తెలుగుదేశం పార్టీ ని ఇరకాటంలో పెట్టేందుకు వైసీపీ అధినేత జగన్ కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న అధికారపార్టీకి వాయిస్ లేకుండా చేసేందుకు సిద్ధమవుతున్నారు జగన్. పార్టీ ఫిరాయంపులపై ప్రయివేటు బిల్లు మెంబర్ పెట్టించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలపై అనర్హత వేటు వేసేందుకు వీలుగా ఆర్టికల్స్ 102, 191 లను సవరించాలని కోరుతూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రయివేటు మెంబర్ బిల్లు పెట్టారు. సమావేశాల్లో బిల్లును అడ్మిట్ చేసుకున్నట్లు స్పీకర్ ప్రకటించడంతో టీడీపీ వైఖరిని ఎండగట్టాలని వైసీపీ ఎంపీలు నిర్ణయించుకున్నారు.
న్యాయపోరాటం కూడా.....
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎమ్మెల్యేలు 21 మంది వరకూ తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు చేస్తున్న కృషి ని చూసే తాము పార్టీని వీడుతున్నట్లు వారు చెబుతున్నారు. జగన్ ఏమి చేయలేక నిస్సహాతలో ఉండిపోయారు. ఫిరాయింపులపై న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పిటిషన్ కూడా వేశారు. తెలంగాణలో కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పీకర్ దీనిపై త్వరగా తేల్చాలని కూడా పేర్కొంది. తెలంగాణలో ఇచ్చిన తీర్పు ఏపీకి కూడా వస్తుందని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. అయితే ఒకపక్క న్యాయపోరాటం చేస్తూనే టీడీపీని జాతీయ స్థాయిలో ఎండగట్టాలంటే పార్లమెంటే వేదికని వైసీపీ భావిస్తుంది. అందుకే ప్రయివేటు మెంబర్ బిల్లు చర్చకు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఫిరాయింపుల అంశాన్ని జాతీయ స్థాయిలో ఫోకస్ చేయాలని జగన్ భావిస్తున్నారు. ఈ మేరకు ఎంపీలకు ఇప్పటికే పలు సూచనలు చేశారు. అంతేకాకుండా ఇకపై పార్టీని వీడి వెళ్లాలన్న ఆలోచన ఉన్నవారు కూడా పునరాలోచించుకుంటారని జగన్ టీం భావిస్తోంది. మొత్తం మీద ఫిరాయింపులపై పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు వైసీపీ సభ్యులు టీడీపీ పై ధ్వజమెత్తాలని వ్యూహం సిద్ధం చేసుకున్నారు.