Ys Jagan, KTR : కలయిక పరామర్శకే కాదట... పరమార్థం వేరే ఉందట
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిశారు. ఆయనను పరామర్శించారు
ఇద్దరు మిత్రులు కలిశారు. ఇద్దరూ చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు. ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. నందినగర్ లోని కేసీఆర్ ఇంటికి వచ్చిన జగన్ కు కేటీఆర్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్ కేటీఆర్‌తో ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత డీలా పడిన కేసీఆర్ కు భుజం తట్టి ధైర్యం చెప్పినట్లు ఆ ఫొటోలు చూస్తేనే కనిపిస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇటు కేసీఆర్ కాని, అటు జగన్ కాని ఎప్పుడూ ఒకరిపై ఒకరు విమర్శలకు దిగలేదు. పైగా తన ప్రమాణస్వీకారానికి కేసీఆర్‌ను జగన్ ఆహ్వానించారు. కేసీఆర్ కూడా జగన్ ప్రమాణస్వీకారానికి వెళ్లి ఆశీర్వదించారు.
తెలంగాణ ఎన్నికల్లో...
అయితే తెలంగాణ ఎన్నికల్లో తమ ఓటమికి చంద్రబాబు కూడా ఒక కారణమని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ కు ఫేవర్ చేయడానికే చంద్రబాబు చిట్టచివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్ కు పరోక్ష సహకారం అందించారని అందరూ అనుకుంటున్నదే. పైగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, చంద్రబాబుకు మధ్య సత్సంబంధాలు ఉండటం కూడా జగన్, కేసీఆర్ ల కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడే లంచ్ చేస్తున్న జగన్ ఏపీ రాజకీయాలపై కూడా కేసీఆర్ తో చర్చించనున్నారు. చంద్రబాబు, పవన్, బీజేపీలు కలసి కట్టుగా తనను ఓడించడానికి సిద్ధపడుతున్న తరుణంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఏపీ ఎన్నికల్లో...
సీనియర్ నేతగా, చంద్రబాబు ఆలోచనలు తెలిసిన వ్యక్తిగా కేసీఆర్ నుంచి కొన్ని సలహాలను జగన్ తీసుకునే అవకాశముంది. అయితే ఈ సందర్భంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడంపై కూడా చర్చ జరిగే అవకాశముంది. నిన్ననే కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేలపై వ్యతిరేకతే తమ ఓటమికి కారణమని, అభ్యర్థులను మార్చి ఉంటే గెలిచే వారమని అన్నారు. అభ్యర్థులను మార్చకపోవడంపై ఇప్పటికే బీఆర్ఎస్ అధినాయకత్వంలో చర్చ జరుగుతుంది. దీనిపై కూడా జగన్ కు కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశముంది. కేసీఆర్ తో జరిపిన ఏకాంత చర్చల్లో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఎదుర్కొనడంపైనే ఎక్కువ సేపు చర్చ జరిగినట్లు తెలిసింది.