంబంధించి ఒప్పందాలు కూడా పూర్తయ్యాయి. కాటమరాయుడు షూటింగ్ వెళ్లగానే...త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళుతుందని భావించారు. కాని ఇప్పుడా పరిస్థితి లేదు. కాటమరాయుడు మాత్రం షూటింగ్ పూర్తి చేసి అనుకున్న సమాయానికే సినిమా రిలీజ్ చేయాలని పవన్ భావిస్తున్నారు. త్రివిక్రమ్ సినిమా మాత్రం షూటింగ్ ఇప్పట్లో ప్రారంభమయ్యేలా కన్పించడం లేదు. పవన్ కూడా ఏపీలో వేడి కొంచెం తగ్గాక...చూద్దామని త్రివిక్రమ్ తో చెప్పినట్లు సమాచారం.

ప్రజాసమస్యలపై బిజీ...బిజీ..

ఏపీలో ప్రత్యేక హోదా కోసం ఉద్యమం ఊపందుకుంటోంది. ఈ నెల 26వ తేదీన ఉద్యమానికి విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద విద్యార్థులు శ్రీకారం చుట్టనున్నారు. దీనికి వపన్ ఇప్పటికే మద్దతు తెలిపారు. రోజుకు రెండు, మూడు ట్వీట్లతో పవన్ ఉద్యమానికి ఊపు నిస్తున్నారు. వీలుంటే 26వ తేదీన విశాఖకు వెళ్లాలని కూడా పవన్ నిర్ణయించుకున్నారట. ఉద్యమం తీవ్ర స్థాయిలోకి వెళితే పవన్ కూడా నేరుగా రంగంలోకి దిగాలని భావిస్తున్నారట. మరోవైపు ఏపీ నుంచి సమస్యల మీద సమస్యలు పవన్ దృష్టికి తెస్తున్నారు బాధితులు. అండగా నిలుస్తానని వారికి హామీ ఇస్తున్నారు. ఎన్నికలకు రెండున్నరేళ్లు సమయం ఉన్నా....ప్రజల పక్షాన నిలబడాలంటే కొత్త సినిమాకు గ్యాప్ ఇవ్వాలని పవన్ నిర్ణయించుకున్నట్లు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. సో...పవన్ ఫ్యాన్స్ కు కాటమ రాయుడు సినిమా తర్వాత కొంత గ్యాప్ తప్పేట్లు లేదు. ఇది ఖచ్చితంగా పవన్ అభిమానులకు నిరాశపర్చే వార్తే కదూ.....

Similar News