నారా లోకేష్ కు మంత్రి పదవి గ్యారంటీ. ఆ విషయాన్ని తండ్రీ కొడుకులు వేర్వేరు సందర్భాల్లో ఎప్పుడో తేల్చేశారు. అయితే ఆయన మంత్రి అయ్యేది ఎప్పుడు? పార్టీ శ్రేణులు పండుగ చేసుకోవడానికి ఆ ముహూర్తం ఎప్పుడు పెట్టినట్టు? దీనికి సంబంధించి నారా లోకేష్ మంగళవారం నాడు చిన్న సంకేతాలు ఇచ్చారు. అలాగే తన మంత్రి పదవి ప్రమోషన్ గురించి కూడా సంకేతాలు ఇచ్చారు.
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంగళవారం నాడే ప్రారంభించింది. దీనికి సంబంధించి నారా లోకేష్ పార్టీ శ్రేణులకు టార్గెట్లు ఇచ్చారు. అరకోటి సభ్యత్వాల నమోదు లక్ష్యంగా పనిచేయాలని ఆయన పిలుపు ఇచ్చారు.
అయితే ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన సంగతేంటంటే.... గతంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నేనే పర్యవేక్షించాను... అప్పట్లో లక్ష్యాల్ని చేరుకున్నందువల్లే నాకు ప్రమోషన్ ఇచ్చారు. పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిని చేశారు. ఈసారి కూడా మనం లక్ష్యాలు చేరుకోవాలి. చేరుకోకపోతే గనుక.. మళ్లీ వెనక్కి సమన్వయకర్తగా పొమ్మంటారు అని లోకేష్ అన్నారు. పైకి అలా అన్నారు గానీ.. ఈ మాటలు.. ఈసారి కూడా లక్ష్యాన్ని చేరుకున్నట్లయితే రాబోయే మంత్రి పదవి ప్రమోషన్ గురించి సంకేతాలే అని.. పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సమర్థంగా సభ్యత్వనమోదు నడిపించిన నేతగా లోకేష్ కు మంత్రి పదవి దక్కుతుందని అంటున్నారు.
గొల్లుమంటున్న సీనియర్లు!
ఈసారి టార్గెట్ చేరుకున్న తర్వాతే ప్రమోషన్ సంగతి తేలుతుంది అన్నట్లుగా లోకేష్ చెప్పిన మాటలే గనుక నిజమయ్యేట్లయితే.. ఇంకా ఎన్నాళ్లు వెయిట్ చేయాలి అని మంత్రి పదవులు ఆశిస్తున్న పలువురు సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. అధికారంలోకి వచ్చిన నాటినుంచి చంద్రబాబునాయుడు కేబినెట్ లో మంత్రి పదవుల బెర్తులు ఖాళీగానే ఉన్నాయి. ఇప్పుడు పునర్ వ్యవస్థీకరణ ద్వారా భర్తీ చేయబోతున్నానని ఆయన కొన్ని నెలలుగా ఊరిస్తూనే ఉన్నారు. ఇప్పుడీ సభ్యత్వ టార్గెట్ ల ప్రస్తావన వచ్చిందంటే.. మరి కొన్ని నెలల పాటూ కేబినెట్ విస్తరణ వాయిదా పడినట్లే అని అంతా అనుకుంటున్నారు.
కనీసం పదవుల కోసం అయినా ఇప్పుడు తెలుగుదేశం లోని సీనియర్లు , సభ్యత్వ నమోదులో చురుగ్గా పాల్గొనాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.